న్యూఢిల్లీ: బిహార్‌లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్‌కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్‌తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్‌జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్‌జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం)
Comments
Please login to add a commentAdd a comment