మళ్లీ హత్యలు చేస్తానన్న ఎమ్మెల్యేపై వేటు
పట్నా: బిహార్లో అధికార జేడీయూ ఇద్దరు చట్ట సభ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్, ఎమ్మెల్సీ రాణా గంగేశ్వర్ సింగ్లను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్టు ఆ రాష్ట్ర జేడీయూ అధ్యక్షుడు వశిష్ట్ నరైన్ సింగ్ చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్న జేడీయూ కోర్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్కు ఈ విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు.
భగల్ పూర్ జిల్లా గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదో సారి ఎన్నికైన గోపాల్ మండల్.. తాను మళ్లీ హత్యా రాజకీయాలు చేస్తానని, గతంలో మాదిరిగా మళ్లీ హత్యలు చేస్తానని ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించారు. గతంలో ఆయనపై చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ రాణా గంగేశ్వర్.. జాతీయ గీతం బానిసత్వానికి గుర్తు అని, దీన్ని మార్చాలని వ్యాఖ్యానించారు. రాణా గంగేశ్వర్ గతేడాది బీజేపీని వీడి జేడీయూలో చేరారు.