Rana Sanaullah
-
'మేం పని పూర్తయ్యాకే స్పందిస్తాం'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తుపై ఇప్పుడే స్పందించబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. అలా చేయడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొంది. పఠాన్ కోట్ లోని భారత వైమానిక స్థావరంపై ఈ నెల(జనవరి) 2న పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ పోలీసు అధికారులు పలువురు ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే, ఈ దర్యాప్తునకు సంబంధించి గత రెండు రోజులుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే కొందరు మీడియా ప్రతినిధులు దర్యాప్తుపై ప్రశ్నించగా పాకిస్థాన్ న్యాయశాఖమంత్రి రాణా సనావుల్లా స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు తాము ఏ విధంగాను స్పందించబోమని ఆయన స్పష్టం చేశారు. విచారణ బృందం వారిపని వారు చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందికలిగించకుండా ఉండాలంటే ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. -
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
-
జైషే చీఫ్ అరెస్టుపై నోరు విప్పిన పాక్
లాహోర్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఉగ్రదాడుల నిందితులు, జైషే గ్రూపు ఉగ్రసంస్థ సభ్యులపై తీసుకుంటున్న చర్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు నోరువిప్పింది. ఉగ్రదాడుల సూత్రధారి, జైషే సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ గృహ నిర్బంధ కస్టడీలో ఉన్నట్లు పాక్ పేర్కొంది. కానీ, అతడిని అరెస్టు చేయలేదని న్యాయశాఖ మంత్రి రానా సనాఉల్లా తెలిపారు. మసూద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లుగా గురువారం కథనాలు వచ్చాయి. వాటిపై పాక్ వివరణ ఇచ్చుకుంది. పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులెవన్నది తెలియకుండా మసూద్‌ను ఎలా అరెస్టు చేస్తామని సనావుల్లా ప్రశ్నించారు. ఈ ఘటనపై పాక్ దర్యాప్తు చేపట్టిందని, సాక్ష్యాధారాల కోసం ప్రయత్నాలు చేపట్టిందన్నారు. మరోవైపు భారత్ వాదన ప్రకారం.. ఈ ఏడాది జనవరి 2న ఎయిర్ బేస్ క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనకు మసూద్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తోంది. మసూద్ అరెస్ట్ వార్త స్వాగతించదగినది... పాక్ తీసుకున్న తొలి చర్యకు సంతోషమే, కానీ అతడి అరెస్ట్ వార్తను అధికారికంగా పేర్కొనకపోవడంపై విదేశాంగశాఖ మంత్రి వికాస్ స్వరూప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి మసూద్ వివరాలను మీడియాకు వెల్లడించారు.