'మేం పని పూర్తయ్యాకే స్పందిస్తాం'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తుపై ఇప్పుడే స్పందించబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. అలా చేయడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొంది. పఠాన్ కోట్ లోని భారత వైమానిక స్థావరంపై ఈ నెల(జనవరి) 2న పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ పోలీసు అధికారులు పలువురు ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే, ఈ దర్యాప్తునకు సంబంధించి గత రెండు రోజులుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే కొందరు మీడియా ప్రతినిధులు దర్యాప్తుపై ప్రశ్నించగా పాకిస్థాన్ న్యాయశాఖమంత్రి రాణా సనావుల్లా స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు తాము ఏ విధంగాను స్పందించబోమని ఆయన స్పష్టం చేశారు. విచారణ బృందం వారిపని వారు చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందికలిగించకుండా ఉండాలంటే ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.