Omicron Variant: మళ్లీ ఆంక్షల చట్రంలోకి.. మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి
లండన్, జోహెన్నెస్‌బర్గ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్(బి.1.1.529) కేసులు పలు దేశాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కేసులు నిర్ధారణయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బ్రిటన్‌లో ముగ్గురికి, ఆస్ట్రేలియాలో ఇద్దరికి, జర్మనీలో ఇద్దరికి, ఇటలీ, ఇజ్రాయెల్, బెల్జియంలలో ఒక్కొక్కరికీ ఈ వేరియెంట్ సోకిందని పరీక్షల్లో తేలింది.
ఇక దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైతే వారిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఖతర్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెల్టా కంటే శరవేగంగా ఈ వేరియెంట్ కేసులు వ్యాపిస్తూ ఉండడంతో భయాందోళనలకు లోనైన 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. ఇజ్రాయెల్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది.
యూకేలో మళ్లీ మాస్కులు
ఇంగ్లాండ్‌లో మంగళవారం నుంచి దుణాకాలు, వ్యాపారసముదాయాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మంగళవారం నుంచి మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయనున్నారు. యూకేకు వచ్చే విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావేద్ ఆదివారం వెల్లడించారు. మొరాకో సోమవారం నుంచి రెండువారాల పాటు తమ దేశంలోకి వచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది.
ప్రపంచానికి త్వరితంగా వెల్లడిస్తే శిక్షిస్తారా?
ఒమిక్రాన్ వేరియెంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల్ని రానివ్వకపోవడం అత్యంత క్రూరమైన చర్యని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఎంతో ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి కొత్త వేరియెంట్‌ని కనుగొనడం తమకు శిక్షగా మారిందని అంటోంది. ‘‘సైన్స్ అద్భుతం చేస్తే ప్రశంసించాలి కానీ శిక్షించకూడదు’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
‘రిస్క్’ ఉన్న దేశాల నుంచి వస్తే...
ఆర్టీ–పీసీఆర్ ఫలితాలొచ్చాకే ఇంటికి
న్యూఢిల్లీ: ‘రిస్క్’ దేశాల నుంచి (ఒమిక్రాన్ జాడలు బయటపడుతున్న దేశాలు) లేదా వాటిమీదుగా వస్తున్న ప్రయాణికులు అందరూ భారత్‌లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాలు వచ్చేదాకా వారు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ట్రాన్సిట్‌లో ఉన్న వారు కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే... తదుపరి ప్రయాణం నిమిత్తం విమానాల్లోకి బోర్డింగ్ కావొచ్చని తెలిపింది.
సురక్షిత జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తారని, అయితే 14 రోజుల పాటు వీరు స్వీయ ఆరోగ్యపరిరక్షణ చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఐదుశాతం మందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యోశాఖ వెల్లడించింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా ఈ నెల 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంటో, కాదో తేల్చుకోవడానికి అతని శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
వ్యాక్సిన్ రక్షణను ఏమార్చొచ్చు: గులేరియా
‘‘ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కొమ్ములో 30 పైచిలుకు జన్యుపరమైన మార్పులున్నట్లు సమాచారం. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయనేది (ఈ వేరియెంట్ నుంచి ఎంతమేరకు రక్షణ కల్పిస్తాయనేది) నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.
వైరస్ పైనుండే కొమ్ముల ద్వారానే కరోనా ఆతిథ్య కణంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుందనే విషయం తెలిసిందే. ‘ఎక్కువమటుకు వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్ (వైరస్‌పై నుంచే కొమ్ములకు)లకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. అలాంటి స్పైక్ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో జన్యుపరమైన మార్పులుంటే యాంటీబాడీలు వాటిని అంత సమర్థంగా అడ్డుకోలేకపోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనేది పరిశోధించి నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు.
రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు
ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ముప్పు అన్ని దేశాలకు పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచడం, కరోనా పరీక్షలు ఎక్కువ చేయడం, కరోనా హాట్‌స్పాట్‌ల్లో నిరంతర పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయడం, ప్రజలందరూ కోవిడ్–19 నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్, బోస్ట్వానా నుంచి వచ్చే ప్రయాణికుల్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని, అందరికీ కరోనా పరీక్షలతో పాటు ఏ వేరియెంట్ సోకిందో తెలిసే వరకు క్వారంటైన్లో ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించానికి ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపాలన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. 5శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉండేలా రాష్ట్రాలన్నీ చర్యలు చేపట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్ అన్న విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కృషి చెయ్యాలన్నారు.