Ranjanben Bhatt
-
మోడీ లేక... ఓట్లు రాక
వడోదర: గుజరాత్ లోని వడోదర లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికారి బీజేపీ అభ్యర్థి రంజన్ బెన్ భట్టా 3,29,507 ఓట్ల మెజార్టితో గెలుపొందారు. మొత్తం 7,32,339 ఓట్లు పోల్ కాగా, రంజన్ బెన్ కు 5,26,763 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్ కు 1,97,256 ఓట్లు వచ్చాయి. 14,257 మంది 'నోటా' నొక్కారు. ఇద్దరు స్వతంత్రులు డిపాజిట్ కోల్పోయారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన నరేంద్ర మోడీ 5,70,128 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే అప్పటితో పోలిస్తే ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. మోడీ పోటీ చేసినప్పుడు 11.63 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 7.3 లక్షలకు పడిపోవడం గమనార్హం. -
ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ చాలా చోట్ల గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే... కేవలం రెండు చోట్ల మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మిగిలిన 9 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ దూసుకుపోతోంది. ఈ పదకొండు స్థానాలు బీజేపీవే. ఉత్తరప్రదేశ్‌లో పెచ్చరిల్లిన అత్యాచారాలు, మతఘర్షణలు ఉపఎన్నికలపై ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ఈ ఎన్నికల్ని చాల సీరియస్‌గా తీసుకున్నారు. మతఘర్షణలతో ఓట్లు చీలి ఉత్తరప్రదేశ్‌లో లాభపడతామని ఆశించిన బీజేపీకి ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించేవే. అటు మోడీ ఖిల్లా గుజరాత్‌లోనూ రాజకీయాలు మారిపోయాయి. బీజేపీకి చెందిన సిట్టింగ్ స్థానాలు రెండింటిలో కాంగ్రెస్ పాగా వేసింది. గుజరాత్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కేవలం ఆరు స్థానాల్లోనే బీజేపీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. గడిచిన 12 ఏళ్లలో గుజరాత్లో మోడీ లేకుండా జరిగిన తొలిఎన్నికలివి. ఇక గుజరాత్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం బీజేపీని ఇబ్బందుల్లో నెట్టినట్టు కనిపిస్తోంది. ఉపఎన్నికల్లో సీనియర్ నేతలెవరూ ప్రచారం చేయలేదు. మోడీ ఎమ్మెల్యేగా ఉన్న మణినగర్ నియోజకవర్గంలో కేవలం 33 శాతం పోలింగ్ నమోదవటం గుజరాత్ ఓటర్ల నిరాకస్తతను తెలిపింది. వడోదరాలో భారీ మెజార్టీతో రంజన్ బెన్ గెలవడం బీజేపీకి ఊరటే. ఇక రాజస్థాన్‌లోనూ కమలం వాడిపోయింది. నాలుగు సిట్టింగ్ స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్‌కు అప్పగించింది. ఒక్క చోట మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. అటు శారదా చిట్స్ స్కామ్ మమతా బెనర్జీ సర్కారుపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు తప్పాయి. బెంగాల్లో ఉపఎన్నికలు జరిగిన రెండు చోట్ల ఓ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్, మరో స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. -
వడోదరలో భారీ ఆధిక్యంతో బీజేపీ విజయం
వడోదర : ప్రధాని నరేంద్ర మోడీ కంచుకోట అయిన వడోదరను భారతీయ జనతా పార్టీ మరోసారి కైవసం చేసుకుంది. వడోదర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ బెన్ భట్టా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్‌పై లక్షా 83 వేల ఓట్ల మెజార్టీతో రంజన్ బెన్ గెలుపొందారు. మోడీ వడోదర స్థానం నుంచి గెలుపొంది ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. మొత్తం 2,86,880 ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి 1,04,540 ఓట్లు గెలుచుకున్నారు. మరోవైపు గుజరాత్‌లోని మణినగర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకుంది.