Ransomware Cyber Attack
-
మన నిర్లక్ష్యానికి మూల్యమెంత?
కొన్ని సంఘటనలు అంతే... పెనునిద్దర నుంచి పెద్ద మేలుకొలుపుగా పనిచేస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన సైబర్‌దాడి అలాంటిదే. నవంబర్ 23న ఆగంతకులు భారీమొత్తం డిమాండ్ చేస్తూ జరిపిన రాన్సమ్వేర్ దాడితో కుప్పకూలిన సర్వర్లు పన్నెండు రోజులైనా ఇప్పటికీ బాగు కాలేదు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆరోగ్యరక్షణ సంస్థలోని ఈ ఘటన మన దేశ సైబర్ భద్రతా మార్గదర్శకాలను సమగ్రంగా పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. డిజిటల్ ఇండియా పేరిట అన్ని రకాల ప్రభుత్వ విధులనూ, ప్రజా సేవలనూ, నగదు చెల్లింపులనూ ఆన్లైన్లో జరపాలని ప్రోత్సహిస్తున్నవేళ అత్యవసరం వచ్చిపడింది. సైబర్ దాడులు అంటువ్యాధిలా వ్యాపించి, ఎయిమ్స్ ఘటన లాంటివి మరిన్ని జరగక ముందే సురక్షిత వ్యవస్థనూ, ఆపత్సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులనూ సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యమని తెలిసివచ్చింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. డిసెంబర్ 1న జలశక్తి శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఇటీవల ఓ ప్రభుత్వ శాఖపై జరిగిన రెండో పెద్ద సైబర్ దాడి ఇది. నవంబర్‌లో ఢిల్లీలోనే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌పైనా సైబర్ దాడి జరిగింది. నిజానికి, ఆరోగ్య రంగంపై సైబర్ దాడుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉందని సైబర్ భద్రతా నిఘా సంస్థ క్లౌడ్‌సెక్ లెక్క. ఒక్క 2021లోనే దేశంలోని సైబర్ దాడుల్లో 7.7 శాతం ఆరోగ్య రంగంపై జరిగినవే. గత మూడేళ్ళలో భారత్‌లో సైబర్ దాడులు 3 రెట్లు పెరిగాయి. సైబర్ ముప్పును ఎదుర్కోవడా నికి ఉద్దేశించిన ప్రధాన సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ–ఇన్) డేటా ప్రకారం 2019లో జరిగిన ఉల్లంఘనలు 3.94 లక్షల చిల్లర. 2020లో అది 11.58 లక్షల పైకి, 2021లో 14.02 లక్షలకూ ఎగబాకింది. ఈ ఏడాదిలో జూన్ నాటికే 6.74 లక్షలయ్యాయి. వెరసి మూడున్నరేళ్ళలో 30 లక్షలకు పైగా కేసులొచ్చాయి. కానీ, సైబర్ భద్రతా నిధుల వినియోగం అర కొరగా సాగింది. రూ. 213 కోట్లు మంజూరైతే, రూ. 98.31 కోట్లే ఖర్చు పెట్టడం నిర్లక్ష్యానికి నిలువు టద్దం. అంతకన్నా దారుణం ఎయిమ్స్‌లో 30–40 ఏళ్ళుగా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లను మార్చక పోవడం. ఈ ఇక్ష్వాకుల కాలపు సామగ్రి పట్ల ఆందోళన వ్యక్తమైనా పట్టించుకున్న నాధుడు లేడు. పైగా ఐటీ ఓనమాలు తెలీని డాక్టర్ గారే ఇప్పటికీ అక్కడ కంప్యూటర్ విభాగాధిపతి అంటే ఏమనాలి! 2004లో తొలి డిజిటల్ దాడి రికార్డయిన నాటి నుంచి ఇప్పటి దాకా సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. విస్తరించిన ఇంటర్నెట్కు విపరిణామం – ప్రపంచవ్యాప్త సైబర్ భద్రతా ఉల్లంఘనలు. నిజానికి, ప్రపంచంలో అత్యధికంగా డేటా చౌర్యం జరుగుతున్న దేశాల్లో భారత్‌ది 6వ స్థానం. ప్రతి వంద మంది భారతీయుల్లో 18 మంది డేటా చోరీ అయిందని నెదర్లాండ్స్ సంస్థ సర్ఫ్‌షార్క్ మాట. మన పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఈ ఏటి నివేదికలో పొంచివున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి అంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రశ్న. సైబర్ ముప్పుపై తగిన నియంత్రణ వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్–ఐటీ శాఖ కింద ‘సైబర్ భద్రతా విభాగా’న్ని కేంద్రం నెలకొల్పింది. అది ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలీదు. ఎయిమ్స్ సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ఎన్ఐఏ, డీఆర్డీఓ, గూఢచారి విభాగం, సీబీఐ నిపుణులను బరిలోకి దింపాల్సి వచ్చింది. రక్తం చిందని ఈ అభౌతిక, ఆధునిక యుద్ధంతో ఉక్రెయిన్ – ఆస్ట్రేలియాల్లో పవర్ గ్రిడ్లు, నిరుడు మన దేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇరాన్లో అణు సదుపాయాలు, జార్జియాలో టెలికామ్ సేవలు, వివిధ దేశాల్లో ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. అవన్నీ వాటి పొరుగు శత్రుదేశాల పనే. ఇక, మేధాసంపత్తి హక్కులు, వ్యక్తిగత డేటా చౌర్యాలు లెక్కలేనన్ని. ఐటీ సిస్టమ్స్‌పై దాడితో డేటాను ఎన్‌క్రిప్ట్ చేసేసి, సమాచారాన్ని తిరిగి అందుబాటులో ఉంచాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసే రాన్సమ్వేర్ దాడులు ప్రధానంగా మున్సిపిల్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకులు సహా ఆర్థిక సేవలపై విరుచుకుపడుతున్నాయి. ఇవాళ మన బ్యాంక్ సేవల నుంచి టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్‌లు, పాస్‌పోర్ట్ సమాచారం, పౌర విమాన యానం దాకా అంతా డిజటలే! స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటున్న పాలకులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే సైబర్ ముప్పుపై దృష్టి పెట్టకుంటే ప్రాథమిక వసతులకూ పెను ప్రమాదమే! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే సమగ్ర సైబర్ భద్రతా విధానం కావాలి. ఘటన జరిగాక హడావిడి కాక ముందుగానే వాటిని నివారించేందుకు సీఈఆర్టీ–ఇన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను సంసిద్ధం చేయాలి. డిజిటల్ సేవలు కావాల్సిందే గనక సమాచార నిల్వ, ఆపత్కాలంలో తిరిగి తీసుకొనేలా సమర్థ విధానాలు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలి. సైబర్ రక్షణ రంగా నికి నిధులిచ్చి, అత్యాధునిక కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) పరిష్కారాలతో సత్తా సమ కూర్చుకోవాలి. అప్పుడే డిజిటల్ ప్రపంచం సురక్షితమవుతుంది. ఈ కృషిలో నూతన ఆవిష్కరణలం దేలా ఉత్ప్రేరణ కలిగించాల్సింది విధాన రూపకర్తలే. అప్పుడే డిజిటల్ ఇండియా విజయం సాధ్యం! -
హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్
రోజు రోజుకి హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ ముసగువీరుల దాటికి సాదారణ వ్యక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యాకర్లకు భారీ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇటీవలు కలోనియల్ పైప్‌లైన్ కంప్యూటర్లను హ్యాక్ చేసి సుమారు 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హ్యాకర్లు, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం పంపిణీదారు అయిన జెబిఎస్‌పై సైబర్ దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలు స్తంభించడంతో కంపెనీ వ్యాపారం బాగా దెబ్బతింది. జెబిఎస్ యుఎస్ఎ హోల్డింగ్స్ ఇంక్. సైబర్ క్రైమినల్స్ కు 11 మిలియన్ డాలర్ల(రూ. 80 కోట్ల) చెల్లించినట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రీ నౌగెరా వెల్లడించారు. జెబిఎస్ కంపెనీ అమెరికా దేశ మాంసం సరఫరాలో ఐదవ వంతును ఈ సంస్థే సరఫరా చేస్తుంది. జెబిఎస్‌పై ఆధారపడే రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, రైతులకు మరింత నష్టం కలగ కుండ ఉండటానికి నగదు చెల్లించాల్సి వచ్చినట్లు బ్రెజిల్ మాంసం సంస్థ జెబిఎస్ యుఎస్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రీ నోగుఇరా చెప్పారు. "నేరస్థులకు డబ్బు చెల్లించడం చాలా బాధాకరం, కాని మేము మా కస్టమర్ల కోసం సరైన పని చేసాము" అని నోగ్యురా బుధవారం ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మెజారిటీ జెబిఎస్ ప్లాంట్లు తిరిగి పనిచేస్తున్న తర్వాత ఈ చెల్లింపులు చేసినట్లు ఆయన అన్నారు. ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా, ఐరోపాకు గొడ్డు మాంసం, పౌల్ట్రీ, పంది మాంసం ప్రాసెస్ చేసి విక్రయించడంలో జెబిఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం సంస్థ. యుఎస్‌లో ఈ సంస్థ అతిపెద్ద గొడ్డు మాంసం సరఫరా దారుగా ఉంది. అమెరికాలో జెబిఎస్ కంపెనీకి తొమ్మిది గొడ్డుమాంసం ప్రాసెస్ చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిపై గత వారం రాన్సమ్వేర్ ముఠా ఒకటి సైబర్ దాడి చేసింది. దీంతో ఆయా కర్మాగారాల్లో ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ముఠాతో కూడా రష్యాకు సంబంధాలు ఉండొచ్చని ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాను ‘రెవిల్’ లేదా ‘సోడినోకిబి’ అంటారు. చదవండి: ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల -
మొబైల్స్ లక్ష్యంగా సైబర్ క్రైమ్స్
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో సైబర్ నేరస్తుల దృష్టి స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై పడింది. లాక్ డౌన్ వల్ల అత్యధికులు స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే ఇంటర్నెట్ను వినియోగిస్తున్న నేపథ్యంలో స్పైవేర్, రాన్సమ్వేర్ల ప్రమాదం వారికి పొంచి ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్–ఇన్)’ హెచ్చరించింది. వినియోగదారుడి ముఖ్యమైన వ్యక్తిగత డేటాను స్పైవేర్ సంగ్రహిస్తుంది. లాగిన్ వివరాల వంటి కీలక రహస్యాలను రాన్సమ్వేర్ తన అధీనంలోకి తీసుకుంటుంది. ఆ తరువాత యూజర్ నుంచి డబ్బు డిమాండ్ చేసి, ఆన్లైన్లో ఆ డబ్బు అందిన తరువాత అవి ఆ వివరాలను విడుదల చేస్తాయి. వ్యక్తిగత ఫోన్లను ఈ ప్రమాదాల నుంచి తప్పించేందుకు సెర్ట్–ఇన్ పలు సూచనలను ఇచ్చింది. అవి... 1) మొబైల్ పరికరణాలు, యాప్స్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫోన్లోని వ్యక్తిగత డేటాను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. 2) ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ఓఎస్‌ను అందించే సంస్థలు కొన్ని అదనపు సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా యూజర్స్‌కు అందుబాటులో ఉంచుతుంటాయి. 3) ఉపయోగించని యాప్స్‌ను తొలగించాలి. 4) అధికారిక యాప్ స్టోర్స్ నుంచే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 5) ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఇతర యాప్స్‌లోకి సైన్ ఇన్ కావడంపై అప్రమత్తంగా ఉండండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో అనుసంధానమైన యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆయా సైట్ల నుంచి తీసుకునే ప్రమాదముంది. అలాగే, ఆయా యాప్స్ నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా మీ సమాచారాన్ని సంగ్రహించవచ్చు. 6) ఎస్ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని సోర్స్‌ల ద్వారా ఆ లింక్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకండి. 7) పాస్‌వర్డ్స్‌ను సేవ్ చేసుకోవాలని కొన్ని యాప్స్ కోరుతుంటాయి. అలా సేవ్ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ఒకవేళ ఫోన్ పోతే, మీ వివరాలన్నీ బహిర్గతం అయ్యే ప్రమాదముంది. 8) పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పబ్లిక్ వైఫై వాడాల్సి వస్తే.. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసే యాప్స్‌ను ఓపెన్ చేయకండి. అలాగే, మీ ఫోన్లోని బ్లూటూత్‌ను అనవసరంగా ఆన్‌లో ఉంచకండి. 9) మొబైల్ డివైజ్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చకండి. 10) మీ నియంత్రణ లేని కంప్యూటర్ లేదా చార్జింగ్ స్టేషన్ ద్వారా ఫోన్ ను చార్జింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి. -
మళ్లీ ‘ర్యాన్సమ్వేర్’ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: గతేడాది ప్రపంచ దేశాలను వణికించిన ‘ర్యాన్సమ్వేర్’మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ సర్వర్‌ను టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. డేటాను విడుదల చేయాలంటే బిట్‌కాయిన్స్ రూపంలో 800 డాలర్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకపోవడంతో కొంత డేటాను క్రాష్ చేశారు. ఈ నెల 9వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ సైబర్ దాడి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ చాంద్‌పాషా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సిస్టమ్స్‌తోపాటు సర్వర్ లాక్ హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన సర్వర్ టెలిఫోన్ భవన్లో ఉంది. ఈ వెబ్ సర్వర్‌ను అంతర్గత సమాచార మార్పిడి(ఇంట్రానెట్) కోసం వినియోగిస్తుంటారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి 12.27 గంటలకు ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. ఈ విషయం గుర్తించిన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌లను సైబర్ నేరగాళ్లు ఈ మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ కంప్యూటర్లలోకి ప్రవేశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ అయిపోయి సిస్టమ్స్‌తోపాటు సర్వర్ సైతం లాక్ అయింది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ ఇంట్రానెట్‌లోని డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’ని ట్రాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంట్రానెట్‌లో ఉన్న ఒక్కో హెచ్‌టీఎంఎల్ ఫైల్.. ఒక్కో ఫోల్డర్‌గా మారింది. 800 డాలర్లు చెల్లించాలని డిమాండ్ ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి తమకు 800 అమెరికన్ డాలర్లు బిట్‌కాయిన్స్ రూపంలో చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తూ పాప్అప్స్ పంపారు. దీనికి నిర్ణీత గడువు సైతం విధించారు. దీనికి బీఎస్ఎన్ఎల్ అంగీకరించకపోవడంతో గంటలోనే కొంత డేటాను క్రాష్ చేశారు. ర్యాన్సమ్వేర్ ప్రభావంతో క్రాష్ అయిన డేటా ప్రస్తుతం రిట్రీవ్ చేసే స్థితిలో లేకుండా పోయింది. దీనిపై బీఎస్ఎన్ఎల్ సబ్–డివిజినల్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లక్ష్మణ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అటాక్ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్లు ఏ విధానంలో డబ్బు చెల్లించమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ముఖ్యం కాకపోయినా.. సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీవో ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయరని, దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ– మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉం డటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. అయితే ర్యాన్సమ్వేర్ దాడితో బీఎస్ఎన్ఎల్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వినియోగదారుల డేటా భద్రంగా ఉందని, అది ఇంట్రానెట్ సర్వర్‌లో ఉండదని చెపుతున్నారు. -
సైబర్ అటాక్‌పై మైక్రోసాప్ట్ మండిపాటు
వాషింగ్టన్ : వనా క్రై అనే సైబర్ అటాక్ తో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ హడలిపోయిన సంగతి తెలిసిందే. కారు సంస్థలు, ఆసుపత్రులు, స్కూల్స్, షాపుల్లో ఇది బీభత్సం సృష్టించింది. మరోసారి ఈ రోజు కూడా ఇది పంజా విసరనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అటాక్ కు అమెరికా ప్రభుత్వమే కారణమంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడుతోంది. ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్, అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించేందని, దీన్ని ఏప్రిల్ లో ఆన్ లైన్ లీక్ చేసినట్టు మైక్రోసాప్ట్ అధినేత బ్రాడ్ స్మిత్ తన బ్లాక్ పోస్టులో పేర్కొన్నారు. రీసెర్చర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టీకరించినట్టు తెలిపారు. ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ల దుర్భలత్వాన్ని బ్రాడ్ స్మిత్ ఎత్తిచూపారు. అంతకముందు కూడా అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్దీ హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేసి, వాటితో ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచుతుందని వికిలీక్స్ రివీల్ చేసిందని, ప్రస్తుతం జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు బలవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ దాడితోనైనా అమెరికా ప్రభుత్వం మేల్కోవాలని, ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అయితే మైక్రోసాఫ్ట్ చేసిన కామెంట్లపై ఎన్ఎస్ఏ కాని, వైట్ హౌజ్ కాని ఇప్పటివరకు స్పందించలేదు. దాడికి గురైన చాలా సిస్టమ్స్ బ్యాకప్స్ తో రికవరీ చెందుతున్నారని స్కాట్ బోర్గ్ చెప్పారు. ఈ దాడిపై శుక్రవారం రాత్రి తమ హోమ్ లాండ్ సెక్యురిటీ అడ్వయిజర్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు.