ఇది నిబంధనల నిమజ్జనం
రెండోమాట
స్నానం చేయడానికి చాలినంత నీరు లేని రాష్ట్రంలో ఏర్పాట్ల కోసం రూ. 600 కోట్లు ఖర్చు చేశా డట ఒక రాష్ట్ర పాలకుడు. ఇంకో రాష్ట్ర పాలకుడు అవే ఏర్పాట్ల ఖర్చును రూ. 1,600 కోట్లుగా చూపుతున్నాడు. నీళ్ల వ్యాపారులు ‘శుద్ధి’ చేసిన జలాలను సీసాలలో పట్టి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే ఒక అధికారి, ‘పుష్కరాలను ఘనంగా జరిపించామన్న బిరుదులు, కితాబులతో తమ కీర్తిని పెంచుకుందామని ప్రభుత్వం తలచిందే గానీ, ప్రజలకు కల్పిం చవలసిన కనీస సదుపాయాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది’ అని వ్యాఖ్యానించారు.
‘నాకింత శక్తినివ్వవయ్యా అని కోరితే- నాకాయన కష్టాలు ప్రసాదించాడు!
నాకింత బుర్ర, బుద్ధీ ప్రసాదించమంటే- దుష్కరమైన సమస్యలను ముఖాన కొట్టి పరిష్కరించుకోమన్నాడు.
నాకింత సుఖాన్ని ప్రసాదించమని అర్థిస్తే-కొందరు అసంతృప్త జీవు లను చూపాడు.
నాకింత శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తే-కష్టించి పనిచేసుకోమని అవకాశం కల్పించాడు.
అయ్యా, నాకింత ప్రశాంతిని దానం చేయమంటే - ఇతరులకు ఎలా సాయపడాలో చూపాడు!
కానీ-ఇంతకూ నేను కోరినవేవీ అతనివ్వలేదు. అయినా నాకు కావలసి నవన్నీ ఇచ్చాడు గదా!’
(మనిషి తన భవిష్యత్తుకు తానే సృష్టికర్త-మ్యాన్ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ- అని పదే పదే గుర్తు చేసిన వివేకానందుడు తాను ఏం కావాలని కోరుకున్నాడో, ‘దేవుడు’ ఏం ప్రసాదించాడో ఒక సందర్భంలో చెప్పిన మాటలు)
బతికుండగా మంచినీళ్లకు కూడా కటకటలాడించి వల్లకాట్లో మాత్రం పాడియావులను దానం చేసే సంస్కృతికి అలవాటు పడిన పరాన్నభుక్కులకు పాలకుల ఆశీర్వాదాలు ఉన్నంతకాలం ఈ దేశంలో మత ప్రసక్తి లేని, మూఢ విశ్వాసాల జాడలేని సెక్యులర్ వ్యవస్థను నిర్మించుకోవడం సాధ్యంకాదు. ప్రచార ఆర్భాటంతో, స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు సాగించే కార్య క్రమాలు ప్రజల నిజమైన సంక్షేమానికి ఉపకరించవు. ప్రజల ఆకాంక్షలకే కాదు, వారి ప్రాణాలకు రక్షణ కూడా కల్పించలేవు. ఇందుకు రెండు తాజా నిదర్శనాలు- గోదావరి మహా పుష్కరాలలోనూ, పూరీ జగన్నాథ రథోత్స వంలోనూ జరిగిన తొక్కిసలాటలే. 2003 పుష్కరాలకు 3.5 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి ఆ సంఖ్య ఐదు కోట్లకు (ఇప్పటికి) పెరగడం ఏ పరిణా మానికి నిదర్శనం? ప్రజలలో ఆత్మ విశ్వాసం ఉదయించడానికి దోహదపడే రాజ్యాంగ విధులనూ, బాధ్యతలనూ గడచిన 65 ఏళ్ల స్వాతంత్య్ర జీవనంలో పాలకులూ, నాయకులూ విస్మరించడమే ఆ పరిణామానికి కారణం. ఆర్థిక వ్యవస్థను ప్రజాబాహుళ్యానికి ప్రయోజనకరంగా మలచడంలోనూ, సాంఘిక సంస్కరణల ద్వారా అసమానతలను రూపుమాపడంలోనూ, భారతీయ తాత్విక సంప్రదాయంలోని హేతువాద సంపదను సద్వినియోగం చేసుకుని ప్రజలను చైతన్యవంతులను చేయడంలోను పాలకులు ఘోరంగా విఫలమ య్యారు. అంతేకాదు, పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన ‘ప్రాథమిక బాధ్యతల’ నుంచి (51 ఏ అధికరణ, ఎఫ్/ హెచ్ నిబంధనలు) దూరంగా జరిగారు.
ఏదీ ఆ నిబంధనల అమలు?
బహుళ జాతులతో, సంస్కృతులతో దీపిస్తున్న భారతీయ ఉమ్మడి సంపన్న వారసత్వ విలువలను కాపాడుకోవాలని ‘ఎఫ్’ నిబంధన శాసిస్తుండగా, పౌరులలో శాస్త్రీయ దృక్పథాన్నీ, మానవతావాదాన్నీ, జిజ్ఞాసాపూర్వక పరిశీ లనాశక్తినీ, సంస్కరణా ధోరణులనూ పెంపొందించాలని ‘హెచ్’ నిబంధన ఆదేశిస్తున్నది. కాబట్టి పాలకులు వేసుకోవలసిన ప్రశ్న- ప్రజానీకంలో భక్తి రసం తెప్పలుగా పారుతోందా, లేదా? అన్నది కాదు, ఢిల్లీ నుంచి కింది వరకు ‘ప్రాథమిక బాధ్యత’ను తాము సక్రమంగా నిర్వర్తిస్తున్నామా, లేదా? అనే. కుల, మత, వర్గ వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పౌరులందరికీ సమానావకాశాలు, ఉపాధి కల్పన ద్వారా శాంతి సౌమనస్యాలను కల్గించడం పాలకుల విధి అని ‘ప్రియాంబుల్’ శాసిస్తున్నది. దానిని ఎందుకు పాలకులు పాటించడం లేదు? దోపిడీ పద్ధతులనూ, అలాంటి వ్యవస్థనూ నిషేధిస్తున్న రాజ్యాంగ నిబంధనలను వారు ఎందుకు కాలరాస్తున్నట్టు? సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో 38/39 అధికరణల మేరకు దేశ సంపద, సహజ వనరులు ప్రజలందరి సొత్తు, కొలదిమంది వ్యక్తులది కాదు అని పదేపదే గుర్తు చేయవలసి రావడం ఎందుకు? పాలనా వ్యవస్థా, పాలకులూ పూర్తిగా గాడి తప్పాయని అత్యున్నత న్యాయస్థానం పలుసార్లు హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు? ఇదంతా ఏ పరిణామానికి నిదర్శనమో పాలకులు చెప్ప గలరా? రాజ్యాంగం అప్పగించిన ఈ కనీస బాధ్యతను గురించి గుర్తు చేసే సాహసం చేసిన న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను అదుపు చేయడానికి ఇటీవల ముమ్మర యత్నం జరుగుతున్న మాట నిజమా, కాదా? న్యాయ వ్యవస్థ వెలు వరించే కొన్ని తీర్పులు అసమంజసంగా కొందరికి కనబడుతున్నప్పటికీ ఆ వ్యవస్థ స్వేచ్ఛను అపహరించే ప్రయత్నం చేయడం కన్నా, దానిని సంస్క రించడానికి ప్రయత్నించాలి. ప్రజా బాహుళ్యం, దేశ ప్రయోజనాలకు ఇది అవసరం.
లుప్తమవుతున్న హేతువాద దృక్పథం
ప్రాథమిక బాధ్యతలలో భాగంగా రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని అలవరు చుకోవాలని కూడా నిర్దేశిస్తున్నది. కాబట్టి మూఢ విశ్వాసాల బారిన పడిన వారిని చైతన్యవంతులను చేసే కృషి జరగాలి. ఈ కృషిలో పాలకులు భార తీయ తాత్విక దృక్పథానికి చెందిన షడ్దర్శనాలలో హేతువాదాన్ని ఆశ్రయిం చిన తొల్లింటి జైన, బౌద్ధ, చార్వాక, లోకాయత, సాంఖ్య, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస సిద్ధాంతకర్తలను భారతీయ సంస్కృతికి అసలైన ప్రతినిధు లుగా మరొక్కసారి గుర్తించి ప్రకటించాలి. కపిలుడు, కణాదుడు ఈ సంస్కృ తిలో ఎదిగివచ్చిన ప్రతిభామూర్తులన్న సంగతి విస్మరించరాదు. నేటి రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా ఉన్న పూర్ణకుంభానికి రూపకర్త ఇప్పుడు షెడ్యూల్డ్ కులంగా పేర్కొంటున్న ‘మాల’ వర్గానికి చెందిన విధికుడు. నాగో పాధ్యాయ అనే ఉపాధ్యాయుడి కుమారుడు. దైవం శక్తిని నిర్గుణ, నిరాకా రమని ప్రకటించుకున్న తరువాత ఆకారం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? అని గౌడపాదుడు ప్రశ్నించాడు. కపిలుడి సాంఖ్యసూత్రాలు, కణా దుడి ‘అణు’సిద్ధాంతం హేతువాదానికి ప్రతీకలుగా పేర్గాంచాయి. తొల్లింటి భారతీయుల తాత్వికత ‘మూర్త’ (విగ్రహ) సంప్రదాయం కాదు, ‘అమూర్త’ (విగ్రహ రహిత) సంప్రదాయమేనని తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచు రించిన ‘ఆర్ష విజ్ఞాన సర్వస్వం’ పేర్కొంటున్నది. శ్వేతకేతుకూ, అతడి తండ్రి ఉద్దాలకునికీ మధ్య జరిగిన ప్రశ్నజవాబులు హేతువాదాన్ని బలపరిచేవే. గ్రీకుల డెమోక్రిటిస్, తొల్లింటి మన గణితశాస్త్రవేత్తలు ఆర్యభట్టు, భాస్కర ఒక కోవకు చెందిన భౌతికవాదులే. అందుకే వివేకానందుడు, ‘మనవాళ్లు విలు వైన గణితశాస్త్రాన్ని గ్రీకులకు అప్పగించి, జ్యోతిష్యాన్ని గ్రీకుల నుంచి ఎరువు తెచ్చుకున్నారు’ అంటాడు. ప్రపంచం నిరంతరంగా పరిణామం చెందుతు న్నదని ఆది బౌద్ధులు, హిరాక్లిటస్ నిరూపించారు. భావస్వేచ్ఛను అనుభవి స్తున్న ‘ఇంద్ర’ హేతువాది అయినందునే ‘వేద నిందితుడు’ అని ప్రకటించి, కాశ్యప ముని గుంటనక్కగా బతకమని శపించినట్టు మహాభారతం చెబు తోంది. తార్కిక దృష్టి కలిగిన భరతుడిని ‘లోకాయత’ మానవతావాదం ప్రభావానికి లోనుకావద్దని రాముడు సలహా ఇవ్వడాన్ని భావస్వేచ్ఛను అణగ దొక్కే ప్రయత్నంగా గమనిస్తాం. యాగాలను నిరసించినందునే వాటిపై బతికే ఒక వర్గం బౌద్ధ వినాశనానికి పునాదులు వేసింది. అందుకే గురజాడ వారు, ‘‘బౌద్ధ ధర్మాన్ని దేశ సరిహద్దులు దాటించి భారతదేశం ఆత్మహత్య చేసుకుంది’ అని శాశ్వత సత్యం చెప్పారు.
‘శుద్ధ’జలంతో వ్యాపారం
పవిత్రంగా భావించే గోదావరి మీద పుష్కరాల పేరుతో ఎంత వ్యాపారం జరి గిందో నిర్వాహకులు విస్మరించినట్టుంది. స్నానం చేయడానికి చాలినంత నీరు లేని రాష్ట్రంలో ఏర్పాట్ల కోసం రూ. 600 కోట్లు ఖర్చు చేశాడట ఒక రాష్ట్ర పాలకుడు. ఇంకో రాష్ట్ర పాలకుడు అవే ఏర్పాట్ల ఖర్చును రూ. 1,600 కోట్లుగా చూపుతున్నాడు. నీళ్ల వ్యాపారులు ‘శుద్ధి’చేసిన జలాలను సీసాలలో పట్టి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే బాధ్యత కల ఒక అధికారి, ‘పుష్కరాలను ఘనంగా జరిపించామన్న బిరుదు లు, కితాబులతో తమ కీర్తిని పెంచుకుందామని ప్రభుత్వం తలచిందేగానీ, ప్రజలకు కల్పించవలసిన కనీస సదుపాయాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది’ అని వ్యాఖ్యానించారు. నదులను కాపాడుకోవలసిన అవసరం గురించీ, ఇదేదో మహోత్సవం అని కాకుండా పుష్కరం అంటే మనలను పెంచి పోషించే జలమేనన్న కోణం నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ‘పోషయతీతి పుష్కరం’ అన్నారు. స్నానం ఎక్కడైనా చేయవచ్చు- నీళ్లంటూ ఉంటే. మన మురికిని నదికి అంటించడానికి వేరే చోటికి పనిగట్టుకు వెళ్లనక్కరలేదు. నదీస్నానం అసలు ఉద్దేశం- శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి కావాలన్న తపన. కానీ నదిని అంతా కలుషితం చేయడం వల్ల ఈ-కోలీ అనే బ్యాక్టీరియా చుట్టబెట్టిందన్న మాట వాస్తవం. విశ్వనాథ వారు అన్నట్టు గోదావరి జలాలను పుక్కిట పట్టడానికి అఖిల భారతం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఖ్యాతిని దక్కించుకోవాలంటే, గోదావరి జలాలను ఆక్రమించిన బ్యాక్టీరియా నుంచి ఆ నదిని ముందు విముక్తం చేయాలి.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414)