జయ జయ మహాదేవ!
- శ్రీశైలంలో కనుల పండువగా మల్లన్న రథోత్సవం
- ఉత్సవానికి ముందు రథాంగబలి, హోమం
- ఉర్రూతలూగించిన సాంస్కృతిక ప్రదర్శనలు
- రథోత్సవాన్ని వీక్షించిన లక్షలాది మంది భక్తులు
శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శనివారం.. రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించి లక్షలాది మంది భక్తులు పారవశ్యంతో పులకించిపోయారు. ముందుగా స్వామివార్ల ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవమూర్తులను వేదమంత్రోచ్చారణలతో, మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో ఊరేగిస్తూ రథశాల వద్దకు చేర్చారు. ఈలోగా రథానికి రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలిని వేదమంత్రోచ్చారణలతో స్థానాచార్యులు ఎం. పూర్ణానందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రథశాల వద్దకు చేరిన పల్లకీ నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంలో అధిష్టింపజేశారు. ముక్కంటి ర«థం కదలగానే లక్షలాది మంది భక్తులు ఓంనమఃశివాయ అంటూ నినదించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అరటి పళ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులు చేశారు.
రథశాల నుంచి బయలుదేరిన రథోత్సవం నంది మండపం అక్కడి నుంచి తిరిగి రథశాలను చేరింది. అనంతరం ఉత్సవమూర్తులను రథం నుంచిపల్లకిలోకి చేర్చి ఆలయ ప్రాంగణానికి తీసుకుని వెళ్లారు. లక్షలాది మంది భక్తులు శ్రీశైలనాథుని రథోత్సవంలో పాల్గొని జయజయ మహాదేవ శంభో అంటూ నీరాజనాలర్పించారు. డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ , ఆత్మకూరు ఇన్చార్జి డీఎస్పీ వినోద్‌కుమార్.. పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. ఈఓ భరత్ గుప్త, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు మురళీధర్, రాజశేఖరరాజు, హుసేన్‌పీరా, శ్రీశైలం సీఐ పార్థసార«థి, సీఐ చక్రవర్తి, దేవస్థానం ఈఈలు శ్రీనివాస్, రామిరెడ్డి, దేవస్థానం మాజీ చైర్మెన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, సభ్యులు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, మాజీ ఈఓ వంగాల శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు
అలరించిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన
రథోత్సవంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. దాదాపు గంటపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో చెంచుల సంప్రదాయ నృత్యం, గొరవయ్యల నృత్యం, నందికోలు సేవ , బుట్టబొమ్మల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.