బరితెగింపు
ధర్మవరం అర్బన్ : ధర్మవరం నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. రేషన్ డీలర్‌షిప్‌ను దక్కించుకోవడానికి ఓ డీలర్ భర్తను కొందరు కిడ్నాప్ చేశారు. రాజీనామా చేయకపోతే చంపేస్తామని బెదిరించి పోలీస్‌స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లారు. పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో రేషన్ షాపు నెంబర్ 112ను నారాయణరెడ్డి భార్య శకుంతల నడుపుతున్నారు. స్టాక్ వచ్చిందని గోడౌన్లో పనిచేసే వ్యక్తితో నారాయణరెడ్డికి ఫోన్ చేరుుంచారు.
ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి స్టాక్ లారీలో పంపించి, వెనుక మోటార్ సైకిల్లో బయలుదేరాడు. గేటు వద్ద నారాయణరెడ్డిని సుమారు 10 మంది చుట్టుముట్టి చేరుు చేసుకున్నారు. తమ వెంట రాకపోతే ఇక్కడే ఏమైనా చేసేస్తామని హెచ్చరించి ఆయన బండ్లో మరో ఇద్దరు కూర్చొని బత్తలపల్లి వైపు తీసుకెళ్లారు. సంజీవపురం సమీపంలో వాహనం ఆపి తీవ్రంగా కొట్టారు. భార్య శకుంతలకు ఫోన్ చేయించి నీ వద్దకు నరసింహులు భార్య వస్తుందని తెల్లకాగితంపై సంతకం చేయాలని సూచించారు.
అయితే భర్త గొంతులో తడబాటును గమనించిన శకుంతల ఏమి జరిగిందని ప్రశ్నించేలోగా.. రామకృష్ణ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని తెల్లకాగితంపై సంతకం చేయకపోతే నీ భర్తను చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన శకుంతల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, నరసింహులు భార్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి తెల్ల కాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. శకుంతల వారి నుంచి తప్పించుకుని ఏఎస్పీ అబిషేక్ మహంతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఏఎస్పీ వద్ద శకుంతల ఉండగానే కిడ్నాపర్లు మరోసారి ఆమెకు ఫోన్ చేసి హెచ్చరించారు. నిందితులను పట్టుకుని విచారిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు. అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో కిడ్నాపర్లు నారాయణరెడ్డిని పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద సాయంత్రం 5 గంటలకు వదిలిపెట్టి వెళ్లారు. స్టాక్‌ను కూడా కేతిరెడ్డికాలనీలో నరసింహులు బంధువుల ఇంటిలో దింపుకున్నారు.
ఆరుగంటల పాటు కిడ్నాపర్లు నారాయణరెడ్డిని వారి అదుపులో ఉంచుకున్నారు. పక్కా వ్యూహంతో ముందుగా కాపుకాచి ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. కాగా, కిడ్నాప్‌కు గురైన బాధితుడితో మాట్లాడించాలని విలేకరులు కోరగా.. సీఐ భాస్కర్‌గౌడ్ అందుకు సమ్మతించ లేదు. బాధితుడిని విచారిస్తున్నామని, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు.
ధర్మవరం నియోజకవర్గం, రేషన్ డీలర్షిప్, అరాచకం,
Dharmavaram constituency, the ration dealers, anarchy