rationshop
-
నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లే
ఆదోని టౌన్: ‘ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు, నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులుబ్దిపొందేలా చూసుకుంటా. నేను చెబితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పినట్లే. గతంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అన్నివిధాలుగా లబ్ధిపొందారు. ఇక చాలు.. రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్లాలి’.. అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఐదు రోజుల క్రితం జేబీ ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌షాపు డీలర్లు .. అన్నీ వదిలి వెళ్లిపోవాలి. వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా చేస్తున్నది చాలు. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకొచ్చినా నేను బెదరను. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అదే చెల్లుబాటవుతుంది. ఆ పిమ్మట ఎవరు చెప్పినా ఏం జరగదు’.. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తామన్నారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం ఆదోని పట్టణంలో పది రేషన్ షాపులకు బీజేపీ కూటమి కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. -
‘చౌక’లో మరిన్ని సేవలు
సాక్షి, నిర్మల్‌టౌన్: నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో టీవాలెట్ అ మలు చేయాలని నిర్ణయించింది. ఇక చౌక ధరల దుకాణాల్లో కేవలం రేషన్ సరుకులు తీసుకోవడమే కాకుండా బ్యాంకు లావాదేవీలు, మొబైల్, డీటీహెచ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా చే యవచ్చు. అటు రేషన్‌డీలర్లకు, ఇటు వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ సేవలను ప్రజలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా పొందడం ప్రత్యేకత. డిజిటల్ లావాదేవీలను రేషన్ దుకాణాల ద్వారా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కమీషన్ తక్కువగా వస్తుందని రేషన్‌దుకాణ దారులు సైతం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా వారు కొంత ఆదాయాన్ని సైతం ఆర్జించే అవకాశం ఉండడంతో వారికి కొంత ఊరట లభించనుంది. జిల్లావ్యాప్తంగా.. జిల్లావ్యాప్తంగా 398 రేషన్ దుకాణాలుండగా వీటిలో 390 ఈ–పాస్ యంత్రాలు ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖ ఈపాస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో డీలర్లు కేవలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల్లో ఇతర సేవలు పొందే అవకాశం కూడా కల్పించడంతో ఇటు వినియోగదారులకు, అటు డీలర్లకు ప్రయోజనం కలుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టీ– వాలెట్‌ను ఏర్పాటు చేయనుంది. దీన్ని రేషన్ దుకాణంలోని ఈపాస్ యంత్రంతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం డీలర్లకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. అక్టోబర్ నుంచి టీవాలెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే శిక్షణకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ సమయంలో డీలర్లు తప్పకుండా ఈ–పాస్ డివైస్‌తో పాటు ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంచుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో రేషన్ డీలర్లను రెండు బృందాలుగా విభజించి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో డీలర్లకు లావాదేవీలపై అవగాహన కలగనుంది. డీలర్లకు ఊరట.. ప్రభుత్వం రేషన్‌దుకాణాల్లో టీవాలెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల డీలర్లకు కాసింత ఊరట లభించనుంది. జిల్లాలో 398 రేషన్ దుకాణాలున్నాయి. ప్రభుత్వం ఈపాస్ మిషన్లను ప్రవేశపెట్టడంతో పాటు పోర్టబులిటీ విధానంతో రేషన్‌బియ్యం సరఫరా పారదర్శకంగా అమలవుతోంది. దీంతో డీలర్లు కేవలం అరకొర కమీషన్లపై ఆధారపడాల్సి వస్తోంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు సరఫరా అయ్యేవి. బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి వంటివి కార్డుదారులకు అందించేవారు. అయితే ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. పంచదార కూడా అప్పుడప్పుడూ వస్తుండడంతో డీలర్లు బియ్యం, కిరోసిన్ మాత్రమే అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో కమీషన్ సరిపోవడం లేదని ఇటీవల వారు ఆందోళనలు సైతం చేపట్టారు. ప్రస్తుతం రేషన్‌దుకాణాల ద్వారా సరుకులతో పాటు సేవలను అందించడంతో వారు కమీషన్ రూపంలో మరి కొంత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. సేవలివే ఇక నుంచి రేషన్ దుకాణాలే వినియోగదారుడి కనీస సాంకేతిక సేవలు తీర్చనున్నాయి. బ్యాంకు లావాదేవీలు సైతం టీవాలెట్ ద్వారా చేసుకోవచ్చు. రూ.2వేల లోపు లావాదేవీలను క్షణాల్లో చేసుకునే సదుపాయం కలుగనుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండానే. దీంతో పాటు టీ–వాలెట్ విధానం ద్వారా మొబైల్ రీచార్జి, నగదు బదిలీ, డీటీహెచ్, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపు, ట్రావెల్, బస్సు టికెట్ బుకింగ్, ఇంటర్ నెట్ సర్వీస్ చార్జీల చెల్లింపు, ఆధార్ చెల్లింపులను చేసుకోవచ్చు. లావాదేవీలను చేసినందుకు రేషన్‌డీలర్లకు ప్రభుత్వం కమీషన్ చెల్లించనుంది. వినియోగదారులకు సేవలతోపాటు డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి రేషన్ దుకాణాలే వినియోగదారుడి కనీస సాంకేతిక సేవలు తీర్చనున్నాయి. లావాదేవీలను చేసినందుకు రేషన్‌డీలర్లకు ప్రభుత్వం కమీషన్ చెల్లించనుంది. వినియోగదారులకు సేవలతోపాటు డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో శిక్షణ రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్‌ను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లాలోని రేషన్ డీలర్లకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నాం. ఇందు కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులు రానున్నారు. అక్టోబర్ నుంచి రేషన్‌దుకాణాల్లో టీ–వాలెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – కిరణ్‌కుమార్, డీఎస్వో, నిర్మల్ -
పప్పులుడకట్లేదు..
సాక్షి, అనంతపురం : అనంతపురం నగరానికి చెందిన రమణయ్య, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎప్పుడూ పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకునే చిన్నారులు.. ఈ దసరా పండుగకు ఓళిగలు చేసిపెట్టాలని తల్లిని కోరారు. ‘అలాగేనమ్మా! టోరు(రేషన్‌షాపు)లో మనకు నూనీ, కందిబ్యాళ్లు ఇత్తారేమో సూత్తాం! ఇత్తే అలాగే సేత్తాలే’ అని తల్లి చెప్పింది. మరుసటి రోజు ఇంటి సమీపంలోని స్టోరు డీలర్ వద్దకు వెళ్లి ‘అన్నా..అక్టోబర్ నెలైనా మాకు నూనీ, కందిబ్యాళ్లు ఇత్తారా’ అని అడిగింది. ‘ఎక్కడివి?! ఇంత వరకూ అవి మాకు అంద నేలేదు. అసలు పామాయిల్, కందిబ్యాళ్లు మీరు మరచిపోండి’ అంటూ డీలర్ సమాధానం చెప్పాడు. దీంతో లక్ష్మిదేవి దిగాలుగా ఇంటికి వెళ్లిపోయింది. జిల్లాలో ఐదు నెలలుగా రేషన్‌షాపుల ద్వారా పామాయిల్ అందక పోవడంతో పేదలు ఇక్కట్లు పడుతున్నారు. కార్డుదారులంతా తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ నెల కందిపప్పును సరఫరా చేయకపోవడంతో పేదోళ్ల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. జిల్లాలోని దాదాపు 11 లక్షల పేద కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, కిరోసిన్, పంచదార, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంటారు. బియ్యం, కిరోసిన్ యథావిధిగా సరఫరా చేస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు.. పామాయిల్, కందిపప్పు విషయానికి వచ్చేసరికి పట్టించుకోవడం మానేశారు. ఒక్కొక్క కార్డుదారుడికి నెలకు కిలో పామాయిల్ చొప్పున 11 లక్షల కిలోలు సరఫరా చేయాల్సి వుంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ ధర రూ.63 వరకు ఉండగా.. రేషన్‌షాపులో సబ్సిడీపై రూ.40కే విక్రయిస్తారు. బహిరంగ మార్కెట్ ధరకే ప్రభుత్వం పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది. ఇందులో రూ.10 కేంద్రం, రూ.13 రాష్ట్ర ప్రభుత్వం భరించి.. మొత్తం రూ.23 కార్డుదారుడికి సబ్సిడీ ఇస్తాయి. సాధారణంగా పామాయిల్ మలేషియా దేశం నుంచి కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి జిల్లాలకు దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దిగుమతికి ఇబ్బంది లేదు. కాకినాడ రిఫైనరీల్లో కావాల్సినంత పామాయిల్ అందుబాటులో ఉంది. ఇక్కడొచ్చిన సమస్యల్లా కేంద్రం నుంచి రాయితీ రాకపోవడమే. కేంద్రం భరించాల్సిన రూ.10పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పామాయిల్ పంపిణీ కావడం లేదు. గడిచిన ఐదు నెలలుగా ఈ ఇబ్బంది ఉన్నా రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు కానీ, జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కానీ పట్టించుకోవడం లేదు. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లా వ్యాప్తంగా నెలకు 11 లక్షల కిలోలు ఇస్తున్నారు. రేషన్‌షాపులో కిలో రూ.50తో విక్రయిస్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో రూ.70 వరకు ధర ఉంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో ఒకే కాంట్రాక్టర్‌కు కందిపప్పు సరఫరా బాధ్యత అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ సమయానికి సరఫరా చేయకపోవడంతో పేదలకు అందడం లేదు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి కార్డుదారులెవరూ కందిపప్పును అందుకోలేదు. ఇక ఒక్కొక్క కార్డుదారుడికి అర కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సివుండగా.. ముందుగా ఎవరొస్తే వారికే అన్న రీతిలో పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’.. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం దృష్టికి తీసుకెళ్లగా పామాయిల్, కందిపప్పు అందని మాట వాస్తవమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యఉందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.