- కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆ పోస్టులు వదిలేసి వెళ్లాలి
- రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరిక
ఆదోని టౌన్: ‘ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు, నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులుబ్దిపొందేలా చూసుకుంటా. నేను చెబితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పినట్లే. గతంలో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అన్నివిధాలుగా లబ్ధిపొందారు. ఇక చాలు.. రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్లాలి’.. అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఐదు రోజుల క్రితం జేబీ ఫంక్షన్ హాల్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌షాపు డీలర్లు .. అన్నీ వదిలి వెళ్లిపోవాలి. వైఎస్సార్‌సీపీ ఐదేళ్లుగా చేస్తున్నది చాలు. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకొచ్చినా నేను బెదరను. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అదే చెల్లుబాటవుతుంది. ఆ పిమ్మట ఎవరు చెప్పినా ఏం జరగదు’.. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తామన్నారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం ఆదోని పట్టణంలో పది రేషన్ షాపులకు బీజేపీ కూటమి కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment