పప్పులుడకట్లేదు.. | Pappuludakatledu .. | Sakshi
Sakshi News home page

పప్పులుడకట్లేదు..

Published Tue, Sep 30 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

పప్పులుడకట్లేదు..

పప్పులుడకట్లేదు..

సాక్షి, అనంతపురం :
 అనంతపురం నగరానికి చెందిన రమణయ్య, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎప్పుడూ పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకునే చిన్నారులు.. ఈ దసరా పండుగకు ఓళిగలు చేసిపెట్టాలని తల్లిని కోరారు. ‘అలాగేనమ్మా! టోరు(రేషన్‌షాపు)లో మనకు నూనీ, కందిబ్యాళ్లు ఇత్తారేమో సూత్తాం! ఇత్తే అలాగే సేత్తాలే’ అని తల్లి చెప్పింది. మరుసటి రోజు ఇంటి సమీపంలోని స్టోరు డీలర్ వద్దకు వెళ్లి  ‘అన్నా..అక్టోబర్ నెలైనా మాకు నూనీ, కందిబ్యాళ్లు ఇత్తారా’ అని అడిగింది. ‘ఎక్కడివి?! ఇంత వరకూ అవి మాకు అంద నేలేదు. అసలు పామాయిల్, కందిబ్యాళ్లు మీరు మరచిపోండి’ అంటూ డీలర్ సమాధానం చెప్పాడు. దీంతో లక్ష్మిదేవి దిగాలుగా ఇంటికి వెళ్లిపోయింది.
 జిల్లాలో ఐదు నెలలుగా రేషన్‌షాపుల ద్వారా పామాయిల్ అందక పోవడంతో పేదలు ఇక్కట్లు పడుతున్నారు. కార్డుదారులంతా తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ నెల కందిపప్పును సరఫరా చేయకపోవడంతో పేదోళ్ల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. జిల్లాలోని దాదాపు 11 లక్షల పేద కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, కిరోసిన్, పంచదార, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంటారు. బియ్యం, కిరోసిన్ యథావిధిగా సరఫరా చేస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు.. పామాయిల్, కందిపప్పు విషయానికి వచ్చేసరికి పట్టించుకోవడం మానేశారు. ఒక్కొక్క కార్డుదారుడికి నెలకు కిలో పామాయిల్ చొప్పున 11 లక్షల కిలోలు సరఫరా చేయాల్సి వుంది. బహిరంగ మార్కెట్‌లో పామాయిల్ ధర రూ.63 వరకు ఉండగా.. రేషన్‌షాపులో సబ్సిడీపై రూ.40కే విక్రయిస్తారు. బహిరంగ మార్కెట్ ధరకే ప్రభుత్వం పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది. ఇందులో రూ.10 కేంద్రం, రూ.13 రాష్ట్ర ప్రభుత్వం భరించి.. మొత్తం రూ.23 కార్డుదారుడికి సబ్సిడీ ఇస్తాయి. సాధారణంగా పామాయిల్ మలేషియా దేశం నుంచి కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి జిల్లాలకు దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దిగుమతికి ఇబ్బంది లేదు. కాకినాడ రిఫైనరీల్లో కావాల్సినంత పామాయిల్ అందుబాటులో ఉంది. ఇక్కడొచ్చిన సమస్యల్లా కేంద్రం నుంచి రాయితీ రాకపోవడమే. కేంద్రం భరించాల్సిన రూ.10పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పామాయిల్ పంపిణీ కావడం లేదు. గడిచిన ఐదు నెలలుగా ఈ ఇబ్బంది ఉన్నా రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు కానీ, జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కానీ పట్టించుకోవడం లేదు. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లా వ్యాప్తంగా నెలకు 11 లక్షల కిలోలు ఇస్తున్నారు. రేషన్‌షాపులో కిలో రూ.50తో విక్రయిస్తున్నారు. అదే బహిరంగ మార్కెట్‌లో రూ.70 వరకు ధర ఉంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో ఒకే కాంట్రాక్టర్‌కు కందిపప్పు సరఫరా బాధ్యత అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ సమయానికి సరఫరా చేయకపోవడంతో పేదలకు అందడం లేదు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి కార్డుదారులెవరూ కందిపప్పును అందుకోలేదు. ఇక ఒక్కొక్క కార్డుదారుడికి అర కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సివుండగా.. ముందుగా ఎవరొస్తే వారికే అన్న రీతిలో పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’..   పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం దృష్టికి తీసుకెళ్లగా పామాయిల్, కందిపప్పు అందని మాట వాస్తవమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యఉందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement