‘చౌక’లో మరిన్ని సేవలు  | Government Want To Provide Extra Services In Ration Shop In Nirmal | Sakshi
Sakshi News home page

‘చౌక’లో మరిన్ని సేవలు 

Published Mon, Jul 22 2019 10:13 AM | Last Updated on Mon, Jul 22 2019 11:27 AM

Government Want To Provide Extra Services In Ration Shop In Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌టౌన్‌: నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో టీవాలెట్‌ అ మలు చేయాలని నిర్ణయించింది. ఇక చౌక ధరల దుకాణాల్లో కేవలం రేషన్‌ సరుకులు తీసుకోవడమే కాకుండా బ్యాంకు లావాదేవీలు, మొబైల్, డీటీహెచ్, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు కూడా చే యవచ్చు. అటు రేషన్‌డీలర్లకు, ఇటు వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ సేవలను ప్రజలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా పొందడం ప్రత్యేకత.

డిజిటల్‌ లావాదేవీలను రేషన్‌ దుకాణాల ద్వారా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కమీషన్‌ తక్కువగా వస్తుందని రేషన్‌దుకాణ దారులు సైతం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా వారు కొంత ఆదాయాన్ని సైతం ఆర్జించే అవకాశం ఉండడంతో వారికి కొంత ఊరట లభించనుంది.  

జిల్లావ్యాప్తంగా.. 
జిల్లావ్యాప్తంగా 398 రేషన్‌ దుకాణాలుండగా వీటిలో 390 ఈ–పాస్‌ యంత్రాలు ఉన్నాయి. రేషన్‌ దుకాణాల్లో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖ ఈపాస్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో డీలర్లు కేవలం కమీషన్‌ రూపంలో వచ్చే ఆదాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది. రేషన్‌ దుకాణాల్లో ఇతర సేవలు పొందే అవకాశం కూడా కల్పించడంతో ఇటు వినియోగదారులకు, అటు డీలర్లకు ప్రయోజనం కలుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టీ– వాలెట్‌ను ఏర్పాటు చేయనుంది. దీన్ని రేషన్‌ దుకాణంలోని ఈపాస్‌ యంత్రంతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం డీలర్లకు సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు.  

అక్టోబర్‌ నుంచి టీవాలెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే శిక్షణకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ సమయంలో డీలర్లు తప్పకుండా ఈ–పాస్‌ డివైస్‌తో పాటు ఆధార్‌ నంబర్, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఉంచుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో రేషన్‌ డీలర్లను రెండు బృందాలుగా విభజించి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో డీలర్లకు లావాదేవీలపై అవగాహన కలగనుంది.  

డీలర్లకు ఊరట..  
ప్రభుత్వం రేషన్‌దుకాణాల్లో టీవాలెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల డీలర్లకు కాసింత ఊరట లభించనుంది. జిల్లాలో 398 రేషన్‌ దుకాణాలున్నాయి. ప్రభుత్వం ఈపాస్‌ మిషన్లను ప్రవేశపెట్టడంతో పాటు పోర్టబులిటీ విధానంతో రేషన్‌బియ్యం సరఫరా పారదర్శకంగా అమలవుతోంది. దీంతో డీలర్లు కేవలం అరకొర కమీషన్లపై ఆధారపడాల్సి వస్తోంది. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు సరఫరా అయ్యేవి. బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి వంటివి కార్డుదారులకు అందించేవారు.

అయితే ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. పంచదార కూడా అప్పుడప్పుడూ వస్తుండడంతో డీలర్లు బియ్యం, కిరోసిన్‌ మాత్రమే అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో కమీషన్‌ సరిపోవడం లేదని ఇటీవల వారు ఆందోళనలు సైతం చేపట్టారు. ప్రస్తుతం రేషన్‌దుకాణాల ద్వారా సరుకులతో పాటు సేవలను అందించడంతో వారు కమీషన్‌ రూపంలో మరి కొంత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

సేవలివే
ఇక నుంచి రేషన్‌ దుకాణాలే వినియోగదారుడి కనీస సాంకేతిక సేవలు తీర్చనున్నాయి. బ్యాంకు లావాదేవీలు సైతం టీవాలెట్‌ ద్వారా చేసుకోవచ్చు. రూ.2వేల లోపు లావాదేవీలను క్షణాల్లో చేసుకునే సదుపాయం కలుగనుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండానే. దీంతో పాటు టీ–వాలెట్‌ విధానం ద్వారా మొబైల్‌ రీచార్జి, నగదు బదిలీ, డీటీహెచ్, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపు, ట్రావెల్, బస్సు టికెట్‌ బుకింగ్, ఇంటర్‌ నెట్‌ సర్వీస్‌ చార్జీల చెల్లింపు, ఆధార్‌ చెల్లింపులను చేసుకోవచ్చు.

లావాదేవీలను చేసినందుకు రేషన్‌డీలర్లకు ప్రభుత్వం కమీషన్‌ చెల్లించనుంది. వినియోగదారులకు సేవలతోపాటు డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  ఇక నుంచి రేషన్‌ దుకాణాలే వినియోగదారుడి కనీస సాంకేతిక సేవలు తీర్చనున్నాయి. లావాదేవీలను చేసినందుకు రేషన్‌డీలర్లకు ప్రభుత్వం కమీషన్‌ చెల్లించనుంది. వినియోగదారులకు సేవలతోపాటు డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌లో శిక్షణ 
రేషన్‌ దుకాణాల్లో టీ–వాలెట్‌ను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లాలోని రేషన్‌ డీలర్లకు సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నాం. ఇందు కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక శిక్షకులు రానున్నారు. అక్టోబర్‌ నుంచి రేషన్‌దుకాణాల్లో టీ–వాలెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  
– కిరణ్‌కుమార్, డీఎస్‌వో, నిర్మల్‌      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement