T wallet
-
‘ఉపకారా’నికి టీ–వ్యాలెట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన పథకానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అనే నిబంధనకు కాస్త బ్రేక్ పడింది. బ్యాంకు ఖాతా తెరవడం, దాని నిర్వహణ తదితర అంశాలు విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆందోళన ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ–వ్యాలెట్ యాప్/ఆన్లైన్ సర్వీసు ద్వారా ఉపకారవేతనాలు పంపిణీ చేసేలా నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గతేడాది అందుబాటులోకి తెచ్చింది. ఈ జిల్లాలోని విద్యార్థులు ఉపకారవేతనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా నంబర్ బదులుగా టీ–వ్యాలెట్ బటన్ ను ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తుదారు ఎంట్రీ చేసిన ఫోన్ నంబర్, విద్యార్థి పేరు ఆధారంగా టీ–వ్యాలెట్ రిజి స్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఉపకారవేతనం విడుదలైన వెంటనే విద్యార్థి టీ–వ్యాలెట్ ఖాతాకు నిధులు జమవుతాయి. వీటిని సమీప మీ సేవా కేంద్రంలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. గతేడాది నిజామాబాద్ జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు టీ–వ్యాలెట్ ఎంపిక చేసుకున్నారు. మరో నాలుగు జిల్లాల్లో.. నిజామాబాద్ జిల్లాలో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో మరో నాలుగు జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉపకారవేతనాలు ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాలెట్ ఆప్షన్ ఇస్తే మేలు.. ప్రస్తుతం ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు. నిర్దేశించిన 4 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో టీ–వ్యాలెట్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే విద్యార్థులంతా బ్యాంకు ఖాతాకు బదులుగా టీ–వ్యాలెట్ వివరాలు సమర్పించవచ్చు. కొత్తగా నాలుగు జిల్లాల్లో టీ–వ్యాలెట్ అమలుపై అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రేపటి నుంచే టీవాలెట్ సేవలు
సాక్షి, నల్లగొండ : రేషన్‌షాపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని సాంకేతిక పరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం రేషన్ షాపుల్లో టీవాలెట్ పేరుతో ఆన్లైన్ సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో రేపటి నుంచి టీవాలెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. టీవాలెట్ ద్వారా గ్రామీణప్రాంత ప్రజలు ఆన్లైన్ సేవలకు పట్టణాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఈ సేవలు అందిస్తున్నందుకు డీలర్లు కూడా కొంత కమీషన్ పొందనున్నారు. ఇప్పటికే 25కుపైగా జిల్లాల్లో టీవాలెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22 నుంచి నల్లగొండ జిల్లాలో కూడా అధికారికంగా టీవాలెట్ సేవలను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయి పౌర సరఫరాల శాఖ, టీ వాలెట్ అధికారులు కూడా హాజరుకానున్నారు. రేపటి నుంచి జిల్లాలో టీవాలెట్ సేవలు తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన టీవాలెట్ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో మంగళవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 డివిజన్ల పరిధిలోని డీలర్లకు రెండు విడతల్లో (ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు) వారి మిషన్లలో టీవాలెట్ సేవలను ప్రారంభిస్తారు. టీవాలెట్ ద్వారా అందే సేవలు రేషన్‌షాపుల ద్వారా ఇప్పటికే బియ్యం, కిరోసిన్ అందిస్తున్నారు. ఈ టీవాలెట్ ద్వారా మొబైల్ రీచార్జ్, మనీ ట్రాన్సాక్షన్స్, డీటీహెచ్ పేమెంట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ట్రావెల్ బస్సుల టికెట్ బుకింగ్, ఇంటర్నెట్ సర్వీస్ చార్జీల చెల్లింపుతో పాటు ఆధార్ చెల్లింపులు కూడా రేషన్‌షాపుల్లో నుంచే చేసుకునే వీలుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు సిబ్బంది వచ్చిన రోజే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వచ్చేది.. ఈ టీవాలెట్ ద్వారా ఆన్లైన్లోనే తమ కరెంట్ బిల్లులను చెల్లించవచ్చు. సెల్ ఫోన్ రీచార్జ్ కూడా రేషన్‌షాపుల్లోనే చేయించుకునే అవకాశం ఏర్పడుతుంది. మనం ఏదైనా ప్రాంతాలకు విహారాయాత్ర, అవసరాల నిమిత్తం వెళ్లాలంటే పట్టణాలకు వెళ్లి ఇంటర్నెట్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది.. ఇ ప్పుడు గ్రామాల్లోనే బస్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రతి నెలలో రేషన్ బియ్యం తెచ్చుకునే సందర్భంలోనే కరెంట్ బిల్లు, సెల్ రీచార్జ్, టీవీ బిల్లు, ఇంటర్నెట్ బిల్లులను చెల్లించుకునేందుకు అవకాశం కలగనుంది. ప్రజలు డీలర్లకు మేలు.. ప్రభుత్వం తీసుకొచ్చిన టీవాలెట్ ద్వారా ప్రజలకు గ్రామంలోనే సాంకేతిక పరమైన సేవలు అందడంతో పాటు డీలర్లకు కూడా మేలు జరగనుంది. ప్రజలు గ్రామంలో సేవలు పొందుతూ దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పుతుండగా డీలర్లు మాత్రం అదనపు సేవలు అందించి కమీషన్ ద్వారా మరింత ఆదాయం పొందనున్నారు. రేపే అధికారికంగా ప్రారంభం టీవ్యాలెట్ సేవలపై ఇప్పటికే మండలాల వారీగా రేషన్ డీలర్లకు టీవాలెట్ సేవలకు సంబంధించి వారి వద్ద ఉన్న మిషన్లలో టీవ్యాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేయడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చారు. ఆ మిషన్‌కు లాక్‌కూడా ఉంచారు. ఈ టీవాలెట్‌ను అధికారికంగా జిల్లా కేంద్రంలో ఇన్చార్జ్ కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి జిల్లాలో రేషన్‌డీలర్లు దుకాణాల్లో టీవ్యాలెట్ సేవలను ప్రజలకు అందించనున్నారు. 22 నుంచి టీవాలెట్ సేవలు ప్రారంభం జిల్లాలో టీవాలెట్ సేవలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని డీలర్లందరికీ ఈ సేవలపై శిక్షణ ఇచ్చాం. టీవాలెట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామాల్లోనే ఆన్లైస్ సేవలు పొందే అవకాశం కలుగుతుంది. ప్రజలు ఈ సేవలకు సద్వినియోగం చేసుకోవాలి. – రుక్మిణీదేవి, డీఎస్ఓ -
పల్లెల్లో టీవాలెట్
సాక్షి, నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చౌకధరల దుకాణాల ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే రేషన్‌షాపుల ద్వారా బియ్యం, కిరోసిన్ తదితర వస్తువులను అందిస్తున్న ప్రభుత్వం వాటితోపాటు మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో టీవాలెట్ సేవలను ప్రారంభించింది. ఈ విధానం ఇప్పటికే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో అమలవుతోంది. నల్లగొండ జిల్లాలో కూడా ఈ నెల 21వ తేదీనుంచి అమలు చేసేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో డీలర్ వారీగా టీ వాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసేందుకు ఈనెల 3 నుంచి డీలర్ల వద్దకు వెళ్లనున్నారు. మండలాల వారీగా ఆయా గ్రామాల డీలర్లను పిలిపించి టీవాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేస్తారు. ఆ తర్వాత దాని ద్వారా ఎలా సేవలు అందించాలో డీలర్లకు శిక్షణ ఇచ్చి అమలు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు సేవ.. డీలర్లకు కమీషన్.. జిల్లాలో మొత్తం 4,60,419 ఫుడ్ సెక్యురిటీ కార్డులు ఉన్నాయి. అయితే ఒక్కో వ్యక్తికి 6కిలోల చొప్పున రూ.కిలో బియ్యాన్ని ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారికి అందజేస్తోంది. వాటితోపాటు కార్డుకు లీటర్ చొప్పున కిరో సిన్ను కూడా పంపిణీ చేస్తున్నారు. గ తంలో గోధుమలు, తదితర వస్తువులు అందించేవారు. కానీ ప్రస్తుతం ఈ రెం డు మాత్రమే అందుతున్నాయి. వీటి ద్వారా డీలర్లకు కమీషన్ సరిపోవడం లేదు. పైగా గ్రామాల్లో ప్రతి పనికీ ప్రజలు పట్టణాలకు వెళ్లి ఆన్లైన్ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా మరిన్ని సాంకేతిక పరమైన సేవలు అందించి ప్రజలకు మేలు చేయడంతోపాటు రేషన్ డీలర్లకు కూడా కమీషన్లు వచ్చే విధంగా ప్రభుత్వం టీ వాలెట్ సేవలు అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 21నుంచి జిల్లాలో టీవాలెట్ సేవలు అక్టోబర్ 21నుంచి నల్లగొండ జిల్లాలో రేషన్ షాపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు టీవాలెట్ సేవలు అందనున్నాయి. గతంలో ప్రతి పనికీ పట్టణాలకు వెళ్లాల్సిన ప్రజలు ఇక గ్రామంలోనే రేషన్ షాపుల ద్వారా సాంకేతికసేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకోసం ఈ పాస్‌కు చెందిన పదిమంది టెక్నీషియన్లు వచ్చి మండలాల వారీగా ఆయా డీలర్లను పిలిపించి ఈ పాస్ యంత్రాల్లో టీవాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేయనున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత డీలర్లకు యాప్ ద్వారా సాంకేతిక పరమైన సేవలు ఎలా అందించాలో శిక్షణ ఇవ్వనున్నారు. రేషన్‌షాపుల్లో అందే సేవలు సెల్‌ఫోన్ రీచార్జితోపాటు మనీ ట్రాన్స్ఫర్, డీటీహెచ్ చెల్లింపు, విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటు బస్ టికెట్, ట్రైన్ టికెట్లు, ఇంటర్నెట్ సర్వీస్ చార్జీల చెల్లింపుతో పాటు ఆధార్ పేమెంట్లు(బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధా నం) వంటి సేవలను రేషన్ షాపుల ద్వారా పొందనున్నారు. ఇక..గ్రామంలోనే అన్ని సేవలు గతంలో ప్రతి పనికీ మండల కేంద్రాలకు వెళ్లి సేవలు పొందాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీవాలెట్ ద్వారా రేషన్‌షాపుల్లోనే సకల సౌకర్యాలు పొందవచ్చు. డబ్బుల లావాదేవీలతో పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపు, సుదూర ప్రాంతాలకు, యాత్రలకు వెళ్లాలన్నా బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఆయా స్టేషన్లకు వెళ్లి బుక్ చేసుకునే పరిస్థితి ఉండేది. అవన్నీ గ్రామంలోని రేషన్ షాపుల్లోనే చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాంకేతిక సేవలు పొందేందుకు మండలాలు, పట్టణాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఈ టీవాలెట్ ఉపయోగపడనుంది. 3నుంచి డీలర్ల ఈ పాస్‌లో టీవాలెట్ యాప్ ఈనెల 3వ తేదీ నుండి ఈపాస్ టెక్నీషియన్లంతా ఆయా మండలాలకు వెళ్లి మండల కేంద్రాలకు డీలర్లను పిలిపించి ఈ పాస్ యంత్రాల్లో టీవ్యాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేస్తారు. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ అధికారులు డీలర్లకు టీ వాలెట్ సేవలపై శిక్షణను ఇస్తారు. అనంతరం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇరువురికీ మేలు.. పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోని సాంకేతిక సేవలు అందుబాటులోకి రావడంతో ఇటు ప్రజలకు.. పైగా వాటిని అందించే రేషన్ డీలర్లకు కమీషన్ అందడంతో ఇరువురికీ మేలు జరగనుంది. దీంతో డీలర్లకు కాస్త ఆసరా కానుంది. కమీషన్ సరిపోవడం లేదంటూ తమకు వేతనాలు ఇవ్వాలని కొన్ని ఏళ్లుగా డీలర్లు ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. ఈ తరుణంలో వాలెట్ సేవలు కాస్త కమిషన్ పెంచేందుకు దోహదపడడం జరుగుతుంది. ఏదేమైనా టీవాలెట్ సేవలు అందుబాటులోకి వస్తే ఇటే ప్రజలకు.. అటు రేషన్ డీలర్లకు ప్రయోజనం చేకూరనుంది. -
రేషన్ దుకాణాల్లో టీవాలెట్
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో నూతనంగా టీ వాలెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వినియోగంపై ఇప్పటికే జిల్లాలోని డీలర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ యాప్‌ను వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎనిమిది రకాల సేవలు అందించనున్నారు. డీలర్లకు కమీషన్ పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 18 మండలాల్లో 587 రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 2.34 లక్షల మంది కార్డుదారులకు ప్రతి నెల 5,356 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం జిలాల్లోని అన్ని దుకాణాల్లో టీవాలెట్‌ను అమలు చేయనున్నారు. కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సమస్య ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ నెట్‌వర్క్‌ను వినియోగించి.. టీవాలెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే డీలర్ల వద్దనున్న ఈ– పాస్ మిషన్లలో యాప్‌ను వేయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 8రకాల సేవలు... టీవాలెట్ ద్వారా నూతనంగా ఎనిమిది సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. మీ సేవ, విద్యుత్, ఆర్టీ, నగదు జమ, సెల్‌ఫోన్ రీచార్జ్, డీటీహెచ్ రిచార్జ్, ఇంటి పన్ను చెల్లింపు, బస్సు టికెట్ బుక్కింగ్‌లు వంటి సేవలు దీనిద్వారా పొందవచ్చు. బ్యాంకులతో అనుసంధానంగా లబ్ధిదారులకు ఈ సేవలు అందనున్నాయి. భవిష్యత్‌లో ఉపాధిహామీ, పెన్షన్ చెల్లింపులకు, ఈ యాప్పు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీవాలెట్‌తో బ్యాంకులకు నగదు బదిలీలు, స్వయంసహాయ సంఘాల రుణాల చెల్లింపులు జరిగేలా చూస్తారు. ప్రస్తుతం రేషన్ డీలర్లు 1వ తేదీ నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. టీవాలెట్ అమలైతే నెల రోజుల పాటు వీరి సేవలు కొనసాగించనున్నారు. దీంతో డీలర్లకు ఆర్థిక చేయూత అందనుంది. కమీషన్ పెంచేందుకే... గత కొన్ని రోజులుగా రేషన్ డీలర్ల తమ కమీషన్ పెంచాలని లేదా వేతనాలు ఇవ్వాలని పలుమార్లు సమ్మెకు దిగే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రతీసారి వీరిని బుజ్జగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో డీలర్లకు ఏవిధంగానైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో టీవాలెట్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పలు రకాల సేవలు అందుబాటులోకి రావడంతో పాటు రేషన్ డీలర్లకు ఆర్థిక చేయూతకల్పించినట్లు ఉంటుందని సర్కారు భావిస్తోంది. -
‘చౌక’లో మరిన్ని సేవలు
సాక్షి, నిర్మల్‌టౌన్: నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో టీవాలెట్ అ మలు చేయాలని నిర్ణయించింది. ఇక చౌక ధరల దుకాణాల్లో కేవలం రేషన్ సరుకులు తీసుకోవడమే కాకుండా బ్యాంకు లావాదేవీలు, మొబైల్, డీటీహెచ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా చే యవచ్చు. అటు రేషన్‌డీలర్లకు, ఇటు వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ సేవలను ప్రజలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా పొందడం ప్రత్యేకత. డిజిటల్ లావాదేవీలను రేషన్ దుకాణాల ద్వారా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కమీషన్ తక్కువగా వస్తుందని రేషన్‌దుకాణ దారులు సైతం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా వారు కొంత ఆదాయాన్ని సైతం ఆర్జించే అవకాశం ఉండడంతో వారికి కొంత ఊరట లభించనుంది. జిల్లావ్యాప్తంగా.. జిల్లావ్యాప్తంగా 398 రేషన్ దుకాణాలుండగా వీటిలో 390 ఈ–పాస్ యంత్రాలు ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖ ఈపాస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో డీలర్లు కేవలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల్లో ఇతర సేవలు పొందే అవకాశం కూడా కల్పించడంతో ఇటు వినియోగదారులకు, అటు డీలర్లకు ప్రయోజనం కలుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టీ– వాలెట్‌ను ఏర్పాటు చేయనుంది. దీన్ని రేషన్ దుకాణంలోని ఈపాస్ యంత్రంతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం డీలర్లకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. అక్టోబర్ నుంచి టీవాలెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే శిక్షణకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ సమయంలో డీలర్లు తప్పకుండా ఈ–పాస్ డివైస్‌తో పాటు ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంచుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో రేషన్ డీలర్లను రెండు బృందాలుగా విభజించి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో డీలర్లకు లావాదేవీలపై అవగాహన కలగనుంది. డీలర్లకు ఊరట.. ప్రభుత్వం రేషన్‌దుకాణాల్లో టీవాలెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల డీలర్లకు కాసింత ఊరట లభించనుంది. జిల్లాలో 398 రేషన్ దుకాణాలున్నాయి. ప్రభుత్వం ఈపాస్ మిషన్లను ప్రవేశపెట్టడంతో పాటు పోర్టబులిటీ విధానంతో రేషన్‌బియ్యం సరఫరా పారదర్శకంగా అమలవుతోంది. దీంతో డీలర్లు కేవలం అరకొర కమీషన్లపై ఆధారపడాల్సి వస్తోంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు సరఫరా అయ్యేవి. బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి వంటివి కార్డుదారులకు అందించేవారు. అయితే ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. పంచదార కూడా అప్పుడప్పుడూ వస్తుండడంతో డీలర్లు బియ్యం, కిరోసిన్ మాత్రమే అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో కమీషన్ సరిపోవడం లేదని ఇటీవల వారు ఆందోళనలు సైతం చేపట్టారు. ప్రస్తుతం రేషన్‌దుకాణాల ద్వారా సరుకులతో పాటు సేవలను అందించడంతో వారు కమీషన్ రూపంలో మరి కొంత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. సేవలివే ఇక నుంచి రేషన్ దుకాణాలే వినియోగదారుడి కనీస సాంకేతిక సేవలు తీర్చనున్నాయి. బ్యాంకు లావాదేవీలు సైతం టీవాలెట్ ద్వారా చేసుకోవచ్చు. రూ.2వేల లోపు లావాదేవీలను క్షణాల్లో చేసుకునే సదుపాయం కలుగనుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండానే. దీంతో పాటు టీ–వాలెట్ విధానం ద్వారా మొబైల్ రీచార్జి, నగదు బదిలీ, డీటీహెచ్, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపు, ట్రావెల్, బస్సు టికెట్ బుకింగ్, ఇంటర్ నెట్ సర్వీస్ చార్జీల చెల్లింపు, ఆధార్ చెల్లింపులను చేసుకోవచ్చు. లావాదేవీలను చేసినందుకు రేషన్‌డీలర్లకు ప్రభుత్వం కమీషన్ చెల్లించనుంది. వినియోగదారులకు సేవలతోపాటు డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి రేషన్ దుకాణాలే వినియోగదారుడి కనీస సాంకేతిక సేవలు తీర్చనున్నాయి. లావాదేవీలను చేసినందుకు రేషన్‌డీలర్లకు ప్రభుత్వం కమీషన్ చెల్లించనుంది. వినియోగదారులకు సేవలతోపాటు డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో శిక్షణ రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్‌ను అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లాలోని రేషన్ డీలర్లకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నాం. ఇందు కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులు రానున్నారు. అక్టోబర్ నుంచి రేషన్‌దుకాణాల్లో టీ–వాలెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – కిరణ్‌కుమార్, డీఎస్వో, నిర్మల్ -
టీ వాలెట్‌తో రేషన్ షాపుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో 1,700 రేషన్ షాపులను టీ వాలెట్‌తో అనుసంధానం చేస్తున్నామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన టీ వాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం అకున్ మాట్లాడుతూ.. ఈ సేవలను ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. రంగారెడ్డిలో రెండు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించామని తెలిపారు. ఇప్పటికే మీ సేవ, ఈ సేవ, పీఎస్సీ, దోస్త్, విజయా డెయిరీ వంటి సేవలు టీ వాలెట్‌తో లింక్ అయ్యాయని చెప్పారు. కొత్తగా రేషన్ షాపులకు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఏకైక టీ వాలెట్ ఇదే అని, డిజిటల్ పేమెంట్స్‌కు గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పారు. ఈ వాలెట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వీలును నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. నోట్లపై ఆధారపడకుండా డిజిటల్ ఉపయోగం పెంచాలని చూస్తున్నామని పేర్కొన్నారు. టీ వాలెట్ వాడకంలో ఎలాంటి చార్జీ ఉండదని తెలిపారు. -
పైసా చార్జీ లేదు, టీ వ్యాలెట్ ప్రత్యేకతలివే!
-
పైసా చార్జీ లేదు, టీ వ్యాలెట్ ప్రత్యేకతలివే!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వ్యాలెట్’ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తాజ్ డెక్కన్‌లో గురువారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ డిజిటల్ వ్యాలెట్‌ను ప్రారంభించారు. నగదు రహిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ వ్యాలెట్ ద్వారా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపులు జరుపుకోవచ్చు. ఫోన్ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ వ్యాలెట్ ప్రత్యేకతలు ఇవే.. ఆధార్ ప్లస్ బయో మెట్రిక్, ఆధార్ ప్లస్ మొబైల్ OTP ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆసరా, ఉపాధి హామీ పథకాల ద్వారా వచ్చే నగదును నేరుగా యాప్ ద్వారా పొందొచ్చు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో టీ వ్యాలెట్ యాప్ రూపొందింది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే యాప్ ఉపయోగించుకోవచ్చు. మీ సేవ ద్వారా వ్యాలెట్ లో డబ్బు వేసుకోవచ్చు. యాప్ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితం T వ్యాలెట్ అన్ని ప్రభుత్వ చెల్లింపులను చేసుకోవచ్చు. కరెంట్, వాటర్, జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను, డీటీహెచ్, ల్యాండ్ లైన్, మొబైల్ రీఛార్జి, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించుకోవచ్చు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఫీజులు కూడా చెల్లించుకోవచ్చు. నగదును ఎలాంటి ఛార్జీ లేకుండా ఇతరులకు పంపించుకోవచ్చు. -
టీ-వ్యాలెట్ ఆవిష్కరించిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వ్యాలెట్’ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తాజ్ డెక్కన్‌లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాలెట్ ను ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపులను ఎలాంటి అదనపు రుసుము లేకుండానే టీ-వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు. ఉపకార వేతనాలు, పింఛన్లతో పాటు రేషన్ దుకాణాలకు దీన్ని అనుసంధానం చేయనున్నారు. ఫోన్ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. -
అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరపాలని రాష్ట్ర ఐటీ, పరి శ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలని, దశలవారీగా తెలం గాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలను ఒక అవకాశంగా మార్చుకుంటామని, నగదు రహిత విధా నంతో పాలనా వ్యవస్థలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. అన్ని శాఖలు అంతిమంగా డిజిటల్ చెల్లింపులకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమా వేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, బ్యాంకుల ప్రతినిధులు, టీ–వ్యాలెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశానికి హాజరయ్యారు. నగదు రహిత చెల్లింపుల ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలన్నదే తమ ప్రాథమిక లక్ష్యమని కేటీఆర్ అన్నారు. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళ్తామ న్నారు. ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం పెంచేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమా లను ఈ నెల 7 నుంచి ప్రారంభించామ న్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలను టీ–వ్యాలెట్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలు, ప్రైవేట్ సంస్థలు చేసే లావాదేవీలపై చార్జీల్లేకుండా పూర్తిగా ఉచితం చేయాలని కేంద్రాన్ని కోరతామ న్నారు. వివిధ సంస్థలు, బ్యాంకులు టీ– వ్యాలెట్‌తో కలసి పనిచేసేలా ప్రయత్ని స్తామన్నారు. టీ–వ్యాలెట్‌తో ఇతర వ్యాలె ట్లకు సైతం చెల్లింపుల సౌకర్యానికి అను మతించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నేరుగా ప్రధానితో మాట్లాడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. టీ–వ్యాలెట్ మీద ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీ–వ్యాలెట్ అంతర్జాతీయ ప్రమా ణాలతో ఉంటుందని, భద్రత, సదుపాయం వంటి అంశాల్లో అత్యుత్తమంగా ఉంటుందని జయేశ్‌రంజన్ చెప్పారు. డిజిటల్ చెల్లిం పులపై ఏర్పాటైన సురేశ్‌చందా టాస్క్‌పోర్స్ కమిటీ అధ్యయన నివేదిక, సిఫారసులను కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది.