శనివారం సచివాలయంలో టీ వాలెట్‌ను ఆవిష్కరిస్తున్న మీ – సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు, జయేశ్ రంజన్, అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో 1,700 రేషన్ షాపులను టీ వాలెట్‌తో అనుసంధానం చేస్తున్నామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన టీ వాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం అకున్ మాట్లాడుతూ.. ఈ సేవలను ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. రంగారెడ్డిలో రెండు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించామని తెలిపారు. ఇప్పటికే మీ సేవ, ఈ సేవ, పీఎస్సీ, దోస్త్, విజయా డెయిరీ వంటి సేవలు టీ వాలెట్‌తో లింక్ అయ్యాయని చెప్పారు.
కొత్తగా రేషన్ షాపులకు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఏకైక టీ వాలెట్ ఇదే అని, డిజిటల్ పేమెంట్స్‌కు గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పారు. ఈ వాలెట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వీలును నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. నోట్లపై ఆధారపడకుండా డిజిటల్ ఉపయోగం పెంచాలని చూస్తున్నామని పేర్కొన్నారు. టీ వాలెట్ వాడకంలో ఎలాంటి చార్జీ ఉండదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment