రేపటి నుంచే టీవాలెట్‌ సేవలు | Government Starting T Wallet Services In Telangana | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే టీవాలెట్‌ సేవలు

Published Mon, Oct 21 2019 8:46 AM | Last Updated on Mon, Oct 21 2019 8:47 AM

Government Starting T Wallet Services In Telangana  - Sakshi

సాక్షి, నల్లగొండ : రేషన్‌షాపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని సాంకేతిక పరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం రేషన్‌ షాపుల్లో టీవాలెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో రేపటి నుంచి టీవాలెట్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. టీవాలెట్‌ ద్వారా గ్రామీణప్రాంత ప్రజలు ఆన్‌లైన్‌ సేవలకు పట్టణాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఈ సేవలు అందిస్తున్నందుకు డీలర్లు కూడా కొంత కమీషన్‌ పొందనున్నారు.

ఇప్పటికే 25కుపైగా జిల్లాల్లో టీవాలెట్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22 నుంచి నల్లగొండ జిల్లాలో కూడా అధికారికంగా టీవాలెట్‌ సేవలను జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయి పౌర సరఫరాల శాఖ, టీ వాలెట్‌ అధికారులు కూడా హాజరుకానున్నారు.  

రేపటి నుంచి జిల్లాలో టీవాలెట్‌ సేవలు 
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన టీవాలెట్‌ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో మంగళవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 డివిజన్ల పరిధిలోని డీలర్లకు రెండు విడతల్లో (ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు) వారి మిషన్లలో టీవాలెట్‌ సేవలను ప్రారంభిస్తారు. 

టీవాలెట్‌ ద్వారా అందే సేవలు
రేషన్‌షాపుల ద్వారా ఇప్పటికే బియ్యం, కిరోసిన్‌ అందిస్తున్నారు. ఈ టీవాలెట్‌ ద్వారా మొబైల్‌ రీచార్జ్, మనీ ట్రాన్సాక్షన్స్, డీటీహెచ్‌ పేమెంట్లు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, ట్రావెల్‌ బస్సుల టికెట్‌ బుకింగ్, ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ చార్జీల చెల్లింపుతో పాటు ఆధార్‌ చెల్లింపులు కూడా రేషన్‌షాపుల్లో నుంచే చేసుకునే వీలుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు సిబ్బంది వచ్చిన రోజే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వచ్చేది.. ఈ టీవాలెట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే తమ కరెంట్‌ బిల్లులను చెల్లించవచ్చు.

సెల్‌ ఫోన్‌ రీచార్జ్‌ కూడా రేషన్‌షాపుల్లోనే చేయించుకునే అవకాశం ఏర్పడుతుంది. మనం ఏదైనా ప్రాంతాలకు విహారాయాత్ర, అవసరాల నిమిత్తం వెళ్లాలంటే పట్టణాలకు వెళ్లి ఇంటర్‌నెట్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది.. ఇ ప్పుడు గ్రామాల్లోనే బస్‌ టికెట్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రతి నెలలో రేషన్‌ బియ్యం తెచ్చుకునే సందర్భంలోనే కరెంట్‌ బిల్లు, సెల్‌ రీచార్జ్, టీవీ బిల్లు, ఇంటర్‌నెట్‌ బిల్లులను చెల్లించుకునేందుకు అవకాశం కలగనుంది.

ప్రజలు డీలర్లకు మేలు..
ప్రభుత్వం తీసుకొచ్చిన టీవాలెట్‌ ద్వారా ప్రజలకు గ్రామంలోనే సాంకేతిక పరమైన సేవలు అందడంతో పాటు డీలర్లకు కూడా మేలు జరగనుంది. ప్రజలు గ్రామంలో సేవలు పొందుతూ దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పుతుండగా డీలర్లు మాత్రం అదనపు సేవలు అందించి కమీషన్‌ ద్వారా మరింత ఆదాయం పొందనున్నారు. 

రేపే అధికారికంగా ప్రారంభం
టీవ్యాలెట్‌ సేవలపై ఇప్పటికే మండలాల వారీగా రేషన్‌ డీలర్లకు టీవాలెట్‌ సేవలకు సంబంధించి వారి వద్ద ఉన్న మిషన్లలో టీవ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చారు. ఆ మిషన్‌కు లాక్‌కూడా ఉంచారు. ఈ టీవాలెట్‌ను అధికారికంగా జిల్లా కేంద్రంలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి జిల్లాలో రేషన్‌డీలర్లు దుకాణాల్లో టీవ్యాలెట్‌ సేవలను ప్రజలకు అందించనున్నారు.

22 నుంచి టీవాలెట్‌ సేవలు ప్రారంభం 
జిల్లాలో టీవాలెట్‌ సేవలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని డీలర్లందరికీ ఈ సేవలపై శిక్షణ ఇచ్చాం. టీవాలెట్‌ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామాల్లోనే ఆన్‌లైస్‌ సేవలు పొందే అవకాశం కలుగుతుంది. ప్రజలు ఈ సేవలకు సద్వినియోగం చేసుకోవాలి.     
– రుక్మిణీదేవి, డీఎస్‌ఓ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement