Rayalaseema Thermal Power Plant
-
‘కాంట్రాక్టు’ కుదిరింది!
సాక్షి ప్రతినిధి, కడప : పోట్లదుర్తి బ్రదర్స్‌గా అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్న ఆ ఇద్దరికి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం కల్పతరువుగా మారింది. భవన నిర్మాణాలు, పరిసర గ్రామాలకు మౌలిక వసతులు సైతం వారి కనుసన్నల్లో నిర్వహించాల్సిందే. ఆర్టీపీపీని అడ్డుపెట్టుకుని దోచుకునే కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తున్నారు. తాజాగా కాంటాక్టు కార్మికుల నియామకంలో తాము సూచించిన వారికే సగం పోస్టులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఆమేరకు ఆర్టీపీపీ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి జెన్కో కార్యాలయానికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోట్లదుర్తి బ్రదర్స్ ఆర్టీపీపీ కేంద్రంగా లాభార్జనకు పావులు కదుపుతున్నారు. ఆరవ యూనిట్ నిర్మాణాలు మొత్తం వారి కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు రూ.1500 కోట్లు కాంట్రాక్టు పనులు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఇతర సివిల్ వర్క్ ఏదైనా వారి నేతృత్వంలోనే చేపట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బ్రదర్స్‌కు తెలియకుండా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఆర్టీపీపీలో యాజమాన్యం లేదని తెలుస్తోంది. కాంట్రాక్టు కార్మికుల కోసం ప్రతిపాదనలు పోట్లదుర్తి బ్రదర్స్‌లో ఒకరు ఇటీవల ఆర్టీపీపీ ఉన్నతాధికారితో సమావేశమైనట్లు సమాచారం. అధికారంలో ఉన్నాం, గ్రామాల్లో ఉద్యోగాల కోసం బాగా ఒత్తిడి ఉంది. వంద కాంటాక్టు కార్మికుల ఉద్యోగాలు కావాలని కోరినట్లు తెలిసింది. తమ చేతుల్లో నియామకాల అధికారం ఉండదని జెన్కో నుంచి అనుమతులు తీసుకోవాలని ఆర్టీపీపీ యంత్రాంగం సూచించినట్లు తెలుస్తోంది. అలాగే కానీయండి, ప్రతిపాదనలు పంపండి, జెన్కో నుంచి అనుమతులు తెప్పిస్తామని దేశం నేత పేర్కొన్నట్లు వినికిడి. ఈ ఉద్యోగాల నియామకాల్లో యూనియన్ నేతలు, ఇతర పార్టీలు అంటే కుదరదని వంద కాంట్రాక్టు ఉద్యోగాలు తమకే కావాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వంద పోస్టులు ఏకపక్షంగా కేటాయించాలంటే సాధ్యం కాదని అధికారులు వివరించడంతో 200 పోస్టులకు ప్రతిపాదనలు పంపండి, వంద పోస్టులు యూనియన్లు ఇతర సమీకరణల్లో భాగంగా కేటాయించండని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో వంద పోస్టులు తాము సూచించిన వారికి అప్పగించాలనే అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జెన్కో కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. జెన్కో డెరైక్టర్‌తో ఇప్పటికే దేశం నేత ఒకరు పలుమార్లు సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఒక్కమారుగా అన్ని కాంటాక్టు కార్మికుల పోస్టులు కేటాయిస్తే ఆరోపణలు వస్తాయని ఓ డెరైక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. ఏమైనా తమకు అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనని, మీకు కావాలంటే సీఎంఓ నుంచి ఆదేశాలు ఇప్పిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై ఏం చేయాలో దిక్కుతోచక జెన్కో డెరైక్టర్లు తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. పోట్లదుర్తి బ్రదర్స్‌కు ఆర్టీపీపీ దోపిడీకి కేంద్రంగా మారిందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కాగా కాంటాక్టు కార్మికుల ప్రతిపాదనలపై ఆర్టీపీపీ ఇన్‌ఛార్జి సీఈ దేవేంద్రనాయక్‌ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని చెబుతూనే, తాను క్యాంపులో ఉన్నానంటూ ఫోన్ కట్ చేశారు. -
ఆర్టీపీపీలో ప్రమాదం.. ఏడీఈ మృతి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లో ఇనుపరాడ్లు విరిగిపడటంతో ఏడీఈ నాగేంద్ర కుమార్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. -
అంధకారం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాను చీకటి కమ్మేసింది. పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఆందోళన సోమవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో ఉద్యోగులు అదే స్థాయిలో భీష్మించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయాన్నే విద్యుత్ భవన్‌కు తాళం వేశారు. విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాన్నీ మూసేశారు. సమ్మె కారణంగా జెన్కో సిబ్బంది విధులకు దూరంగా ఉండటంతో వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడ, కొత్తగూడెం, ఇతర పవర్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి మందగించింది. సాధారణ రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద 11,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. సమ్మె కారణంగా ఆరు వేల మెగావాట్లకు పడిపోవడం గమనార్హం. ఫలితంగా జిల్లాలోనూ విద్యుత్ కష్టాలు చుట్టుముట్టాయి. మొత్తం 10.55 లక్షల మంది వినియోగదారుల అవసరాలకు రోజుకు 90.20 లక్షల యూనిట్లు అవసరం కాగా.. సమ్మె కారణంగా 25 లక్షల యూనిట్ల లోటు తలెత్తింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచే కష్టాలు మొదలయ్యాయి. గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, నందికొట్కూరు తదితర సబ్ డివిజన్లలో రాత్రి 10 గంటల వరకు కోతలు విధించారు. అప్పటి నుంచి నంద్యాల డివిజన్లోని ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆదోని డివిజన్లలోని గ్రామాలకు సరఫరా నిలిపేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లోనూ నాలుగైదు గంటలకు పైగా కోత అమలైంది. సోమవారం సమస్య మరింత జటిలమైంది. జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపేశారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు కోత విధించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి కరెంట్ కోత కొనసాగుతోంది. గ్రామాల్లో చీకటి అలుముకుంది. 244 భారీ పరిశ్రమలకు సైతం విద్యుత్ సరఫరా నిలిపేయడంతో యజమానులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు ఉద్యోగులు సమ్మె విరమించారు. కొనసాగిన నిరసన విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన సోమవారం రెండో రోజు కొనసాగింది. స్థానిక విద్యుత్ భవన్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామకృష్ణ మాట్లాడుతూ వేతన సవరణ జీవోను వెంటనే విడుదల చేయాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఏర్పడిన చీకటి కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరసనలో అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.