సాక్షి ప్రతినిధి, కడప : పోట్లదుర్తి బ్రదర్స్‌గా అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్న ఆ ఇద్దరికి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం కల్పతరువుగా మారింది. భవన నిర్మాణాలు, పరిసర గ్రామాలకు మౌలిక వసతులు సైతం వారి కనుసన్నల్లో నిర్వహించాల్సిందే. ఆర్టీపీపీని అడ్డుపెట్టుకుని దోచుకునే కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తున్నారు. తాజాగా కాంటాక్టు కార్మికుల నియామకంలో తాము సూచించిన వారికే సగం పోస్టులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఆమేరకు ఆర్టీపీపీ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి జెన్‌కో కార్యాలయానికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోట్లదుర్తి బ్రదర్స్ ఆర్టీపీపీ కేంద్రంగా లాభార్జనకు పావులు కదుపుతున్నారు. ఆరవ యూనిట్ నిర్మాణాలు మొత్తం వారి కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు రూ.1500 కోట్లు కాంట్రాక్టు పనులు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఇతర సివిల్ వర్క్ ఏదైనా వారి నేతృత్వంలోనే చేపట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బ్రదర్స్‌కు తెలియకుండా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఆర్టీపీపీలో యాజమాన్యం లేదని తెలుస్తోంది.
కాంట్రాక్టు కార్మికుల కోసం ప్రతిపాదనలు
పోట్లదుర్తి బ్రదర్స్‌లో ఒకరు ఇటీవల ఆర్టీపీపీ ఉన్నతాధికారితో సమావేశమైనట్లు సమాచారం. అధికారంలో ఉన్నాం, గ్రామాల్లో ఉద్యోగాల కోసం బాగా ఒత్తిడి ఉంది. వంద కాంటాక్టు కార్మికుల ఉద్యోగాలు కావాలని కోరినట్లు తెలిసింది. తమ చేతుల్లో నియామకాల అధికారం ఉండదని జెన్‌కో నుంచి అనుమతులు తీసుకోవాలని ఆర్టీపీపీ యంత్రాంగం సూచించినట్లు తెలుస్తోంది. అలాగే కానీయండి, ప్రతిపాదనలు పంపండి, జెన్‌కో నుంచి అనుమతులు తెప్పిస్తామని దేశం నేత పేర్కొన్నట్లు వినికిడి. ఈ ఉద్యోగాల నియామకాల్లో యూనియన్ నేతలు, ఇతర పార్టీలు అంటే కుదరదని వంద కాంట్రాక్టు ఉద్యోగాలు తమకే కావాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వంద పోస్టులు ఏకపక్షంగా కేటాయించాలంటే సాధ్యం కాదని అధికారులు వివరించడంతో 200 పోస్టులకు ప్రతిపాదనలు పంపండి, వంద పోస్టులు యూనియన్లు ఇతర సమీకరణల్లో భాగంగా కేటాయించండని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో వంద పోస్టులు తాము సూచించిన వారికి అప్పగించాలనే అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జెన్‌కో కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. జెన్‌కో డెరైక్టర్‌తో ఇప్పటికే దేశం నేత ఒకరు పలుమార్లు సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఒక్కమారుగా అన్ని కాంటాక్టు కార్మికుల పోస్టులు కేటాయిస్తే ఆరోపణలు వస్తాయని ఓ డెరైక్టర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఏమైనా తమకు అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనని, మీకు కావాలంటే సీఎంఓ నుంచి ఆదేశాలు ఇప్పిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై ఏం చేయాలో దిక్కుతోచక జెన్‌కో డెరైక్టర్లు తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. పోట్లదుర్తి బ్రదర్స్‌కు ఆర్టీపీపీ దోపిడీకి కేంద్రంగా మారిందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కాగా కాంటాక్టు కార్మికుల ప్రతిపాదనలపై ఆర్టీపీపీ ఇన్‌ఛార్జి సీఈ దేవేంద్రనాయక్‌ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని చెబుతూనే, తాను క్యాంపులో ఉన్నానంటూ ఫోన్ కట్ చేశారు.
‘కాంట్రాక్టు’ కుదిరింది!
Published Mon, Aug 31 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement