Rayalaseema University Registrar
-
మెస్ బిల్.. గుండె గుబేల్!
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఇష్టారాజ్యంగా మెస్ బిల్లులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు హాస్టల్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండా పర్చేజ్ కమిటీ అనామతుగా బిల్లలు చెల్లిస్తుండడంతో విద్యార్థులకు బిల్లుల భారం పెరుగుతోంది. ఏడాదికి అదనంగా రూ.15 లక్షలు అదనపు భారం పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు హాస్టళ్లకు సంబంధించి ప్రొవిజన్స్, కూరగాయలు, పాలు తదితర వాటికి ఎలాంటి టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం మెస్ నిర్వహణ కోసం 15 రోజులకు సరిపడా వస్తువులను కొనుగోలు చేశారు. టెండర్ల ఊసే లేదు.. విశ్వవిద్యాలయంలో మూడు మెన్స్ హాస్టళ్లు, రెండు ఉమెన్స్ హాస్టళ్లున్నాయి. గతేడాది 330 మంది అబ్బాయిలు, 335 మంది అమ్మాయిలు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రొవిజన్లకు సంబంధించి 2016 టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా ఒక నెలకు మాత్రమే అని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు ఎవరైతే టెండర్లలో దక్కించుకున్నారో వారినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక కూరగాయలు, పాలు, నీటి సరఫరాకు సంబంధించి వర్సిటీ ఏర్పటి నుంచి అయిన వారికే అప్పగిస్తున్నారు. ఇందులో వర్సిటీ కీలక అధికారులకు పర్సెంటేజీలు అందుతుండటంతో టెండర్లు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థులపై భారం.. వర్సిటీలోని ఆరు హాస్టళ్లలో 665 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.2000 నుంచి రూ.2500 వరకు మెస్ బిల్లు వస్తుంది. అయితే స్కాలర్షిప్ కోర్సు, కేటగిరిని బట్టి ఏడాదికి రూ.5400 నుంచి రూ. 7000 వరకు వస్తుంది. మిగతాది విద్యార్థులు చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరలకు కోట్ చేసినవారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల బారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నివేదిక ఇవ్వని విచారణ కమిటీ గత విద్యా సంవత్సరం హాస్టళ్ల ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డితో కమిటీ నియమించారు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక సమర్పించలేదు. త్వరలో టెండర్లు పిలుస్తాం హాస్టల్స్‌కు ప్రొవిజన్స్, కూరగాయలు సరఫరా చేయడానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేస్తాం. ఉన్నవారితోనే మార్కెట్ ధరలకు అనుగుణంగా వస్తువులను సరఫరా చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి వస్తువులను సరఫరా చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ సారి పర్చేజ్ కమిటీతో పాటు, విద్యార్థుల సమక్షంలోనే టెండర్లు ఓపెన్ చేస్తాం. – ప్రొఫెసర్ అమర్నాథ్, రిజిస్ట్రార్ -
రిజిస్ట్రార్‌పై దాడి ఎఫెక్ట్
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై దాడి ఘటన పట్ల ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. బీఈడీ కళాశాలల స్టాఫ్ అప్రూవల్ విషయంలో ఈనెల 5న రిజిస్ట్రార్‌పై ఎస్కే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరి, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిపై కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దాడికి యత్నించినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయాన్ని బంద్ చేసి ఆందోళనలు చేపట్టారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో పలు సందేహాలకు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వర్సిటీ ఘటనపై చర్యలకు పూనుకుంది. ఈమేరకు శనివారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎస్కేయూ, ఆర్యూ ఇన్చార్జ్ వీసీలకు పలు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఎస్కేయూ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరిని సస్పెండ్ చేయాలని, ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. శుభపరిణామం ఆర్యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడి ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించడం శుభపరిణామమని ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవటం వర్సిటీ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది విజయమన్నారు. -
కథలు వాస్తవికతకు దర్పం పట్టాలి
కోవెలకుంట్ల: వాస్తవికతకు దర్పం పట్టేలా కథలు సాగాలని రాయలసీమ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎం. జయరాజ్ చెప్పారు. రాయలసీమ కథకులు- సామాజిక అధ్యయనం అన్న అంశంపై పట్టణంలోని వాసవీ బొమ్మిడాల డిగ్రీ కళాశాలలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ నాదం శశికళ అధ్యక్షతన జాతీయ సదస్సు నిర్వహించారు. రెండురోజులుగా జరుగుతున్న ఈ సదస్సు శుక్రవారంతో ముగిసింది. చివరిరోజున సదస్సుకు రిజిస్ట్రార్, కథ రచయిత హరికిషన్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా తెలంగాణా, కుప్పం, యోగివేమన, రాయలసీమ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, కవులు, రచయితలు రాయలసీమ కథకులు- సామాజిక అధ్యయనం అంశంపై పత్ర సమర్పన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిజస్ట్రార్ మాట్లాడుతూ కథల ప్రభావం సమాజంపై చూపుతుందన్నారు. అయితే, వాస్తవికతకు దగ్గరగా సమస్యల పరిష్కార మార్గంగా కథలు సాగాలని సూచించారు. గతంలో జాతీయ సదస్సులు విశ్వవిద్యాలయ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించేవారన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో నిర్వహించినా విజయవంతమవుతున్నాయని పేర్కొన్నారు. కోవెలకుంట్లలో జాతీయ సదస్సు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. కథ రచయిత హరికిషన్ మాట్లాడుతూ కరువుల చరిత్ర రాయలసీమదని, 1990కి ముందు ప్రతి ఐదేళ్లకోసారి రాయలసీమలో కరువు వచ్చేదని, ప్రస్తుతం మూడేళ్లకొకసారి పలకరిస్తోందన్నారు. సీమలో వ్యవసాయం జూదంగా మారిందన్నారు. ఈప్రాంతాన్ని ఆదుకునేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మల్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సదస్సు కన్వీనర్ బావికాటి రాఘవేంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గంగన్న, అధ్యాపకులు, వ క్తలు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.