Rayapati Sambasiava Rao
-
ఆశ వదులుకున్న రాయపాటి!
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నరసరావుపేట లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు టీటీడి చైర్మన్ పదవిపై ఆశవదులుకున్నారు. టీటీడి చైర్మన్ పదవిపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. ఆ రేసులో తాను లేనని రాయపాటి తెలిపారు. ఈ పదవిపై రాయపాటి గంపెడు ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పదవి తనకు ఇవ్వమని ఆయన గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. టీటీడీ ఛైర్మన్గా ఒక్కసారైనా పని చేయాలన్నది తన జీవితాశయమని, అయితే ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదని కూడా ఆయన బాబుకు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ పదవిపై మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, రాజమండ్రి ఎంపి మురళీ మోహన్, సినీనటుడు శివాజీ, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్.... ఇలా చాలా మంది ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదలవాడ కృష్ణమూర్తి పేరుని ఖరారు చేసినట్లు తెలిసింది. దాంతో రాయపాటి ఆ పదవిపై ఆశలు వదులుకున్నారు. ** -
రాయపాటి... ఇదేం పరిపాటి?
తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఎదురుదాడి చేయడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఇదే విద్య ప్రదర్శిస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలపై దానిపై సూచనలు, సలహాలు ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై చిందులేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడితో ఆగకుండా నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసేస్తున్నారు. ఎన్నికలకు ముందు 'హస్తం' గూటి నుంచి బయటకు వచ్చి పచ్చ కండువా కప్పుకున్న ఎంపీ రాయపాటి సాంబశిరావు- శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై తీవ్రారోపణలు చేశారు. కమిటీలోని కొంత మంది సీనియర్ సభ్యులు దొనకొండ, చుట్టుపక్కల ప్రాంతంలో భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. అందుకోసమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిందని శివమెత్తారు. కమిటీని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభావితం చేశారన్న విషయం తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక కమిటీ నివేదిక పట్ల సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కమిటీ దొనకొండలో పర్యటించినప్పటికీ... అక్కడకు కమిటీ సభ్యులు వెళ్లలేదని రాయపాటి చెప్పడం గమనార్హం. కమిటీపై ఆరోపణలు చేసిన రాయపాటికి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ ఇచ్చారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి రెచ్చిపోతున్నారని అన్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడగుంటూరు-తెనాలిమంగళగిరి(వీజీటీఎం)లో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుకున్నారని చెప్పారు. కమిటీ నివేదికతో రాయపాటి సహా టీడీపీ కంగుతిన్నారని ఎద్దేవా చేశారు. సమర్థులైన అధికారులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీపై రాయపాటి ఆరోపణలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమకు నచ్చనివారిపై నిందలు వేయడం పచ్చ బాబులకు పరిపాటిగా అంటున్నారు.