ఎవుసం భారం
ఏటేటా పెరుగుతున్న పెట్టుబడి
ఎకరా పత్తి సాగుకు రూ.15 వేలపైనే పెట్టుబడి
సకాలంలో వర్షాలు లేక ఎండుముఖం పడుతున్న పంట
కూలీల కొరతతో ఇబ్బందులు
రాయికోడ్: వ్యవసాయం ఏటేటా భారమవుతోంది. కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ట్రాక్టర్ కిరాయితో అన్నదాతలు సతమతమవుతున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు, కార్మికులు, కార్మికేతరులు సైతం పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బీడుభూములు సైతం సాగులోకి వచ్చాయి.
మండలంలో ప్రధానంగా పత్తి, కంది, పెసర, మినుము, సోయాబీన్ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 7,649 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. జూన్లో కురిసిన తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలు విత్తిన రైతులు దిగుబడిపై భారీ అంచనాతో ఉన్నారు. ఎకరం పత్తిపంట సాగు కోసం ఇప్పటి వరకు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు.పంట ఇంటికి చేరే వరకు మరో రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు.
ప్రతి సంవత్సరం కూలీలకు కూలి, ట్రాక్టర్ కిరాయి పెరగడమే కారణమని చెబుతున్నారు. ఒక్కో కూలీకి రోజుకు రూ.300, ఎకరం దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయి రూ.1,200 చెల్లిస్తున్నారు. ఎడ్ల నాగళ్లతో దుక్కులు దున్నడం చాలా వరకు తగ్గింది. కూలీలు కొరతతో కూలి రేట్లు రెండింతలు పెరిగాయి. రోజుకు కనీసం రూ.300 చెల్లిస్తే తప్పా కూలీలు పనులకు రాని పరిస్థితి. పెరిగిన పెట్టుబడిని తట్టుకోవాలంటే ఎకరం విస్తీర్ణంలో కనీసం 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉంటుందని అంటున్నారు.
పంటలు ఎండుముఖం
మొదట్లో సరైన సమయంలో వర్షాలు కురవక పలువురు రైతులు వేసిన విత్తనాలను దున్నేసి రెండోసారి విత్తారు. జూన్లో 168 ఎంఎం సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 133 ఎంఎం మాత్రమే కురిసింది. జూలైలో 205 ఎంఎం సాధారణ వర్షపాతానికి 225 ఎంఎం నమోదు కావడంతో రైతులకు ఊరట లభించింది.
ఆగస్టులో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లో పత్తి పంట వాడిపోతోంది. ఈ నెలలో 215 ఎంఎం సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 39 ఎంఎం మాత్రమే కురిసింది. గత రెండు వారాలుగా వాతావరణం వేసవిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి పంటలు వాడిపోతున్నాయి. మండల కేంద్రంలో కురిసిన వర్షాలు ఇతర గ్రామాల్లో కురవడం లేదు. ప్రస్తుతం రైతులు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
గత రెండేళ్లుగా పంటల దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయామని వాపోతున్నారు. వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. ఇందుకుగాను ఉపాధి హామీ పథకం పనులను వ్యవసాయానికి అనుబంధం చేయాలని విన్నవిస్తున్నారు.
ఎకరం పత్తి సాగుకు పెట్టుబడి వివరాలు
పని ఖర్చు
దిక్కి దున్నడానికి రూ.1,500
కల్టివేటర్కు రూ.500
పత్తి గీతకు.. రూ.500
విత్తనాల కొనుగోలు రూ.1,600
కూలీల ఖర్చు రూ.800
మూడు బస్తాల ఎరువు రూ.2,200
ఎరువు చల్లడానికి రూ.500
రెండుసార్లు కలుపు రూ.3,000
పత్తి అంతర కృషికి (మూడుసార్లు) రూ.1,800
రసాయనాల కొనుగోలు(రెండుసార్లు) రూ.2,400
రసాయనాల పిచికారీ(రెండుసార్లు) రూ. 1,600
మొత్తం రూ.16,400
పెట్టుబడులు పెరిగాయి
పంటల సాగు భారమవుతోంది. విత్తనాలు, ఎరువులు, కూలి రేట్లు పెరుగుతున్నాయి. పంటలకు మద్దతు ధర ఉండటం లేదు. అప్పులు పెరుగుతున్నాయి. వ్యవసాయాన్ని బతికించాలంటే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని సాగు పనులకు అనుసంధానం చేయాలి. పంటలకు మద్దతు ధర అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - ఎల్.సంగన్న, జంమ్గి రైతు
ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి
4 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఇప్పటి వరకు ఎకరాకు రూ.16 వేలకుపైగానే పెట్టుబడి పెట్టాను. పంట ఇంటికి చేరుకునే సరికి రూ.20 వేల పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే పెట్టుబడి పోను కొంతైనా లాభం పొందొచ్చు. ట్రాక్టర్, కూలీ రేట్లు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడంతో ఎవుసం భారమవుతోంది. - బి.విఠల్, జంమ్గి రైతు