పట్టువీడని స్వామి, మోదీకి లేఖ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పై విమర్శలకు మరింత పెదును పెడుతున్నారు. ఆయన్ను ఆర్బీఐ గవర్నర్ గా తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నష్టాల బాట పట్టిస్తున్న రాజన్ వెంటనే తొలగించాలని స్వామి డిమాండ్ చేశారు.
నిన్న ( సోమవారం) ప్రధానికి రాసిన లేఖలో రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని స్వామి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వం రాజన్ కు జారీ చేసిన గ్రీన్ కార్డ్ ను పొడిగించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. రాజన్ తీసుకున్న నిర్ణయాల మూలంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ తన దాడిని కొనసాగించారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఆర్బీఐ గవర్నర్ పై బహిరంగంగానే పొగడ్తలు కురిపించారు. సంక్లిష్ట ఆర్థిక సమస్యలను పెర్ ఫెక్ట్ గా విశ్లేషించారని ఒక సమావేశంలో ప్రశంసించారు. అటు కేంద్ర బ్యాంకునకు, ప్రభుత్వానికి మధ్య గౌరవప్రదమైన సంబంధంగా నిలిచారనే ఖ్యాతిని రాజన్ దక్కించుకున్నారు. మరోవైపు స్వామి ఆరోపణలపై రాజన్ మౌనం వహించారు. అటు రెండవసారి ఆయనకు ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు అప్పటించడంపై నిర్వహించిన సర్వేలో రాజన్ పెర్ ఫెక్ట్ అంటూ నెటిజన్లు కితాబిచ్చారు. మరి ఈ విభిన్నాల నేపథ్యంలో ఎంపీ లేఖపై బీజీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.