RCom debt
-
కార్పొరేట్ బ్రదర్స్ : అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై: అప్పుల్లోమునిగిపోయిన సోదరుడిని ఆదుకునేందుకు మరోసారి అన్న రంగంలోకి దిగనున్నారు. ఈ అపూర్వ సహోదరులు ఎవరంటే..కార్పొరేట్ బదర్స్ అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన సోదరుడిని గట్టెక్కించేందుకు పెద్ద మనసు చేసుకోనున్నారనే టాక్ బిజినెస్ వర్గాల్లో వ్యాపించింది. అన్ని అడ్డంకులను దాటుకుని ఇది వాస్తవ రూపం దాలిస్తే..అనిల్ అంబానీ భారీ ఊరట లభించినట్టేనని భావిస్తున్నారు. ధీరూభాయ్ అంబానీ తనయులైన ముకేశ్, అనిల్ అంబానీ ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముకేశ్ వ్యాపారంలో రాణిస్తూ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో దూసుకు పోతుండగా, అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకపోయి ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలోంచి ఇటీవల పడిపోయారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో సంస్థ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల కొనుగోలుకు యోచిస్తోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్‌కాం సంస్థ దివాలా తీసిన నేపథ్యంలో ఆయా ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీ బిడ్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఆర్‌కామ్‌కు సంబంధించిన టవర్లు, ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేయాలని భావిస్తోందట. అంతేకాదు నవీ ముంబైలోని పలు భూములను కూడా కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంక ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీని కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.25వేల కోట్లు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. కాగా రూ.7,300 కోట్లమేర ఆర్‌కాం ఆస్తుల కొనుగోలు చేయాలని ముకేశ్ గతంలో ప్రయత్నించారు, కానీ టెలికాం శాఖ అనుమతి లభించక పోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఎరిక్సన్ కు కట్టాల్సిన రూ.580 కోట్లు అప్పును ముకేశ్ అంబానీ చెల్లించి అనిల్‌ను పెద్ద ప్రమాదం (జైలుకు వెళ్లకుండా) నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. -
భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ ప్లాన్స్ ఇవే!
ఆర్ కామ్ కు అప్పుల కుప్పతో మారిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.45వేల కోట్లను ఇది బ్యాంకర్లకు బాకీ పడింది. ఈ భారీ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు టవర్ ఆస్తుల విక్రయం ఆర్ కామ్ రుణాన్ని 60 శాతం తగ్గిస్తాయని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చెప్పారు. ఆర్ కామ్ రుణం రూ.45కోట్ల మేర ఉందని, ఈ రుణాన్ని తగ్గించుకునే ప్రణాళికలను బ్యాంకర్లుఆమోదించారని అనిల్ అంబానీ తెలిపారు. ఈ రెండు డీల్స్ ను పూర్తి చేసుకోవడానికి తమ వద్ద డిసెంబర్ వరకు సమయముందని చెప్పారు. ''లెండర్లందరితో మేము మీటింగ్ నిర్వహించాం. మా ప్లాన్స్ వివరించాం. వాటిని లెండర్లు ఆమోదించారు. కంపెనీ వద్ద రుణాన్ని తగ్గించుకోవడానికి ఏడు నెలల సమయముంది'' అని తెలిపారు. ఒకవేళ అప్పటికి కూడా రుణాన్ని తగ్గించుకోలేని పక్షంలో రుణాన్ని పునర్వ్యస్థీకరించుకునేందుకు వీలుగా ఆర్బీఐ ప్రొవిజన్స్ ఉన్నాయని, వాటిని అప్లై చేస్తామని చెప్పారు. ఇదేసమయంలో ఎయిర్ సెల్- ఆర్ కామ్ విలీనానికి కూడా డిసెంబర్ వరకు లెండర్లు సమయమిచ్చినట్టు, దీంతో విలీనసంస్థ ఎయిర్ కామ్ గా మారనుందని పేర్కొన్నారు. విలీనం అనంతరం కొత్త వైర్ లెస్ కంపెనీలో 50 శాతం స్టాక్ ను ఆర్ కామ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు స్టాక్ ను అమ్మే డీల్స్ అనంతరం అంటే సెప్టెంబర్ 30కి ముందే రూ.25వేల కోట్ల రుణాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లిస్తామని వాగ్ధానం చేశారు. రుణాన్ని ఈక్విటీలోకి మార్చే ప్రతిపాదనేమీ లేదని స్పష్టంచేశారు. కంపెనీకి రేటింగ్ ఏజెన్సీల ఇస్తున్న డౌన్ గ్రేడింగ్ పై అనిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.