సమ్‌థీమ్.. స్పెషల్
ట్రెడిషనల్‌కు మోడర్న మిక్స్ చేసి... అమ్మలకు... అలాగే అమ్మాయిలకు నచ్చేలా ట్రెండీ శారీస్ ఇప్పుడు సిటీలో కనిపిస్తున్నాయి. మగువలకు నిండైన అందమే కాదు... విభిన్న థీమ్‌లతో వారిని మరింత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి.
ట్రెడిషనల్లో మోడరన్...
మోడరన్ గర్ల్స్ ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే వారి యాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే ఈ శారీస్ చక్కని ఎంపిక. మోడరన్, యూత్‌ఫుల్ నేచర్‌ని దుస్తుల ద్వారా కూడా క్యారీ చేయగల వారికి మాత్రమే ఈ చీరలు మరింత అందాన్ని, కొత్త లుక్‌ని ఇవ్వగలవు. ఐటీ అమ్మాయిలు, కాలేజ్ గాళ్స్ ఈ తరహా చీరలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సంప్రదాయంగా రూపుదిద్దుకున్న చీరలపై స్కర్ట్స్, మిడ్డీస్ వంటి వెరైటీలను జత చేయడంతో అటు ట్రెడిషనల్ లుక్‌నీ, ఇటు మోడ్రన్ ట్రిక్స్నీ ఒకేసారి ఫాలో అయిపోయినట్టు ఫీలై పోవచ్చు అమ్మాయిలు.
అమ్మ నేర్పే లాలి‘పాఠం’...
అమ్మే అందరికీ ఆది గురువు. అందుకే, అమ్మ కట్టే చీరను కూడా అక్షరాలతో, అంకెలతో, పురాణగాథలతో, ఇలా పిల్లలకు వివిధ అంశాలను అలవోకగా నేర్పడానికి అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మ చెంగు పట్టుకుని ఆడుకుంటూనే ఆల్ఫాబిట్స్ని, బొమ్మలను గుర్తించి వాటిని మననం చేయించేందుకు వీలుగా ఈ చీరలను రూపొందించారు. హనుమ సంజీవనీతో వెళ్లటం, లంకా దహనం వంటి పురాణ కథల ఇతివృత్తంగా చీరలపై చిత్రాలుగా ముద్రిస్తున్నారు. అలాగే రైమ్స్ కూడా అమ్మ చెంగుపై చిత్రాలుగా మలిచేస్తున్నారు. పిల్లలకు నేర్పించవలసిన మంచి అలవాట్లు ఏ గోడ మీదో, పుస్తకంలో ఉంటే పిల్లలకు గుర్తు పెట్టుకోవటం కష్టమేమో గాని అదే అమ్మ చీర మీద చూసి తెలుసుకుంటే మరిచిపోవటం అసాధ్యమే.
మ్యాజిక్ శారీ...
చెంగు, కుచ్చులు, పిన్నులు... ఇలా చీర కట్టడానికి ఎన్నో తిప్పలు. రోజువారీ హడావుడిలో చీర కట్టు కోసం పావుగంట పైగా సమయం కేటాయించటం, రోజంతా రద్దీలో చీరతో పడుతూ లేస్తూ తిరగటం లాంటి చిక్కులు తలుచుకొని నేటి యువతులు చీర కట్టడాన్ని పండుగలు, పబ్బాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఈ ఇబ్బంది ఉందంటే మా దగ్గర పరిష్కారం రెడీగా ఉందంటూ ముందుకొచ్చేస్తున్నారు నవ డిజైనర్లు.సింగిల్ పిన్నుతో కూడా పనిలేకుండా ధరించేలా రెడీమేడ్ చీరలు రూపొందిస్తున్నారు. దీనికి మ్యాచింగ్ పెట్టికోట్, బ్లౌజ్‌లు వెతుక్కోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఈ మ్యాజిక్ శారీ మొత్తం ప్రిస్టిచ్డ్ సెటప్‌తో వస్తుంది. దీనిని స్కర్ట్లాగా తొడుక్కుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా ఫారినర్స్, యంగ్‌స్టర్స్, చీర కట్టు గురించి బొత్తిగా తెలియని మనవాళ్లని కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ చీరకట్టుకి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, కట్టుకున్న వారు మరింత నాజూకుగా కనిపిస్తారట. అంతకన్నా ఆ‘కట్టుకునే’ విషయం ఏముంటుంది?
- శిరీష చల్లపల్లి