‘రియాల్టీ’ సవరణలకు కేబినెట్ ఓకే!
బిల్లు పరిధిలోకి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు కూడా!
అవకతవకలకు పాల్పడిన బిల్డర్లకు కఠిన శిక్షలు
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పిస్తూ రూపొందించిన స్థిరాస్తి బిల్లు(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్)లో సవరణలకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. బ్రోకర్లు, కమర్షియల్ ప్రాజెక్టులు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను బిల్లు పరిధిలోకి తీసుకువస్తూ బిల్లులో సవరణలు చేశారు. అవకతవకలకు పాల్పడే నిర్మాణదారులకు(బిల్డర్లు) జైలుశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఇప్పటికే బిల్లులో ఉండగా.. గృహనిర్మాణ ప్రాజెక్టులు సహా అన్ని ప్రాజెక్టుల డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కనీసం 50% డబ్బును నిర్మాణ ఖర్చుల కోసం థర్డ్ పార్టీ ఆధీనంలో ఉండే ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధనను తాజాగా బిల్లులో చేర్చారు.
ఇతర అంశాలు..
మూడింట 2 వంతుల మంది కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డింగ్ ప్లాన్‌ను, నిర్మాణ డిజైన్‌ను మార్చడానికి వీల్లేదు.
ప్రతీ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి.
ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు శిక్ష విధింపు.
జిల్లా జడ్జి స్థాయి అధికారిని అడ్జ్యూడికేటింగ్ ఆఫీసర్‌గా నియమించాలి.
అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.
డెవలపర్లు తమ ప్రాజెక్టులను(రెసిడెన్షియల్, కమర్షియల్) నియంత్రణ సంస్థ వద్ద 60 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాజెక్టు వివరాలన్నీ.. ప్రమోటర్లు, లేఔట్, అనుమతులు, భూమి వివరాలు మొదలైనవన్నింటినీ బహిరంగపర్చాలి.
రిజిస్టర్ చేయకపోతే ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 10% జరిమానాగా విధిస్తారు. అప్పటికీ రిజిస్టర్ చేసుకోకపోతే మరో 10% జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. తప్పుడు సమాచారమిస్తే ప్రాజెక్టు ఖర్చులో 5% జరిమానా విధిస్తారు.
నిబంధనల ఉల్లంఘనను కొనసాగిస్తూ ఉంటే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు.
జువనైల్ బిల్లుపై చర్చించని కేబినెట్
జువనైల్ బిల్లులో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఎజెండా నుంచి తప్పించారు. 16 నుంచి 18 ఏళ్ల వయసున్నవారిని ఐపీసీ కింద విచారణ జరిపేందుకు అనుమతించే ప్రతిపాదనపై కేబినెట్‌పై చర్చించాల్సి ఉండగా.. హక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, జువనైల్ చట్టాలను పునఃసమీక్షించాలన్న సుప్రీంకోర్టు ఇటీవల వాఖ్యనించడం.. మొదలైన కారణాలతో ఆ అంశాన్ని అజెండా నుంచి తొలగించారు.