real names
-
పలమనేరు అసలు పేరు తెలుసా..?
సాక్షి, చిత్తూరు: ఈతరం పిల్లలకు ఉంటున్న ఊరు పేరెందుకొచ్చిందో తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం ఊరి పేరు ఎందుకొచ్చిందో గూగూల్ తల్లిని అడిగినా పెద్దక్లారిటీ ఉండదు. అందుకే పలమనేరుకు ఆపేరెలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం పలమనేరు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించే వారు. పట్టణానికి పడమటి వైపు ఓ చెరువును తవ్వించి దానికి పల్లవన్ ఏరి అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పల్లవన్ ఏరి అంటే చెరువు వద్ద ఉన్న గ్రామమని అర్ధం. ఈ పల్లవనేరే కాలక్రమేణ పల్నేరు ఆపై పలమనేరుగా రూపాంతరం చెందింది. పలమనేరు పట్టణ వ్యూ ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2244 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని పేదవాని ఊటిగా పిలుస్తారు. పలమనేరు పట్టణం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఇక్కడ తెలుగు,తమిళం, కన్నడ భాషలను మాట్లాడుతారు. ఇప్పటికీ ఈ మూడు సాంప్రదాయలు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి గుడియాత్తం, క్రిష్ణగిరి, మదనపల్లె, కుప్పం, బెంగుళూరులకు రోడ్డు మార్గాలున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి పులకించిన అప్పటి యూరోపియన్, బ్రిటిష్ అధికారులు దీన్ని వారి వేసవి విడిదిగా ఉపయోగించారు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు దానికి సంబంధించిన విడిది గృహము ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. (ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం). వీటితో పాటు పీర్ల రహదారి, సర్కెట్ హౌస్, వైట్ సైడ్ అతిథి గృహాల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అమెరికన్ ఆర్కాడ్ మిషన్‌చే ఓ అతిథి గృహం 1932లోనే నిర్మితమైంది. అప్పట్లోనే నెలకు దీని అద్దె రూ.40గా వసూలు చేసేవారట. ఇక ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌తో పాటు క్రిస్టియన్లకు సంబంధించిన పలు సుందరమైన పురాతన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు ఇక్కడి సీఎస్ఐ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు సేద తీరిన మర్రి చెట్టు ఉంది. ప్రతి శుక్రవారం పట్టణంలో జరిగే వారపు సంత, పశువుల సంత అనాదిగా జరుగుతోంది. పలమనేరు టమోటా, పట్టు, చింతపండు, పాలుకు ప్రసిద్ది చెందింది. జిల్లాలోనే టమోట, పట్టు సాగులో పలమనేరు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. దీన్ని మిల్క్ సిటీగా కూడా పిలుస్తారు. చదవండి: అంతరిస్తున్న ఆదిమానవుడు -
కొసరు పేర్లతో సినీ అభ్యర్థులకు కోటి కష్టాలు!!
పేరులోనేముంది.. అంటారు. కానీ అంతా పేరులోనే ఉంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే వాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ అసలు పేరు, సినిమా పేరు వేర్వేరుగా ఉండి, అది రికార్డులలో మారకపోతే వాళ్ల తిప్పలు చెప్పనలవి కావు. పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో నిలబడిన ఇద్దరు సినీ నటులకు ఇప్పుడు ఇదే సమస్య వచ్చిపడింది. వాళ్ల అసలు పేర్లు వేరు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మార్చుకున్న పేర్లు వేరు. 'సిరివెన్నెల' చిత్రంతో తెలుగువారికి సుపరిచితురాలైన బెంగాలీ నటి మున్ మున్ సేన్ అసలు పేరు శ్రీమతి దేవ్ వర్మ. అయితే సినిమాల్లో మాత్రం ఆమెను అందరూ మున్ మున్ సేన్గానే గుర్తుపడతారు. అలాగే, మరో పాపులర్ బెంగాలీ హీరో దేవ్ అసలు పేరు దీపక్ అధికారి. వీళ్లిద్దరూ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉందిగానీ, ఈవీఎంలలో వాళ్ల అసలు పేర్లు కనపడతాయి తప్ప సినిమా పేర్లు కనపడవు. కేవలం ఎన్నికల గుర్తు ఆధారంగా మాత్రమే వాళ్లను గుర్తుపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఓటర్లలో గందరగోళం నెలకొంటుందని వాళ్లతో పాటు స్థానిక నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. తన తల్లి తనకు శ్రీమతి, మున్ మున్ అనే రెండు పేర్లూ పెట్టిందని, రికార్డులలో శ్రీమతి అని మాత్రమే ఉందని, దేవ్ వర్మను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీమతి దేవ్ వర్మ అయ్యిందని మున్ మున్ సేన్ (60) తెలిపారు. బంకురా స్థానంలోని ఓటర్లకు ఆమె పదే పదే ఈ విషయం చెబుతున్నారు. ఆమె కుమార్తెలు, సినీ నటులు అయిన రైమా, రియా ఇద్దరూ కూడా తన తల్లి అసలు పేరు గురించి ప్రచారంలో తెగ చెబుతున్నారు. అయితే ఓటర్లతో పాటు తమకు కూడా ఈ అసలు పేరు తెలిసి చాలా ఆశ్చర్యం కలిగిందని టీఎంసీ నాయకులు అంటున్నారు. కాగా, బంకురా నుంచి ఇప్పటికి తొమ్మిది సార్లు సీపీఎం తరఫున గెలిచిన వాసుదేవ్ ఆచార్యను మున్ మున్ సేన్ ఢీకొంటున్నారు. మరోవైపు బెంగాలీ సూపర్ స్టార్ దేవ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని తన సొంత ఊరు ఘాతల్ నుంచి పోటీ చేస్తున్న దేవ్.. తన అసలు పేరు అభిమానుల్లో కూడా చాలామందికి తెలియదని ఒప్పుకొంటున్నాడు. దీపక్ అధికారి అంటే అక్కడ ఎవరికీ తెలియదు. దాంతో వాళ్లను బతిమాలుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.