కొసరు పేర్లతో సినీ అభ్యర్థులకు కోటి కష్టాలు!!
పేరులోనేముంది.. అంటారు. కానీ అంతా పేరులోనే ఉంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే వాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ అసలు పేరు, సినిమా పేరు వేర్వేరుగా ఉండి, అది రికార్డులలో మారకపోతే వాళ్ల తిప్పలు చెప్పనలవి కావు. పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో నిలబడిన ఇద్దరు సినీ నటులకు ఇప్పుడు ఇదే సమస్య వచ్చిపడింది. వాళ్ల అసలు పేర్లు వేరు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మార్చుకున్న పేర్లు వేరు. 'సిరివెన్నెల' చిత్రంతో తెలుగువారికి సుపరిచితురాలైన బెంగాలీ నటి మున్ మున్ సేన్ అసలు పేరు శ్రీమతి దేవ్ వర్మ. అయితే సినిమాల్లో మాత్రం ఆమెను అందరూ మున్ మున్ సేన్గానే గుర్తుపడతారు. అలాగే, మరో పాపులర్ బెంగాలీ హీరో దేవ్ అసలు పేరు దీపక్ అధికారి. వీళ్లిద్దరూ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉందిగానీ, ఈవీఎంలలో వాళ్ల అసలు పేర్లు కనపడతాయి తప్ప సినిమా పేర్లు కనపడవు. కేవలం ఎన్నికల గుర్తు ఆధారంగా మాత్రమే వాళ్లను గుర్తుపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఓటర్లలో గందరగోళం నెలకొంటుందని వాళ్లతో పాటు స్థానిక నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. తన తల్లి తనకు శ్రీమతి, మున్ మున్ అనే రెండు పేర్లూ పెట్టిందని, రికార్డులలో శ్రీమతి అని మాత్రమే ఉందని, దేవ్ వర్మను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీమతి దేవ్ వర్మ అయ్యిందని మున్ మున్ సేన్ (60) తెలిపారు. బంకురా స్థానంలోని ఓటర్లకు ఆమె పదే పదే ఈ విషయం చెబుతున్నారు. ఆమె కుమార్తెలు, సినీ నటులు అయిన రైమా, రియా ఇద్దరూ కూడా తన తల్లి అసలు పేరు గురించి ప్రచారంలో తెగ చెబుతున్నారు. అయితే ఓటర్లతో పాటు తమకు కూడా ఈ అసలు పేరు తెలిసి చాలా ఆశ్చర్యం కలిగిందని టీఎంసీ నాయకులు అంటున్నారు. కాగా, బంకురా నుంచి ఇప్పటికి తొమ్మిది సార్లు సీపీఎం తరఫున గెలిచిన వాసుదేవ్ ఆచార్యను మున్ మున్ సేన్ ఢీకొంటున్నారు.
మరోవైపు బెంగాలీ సూపర్ స్టార్ దేవ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని తన సొంత ఊరు ఘాతల్ నుంచి పోటీ చేస్తున్న దేవ్.. తన అసలు పేరు అభిమానుల్లో కూడా చాలామందికి తెలియదని ఒప్పుకొంటున్నాడు. దీపక్ అధికారి అంటే అక్కడ ఎవరికీ తెలియదు. దాంతో వాళ్లను బతిమాలుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.