Moon Moon Sen
-
కొంత మంది నేతలకు ‘అజ్ఞానమే వరం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ‘వారి అజ్ఞానమే వారికి వరం’ అనుకుంటా! పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలివుడ్ నటుడు సన్నీడియోల్‌ను బాలకోట్లో భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తనకేమీ తెలియదని చెప్పారు. భారత్–పాక్ సంబంధాల గురించి ప్రశ్నించగా అది అంతకంటే తెలియదని అన్నారు. హరియాణలోని లాడ్వా నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడి తరఫున ప్రచారానికి వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధురి బీరేంద్ర సింగ్‌ను స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, విద్యుత్ సమస్యల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ‘నేనెవరో తెలుసా? కేంద్ర మంత్రిని, నన్ను పట్టుకొని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?’ అంటూ ఆయన విసుక్కున్నారు. మిగతా వారిలాగా ఆయన తనకు తెలియదంటూ సమాధానం ఇవ్వలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సినీ నటి జయప్రదను కొంత మంది రాజకీయ నాయకులు చేస్తున్న మహిళా విద్వేషక విమర్శల గురించి ప్రశ్నించగా తనకు తెలియదంటూ జయప్రద చెప్పడం ఆమె చుట్టూ చేరిన వారిని కూడా ఆశ్చర్యపరిచింది. ఆమెకు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేసన ఆజం ఖాన్ గురించి అప్పుడే మరచిపోయినట్లున్నారు. లేదంటే ముస్లిం ఓట్లు పోతాయని అలా సమాధానం ఇచ్చారా? అన్నది ఆమెకే తెలియాలి. ఇక తృణమూల్ ఎంపీ మూన్‌మూన్ సేన్‌ను, పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లో జరిగిన ఎన్నికల హింస గురించి అడగ్గా తనకేమి తెలియదని అన్నారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో వర్గం, తృణమూల్ కార్యకర్త మధ్య జరిగిన హింసాకాండలో ఆయన కారు ధ్వంసంకాగా, పలువురు గాయపడ్డారు. ఇది గెలవకుముందు అభ్యర్థుల పరిస్థితి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని వాటి ఫుల్ఫామ్లు అడుగుతుంటే తెలియదని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్న నాయకులూ ఉన్నారు. -
కొసరు పేర్లతో సినీ అభ్యర్థులకు కోటి కష్టాలు!!
పేరులోనేముంది.. అంటారు. కానీ అంతా పేరులోనే ఉంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే వాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ అసలు పేరు, సినిమా పేరు వేర్వేరుగా ఉండి, అది రికార్డులలో మారకపోతే వాళ్ల తిప్పలు చెప్పనలవి కావు. పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో నిలబడిన ఇద్దరు సినీ నటులకు ఇప్పుడు ఇదే సమస్య వచ్చిపడింది. వాళ్ల అసలు పేర్లు వేరు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మార్చుకున్న పేర్లు వేరు. 'సిరివెన్నెల' చిత్రంతో తెలుగువారికి సుపరిచితురాలైన బెంగాలీ నటి మున్ మున్ సేన్ అసలు పేరు శ్రీమతి దేవ్ వర్మ. అయితే సినిమాల్లో మాత్రం ఆమెను అందరూ మున్ మున్ సేన్గానే గుర్తుపడతారు. అలాగే, మరో పాపులర్ బెంగాలీ హీరో దేవ్ అసలు పేరు దీపక్ అధికారి. వీళ్లిద్దరూ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉందిగానీ, ఈవీఎంలలో వాళ్ల అసలు పేర్లు కనపడతాయి తప్ప సినిమా పేర్లు కనపడవు. కేవలం ఎన్నికల గుర్తు ఆధారంగా మాత్రమే వాళ్లను గుర్తుపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఓటర్లలో గందరగోళం నెలకొంటుందని వాళ్లతో పాటు స్థానిక నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. తన తల్లి తనకు శ్రీమతి, మున్ మున్ అనే రెండు పేర్లూ పెట్టిందని, రికార్డులలో శ్రీమతి అని మాత్రమే ఉందని, దేవ్ వర్మను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీమతి దేవ్ వర్మ అయ్యిందని మున్ మున్ సేన్ (60) తెలిపారు. బంకురా స్థానంలోని ఓటర్లకు ఆమె పదే పదే ఈ విషయం చెబుతున్నారు. ఆమె కుమార్తెలు, సినీ నటులు అయిన రైమా, రియా ఇద్దరూ కూడా తన తల్లి అసలు పేరు గురించి ప్రచారంలో తెగ చెబుతున్నారు. అయితే ఓటర్లతో పాటు తమకు కూడా ఈ అసలు పేరు తెలిసి చాలా ఆశ్చర్యం కలిగిందని టీఎంసీ నాయకులు అంటున్నారు. కాగా, బంకురా నుంచి ఇప్పటికి తొమ్మిది సార్లు సీపీఎం తరఫున గెలిచిన వాసుదేవ్ ఆచార్యను మున్ మున్ సేన్ ఢీకొంటున్నారు. మరోవైపు బెంగాలీ సూపర్ స్టార్ దేవ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని తన సొంత ఊరు ఘాతల్ నుంచి పోటీ చేస్తున్న దేవ్.. తన అసలు పేరు అభిమానుల్లో కూడా చాలామందికి తెలియదని ఒప్పుకొంటున్నాడు. దీపక్ అధికారి అంటే అక్కడ ఎవరికీ తెలియదు. దాంతో వాళ్లను బతిమాలుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. -
ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
-
ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
కోల్‌కతా : ప్రఖ్యాత బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ (82) శుక్రవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్)తో బాధపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి సేన్ కోల్‌కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో వైద్యులు చికిత్స అందించారు. అప్పటి నుంచి సేన్ వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారు. కుమార్తె మూన్‌మూన్ సేన్, మనవరాళ్లు రియా, రైమా ఆస్పత్రిలో ఉంటూ ఆమెను చూసుకుంటున్నారు. 1952లో ‘శేష్ కొతాయ్’తో నట జీవితాన్ని ప్రారంభించిన సుచిత్రా సేన్ 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అందచందాలతో అద్భుతమైన నటనతో ఒకప్పుడు బెంగాలీ చిత్రసీమను ఏలిన సుచిత్రా సేన్ 1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1970లో నటనకు గుడ్‌బై చెప్పిన సుచిత్రా సేన్ అప్పటినుంచి...అభిమానులకు దూరంగా వుంటున్నారు. బొంబయి కా బాబు, మమతా, దేవదాస్, ఆంధీలాంటి హిందీ చిత్రాలతోపాటు దేవదాసు బెంగాలీ చిత్రంలో ఆమె నటనకు అప్పట్లో అభిమానులు జేజేలు పలికారు. 1978 లో ఆమె ప్రణయ్ బాషా అనే బెంగాలీ చిత్రంలో చివరిసారిగా నటించారు. దేవదాసు చిత్రంలో నటనకుగానూ ఆమో ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. హిందీలో ఆమె ఇందిరాగాంధీ జీవిత కథను పోలిన ‘ఆంధీ’ అనే చిత్రంలో నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు పొందిన తొలి బెంగాలీ నటి కూడా ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు లభించింది. కోల్‌కతా ప్రభుత్వం ఆమెను ‘వంగ విభేషణ్’ అవార్డుతో సత్కరించింది. -
ప్రముఖ నటి సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమం!
ప్రముఖ నటి, మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో చికిత్సనందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సేన్ కు వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందిస్తున్నామన్నారు. సేన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో మూన్ మూన్ సేన్ సూచనతో వెంటిలేటర్ పై ఉంచామని కోల్ కతాలోని బెల్లే వ్యూ క్లినిక్ వైద్యులు తెలిపారు. చాతి సంబంధిత వ్యాదితో బాధపడుతున్న సుచిత్రా సేన్ డిసెంబర్ 23 తేదిన ఆస్పత్రిలో చేరారు. హార్ట్ బీట్ తగ్గిపోవడంతో ఆదివారం రాత్రి ఆమెను సీసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.