పైసలిస్తే ఓకే
సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాల్సిన ఆ కార్యాలయం ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నట్లుగా చేతులు తడిపితే ఎలాంటి పనులైనా చకచకా జరిగిపోతుంటాయి. ఉద్యోగుల సీటు మారాలన్నా పైసలు లేనిదే ఫైల్ కదలడం లేదు. మొత్తంమీద అక్రమ కార్యకలాపాలకు జిల్లా పరిషత్ వేదికగా మారుతోంది. అవకాశం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చర్యలు జిల్లా పరిషత్‌లో ఇటీవల తీవ్రతరం అయ్యాయి.
ప్రతిపనికి ఓ రేటును నిర్ణయించి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలా విచ్చలవిడిగా జరుగుతుండటంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఒక రికార్డు అసిస్టెంట్‌కు పదేళ్ల క్రితం టైపిస్టుగా ప్రమోషన్ లభించింది. అప్పట్లో కారణాలు ఏమైనప్పటికీ తనకు ప్రమోషన్ వద్దని భవిష్యత్‌లో కూడా తీసుకోనని రాతపూర్వకంగా విన్నవించారు. అతని సర్వీసు రిజిష్టర్‌లో సైతం ఆ విషయం పొందుపర్చారు.
అయితే ఇటీవల సదరు వ్యక్తి కొన్ని కారణాల వల్ల ప్రమోషన్ తిరస్కరించానని, ప్రస్తుతం తనకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని పరిశీలించాల్సిందిగా కోర్టు కోరింది. దీంతో సదరు వ్యక్తికి టైపిస్టుగా ప్రమోషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈతతంగం నిబంధనలకు విరుద్ధమని ఓ సీనియర్ అసిస్టెంట్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లుతెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారి ఒకరు స్వయంగా కల్పించుకుని ప్రమోషన్ ఉత్తర్వులకు చెందిన సిఫార్సులను తయారు చేయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుమారు రూ.1.5లక్షలు చేతులు మారినట్లు జెడ్పీ ఉద్యోగ వర్గాలు కోడైకూస్తున్నాయి.
మైనస్ గ్రాంట్‌లో కూడా
పనులు కేటాయింపు...
జెడ్పీ జనరల్ ఫండ్ ఇప్పటికే రూ.40లక్షలు మైనస్‌లో ఉంది. అయితే అక్కడ పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సంప్రదిస్తే మైనస్ గ్రాంట్‌లో కూడా పనులు అప్పగిస్తున్నారు. జిల్లా పరిషత్ నుంచి గాలివీడుకు అక్కడి నుంచి మళ్లీ జిల్లా పరిషత్‌కు, తదుపరి కీలక సీటుకు ఇటీవలే మారిన ఆసీనియర్ అసిస్టెంట్ ఉన్నతాధికారికి అంతరంగికుడుగా మారినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఎలాంటి పని కావాలన్నా ఆసీనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించి తదనుగుణంగా వ్యవహరిస్తే అన్ని పనులు చక్కబడుతున్నట్లు సమాచారం. జెడ్పీ క్వార్టర్స్‌ను సైతం ఓమహిళామండలికి కేటాయించే పనిలో ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇటువంటి విషయాలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.