అమ్మ ‘అమరనాథా’.. మాజీ మంత్రి ప్రాపకంలోనే ‘పుష్ప’రాజులు
ఎల్లో గ్యాంగ్ ... అదేనండి ‘పచ్చ’ నేతలు.. ఇంకా చెప్పాలంటే వాస్తవాలను తొక్కిపెట్టి విష ప్రచారం చేసే టీడీపీ నాయకులు... అందుకు వత్తాసు పలికే మీడియాలు తిమ్మని బమ్మిని చేసి... తప్పుడు ప్రచారాలకు పాల్పడే టీడీపీ నేతలు కొంతకాలంగా పెద్దాయన, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పట్టుబడిన ఎర్రచందనం కేసు నిందితుల్లో ఏ-4 అభినవ్... మంత్రి పెద్దిరెడ్డితో దిగిన ఫొటోను ప్రచురించి తమదైనశైలిలో విషపు బుద్ధిని బయట పెట్టుకున్నారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ-4 అభినవ్ మాత్రమే కాదు ఆ కేసులోని ఏ–3 అనిల్ కుడా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమరనాథరెడ్డి శిష్యులుగా తేలింది. ఆయనతో నిందితులిద్దరూ దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పూర్వపరాలిలా ఉన్నాయి.
చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండల సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని బేటనూరు వద్ద ఇటీవల ఆ రాష్ట్ర పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు యువకులను పట్టుకున్నారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అనుమానం రాకుండా ఖరీదైన కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.50 లక్షల విలువైన దుంగలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పట్టుబడిన వారిలో ఏ–4గా ఉన్న అభినవ్‌ది బైరెడ్డిపల్లి మండలం, గొల్లచీమనపల్లి గ్రామం. ఇతను ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యునిగా ఉన్నాడు. కొన్నాళ్లు వైఎస్సార్సీపీలో తిరిగినప్పటికీ అతని చెడు ప్రవర్తన ముందే పసిగట్టిన జిల్లా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాస్తవానికి అతను ముందు నుంచీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి శిష్యుడిగానే పేరొందాడు. టీడీపీ నేతలతోనే సన్నిహితంగా మెలిగేవాడు. గతంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి గొల్లచీమనపల్లిలోని అభినవ్ ఇంటికి సైతం వెళ్లినట్టు టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు.
ముందుగానే సోషల్ మీడియాలో పోస్టింగులు
గుమ్మడికాయల దొంగ ఎవరంటే ముందుగానే భుజాలు తడుముకున్నట్టు మాజీ మంత్రి అమరనాథరెడ్డి అభినవ్ వైఎస్సార్సీపీ నాయకులతో ఉన్న ఫొటోలను సంఘటన జరిగిన వెంటనే తన ఫేస్బుక్లో అప్డేట్ చేశారు. ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డ నిందితులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి దీనివెనుక ఎవరున్నారని కూడా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఈ నెపాన్ని అధికారపార్టీ మీదకు నెట్టేందుకు వైఎస్సార్సీపీ నాయకులతో అభినవ్ దిగిన ఫొటోలను పోస్టింగులు చేశారు. అభినవ్‌కు తనతో సంబంధాలున్నాయని తెలిసిపోతుందనే భయంతోనే ఇలా చేసి దీన్ని కూడా రాజకీయలబ్ధి కోసం వాడుకునేందుకు ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.
ఇటీవలే అమరనాథరెడ్డిని కలిసిన ఏ–3 అనిల్
ఇక ఇదే కేసులో ఏ–3గా ఉన్న అనిల్‌కుమార్‌ది పలమనేరు పట్టణంలోని బజారువీధి. ఇతను మూడేళ్లుగా బెంగళూరుకు చెందిన గణేష్ యాదవ్ అనే వ్యక్తి వద్ద వ్యక్తిగత సహాయకునిగా ఉంటున్నాడు. అయన స్థానికంగా చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో కీలకంగా ఉంటున్నాడు. తాజాగా కర్ణాటక పోలీసులకు చిక్కకముందు కూడా అనిల్‌కుమార్ మాజీ మంత్రి అమరనాథరెడ్డి స్వగృహంలో కలసి ఆయన్ను ఓ శుభకార్యక్రమానికి ఆహా్వనించాడు. ఇవన్నీ చూస్తుంటే ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ నిందితులు మాజీ మంత్రికి బాగా పరిచయస్తులేననే విషయం స్పష్టమవుతోంది.
వారం ముందే అభినవ్ని సస్పెండ్ చేశాం
ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ఎంపీటీసీ అభినవ్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా సదరు ఎంపీటీసీపై ఆరోపణలు రావడంతో విచారించిన నేపథ్యంలో అనుమానాలు తలెత్తాయని, సంజాయిషీ ఇవ్వాలని నోటీసు జారీచేశామని వివరించారు. కానీ అతను స్పందించకపోవడంతో ఏప్రిల్ 23న అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు అతనితో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు కూడా అందించామని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజూ వందల సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫొటోలు దిగుతారని, దానిని పట్టుకుని ఎల్లో మీడియా, టీడీపీ విష ప్రచారాలు చేయడం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.