red sandalwood smuggling case
-
‘ఎర్రచందనం’ ప్రత్యేక న్యాయస్థానం భవనాల ప్రారంభం
తిరుపతి లీగల్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం ప్రారంభించనున్నారు. ఎర్రచందనం కేసుల్లో నిందితులకు రిమాండ్, 2016 సంవత్సరానికి ముందు నమోదైన కేసుల విచారణకు ఓ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టును రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో నమోదైన ఎర్రచందనం కేసులను విచారించేందుకు రాష్ట్ర హైకోర్టు ఇటీవల జడ్జి నాగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జూనియర్ సివిల్‌జడ్జి కోర్టుకు తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్‌ను ఇన్చార్జిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ ఎన్.సత్యనారాయణమూర్తి కార్యక్రమంలో పాల్గొంటారు. -
ఘటనా స్థలంలో లేనంత మాత్రాన..
సాక్షి, అమరావతి: నిందితుడు ఘటనా స్థలంలో లేనంత మాత్రాన అతడు నేర బాధ్యత నుంచి తప్పించుకోజాలడని హైకోర్టు స్పష్టం చేసింది. ఘటనా స్థలంలో లేరన్న కారణంతో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఎర్ర చందనం అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితునికి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాలివీ.. శ్రీసిటీ ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ ట్రాక్టర్ నుంచి ఎర్ర చందనం దుంగల్ని దిగుమతి చేస్తున్న ఆరుగురు వ్యక్తులు పోలీసుల్ని చూసి వాళ్లపై రాళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు ఎర్ర చందనం దుంగల్ని జప్తు చేసి వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఎర్ర చందనం దుంగలు చిత్తూరు జిల్లా మతేరిమిట్ట గ్రామానికి చెందిన కె.శిబి చక్రవర్తికి చెందినవని, తాము ట్రాక్టర్లో వాటిని తెస్తుంటే శిబి చక్రవర్తి మోటార్ బైక్‌పై వెళుతూ వాటిని దించాల్సిన చోటు చూపించాడని చెప్పారు. ఎక్కడ దించాలో చూపి శిబి చక్రవర్తి వెళ్లిపోయారని వివరించారు. దీంతో పోలీసులు శిబి చక్రవర్తిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శిబి చక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అతడు ఘటనా స్థలంలో లేడని, మిగిలిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పిటిషనర్‌ను నిందితునిగా చేర్చారన్నారు. పోలీసులు కావాలనే ఈ కేసులో అతడిని ఇరికించారన్నారు. ఈ వాదనల్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు. ఎర్ర చందనం దుంగలు రవాణా చేస్తున్న ట్రాక్టర్ పిటిషనర్దేనని తెలిపారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో అతడే ప్రధాన వ్యక్తి అని, ఘటనా స్థలంలో లేడన్న కారణంతో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ రాయ్ నిందితుడికి బెయిల్ నిరాకరించారు. -
'ఎర్ర' ఉచ్చులో ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్
► ఆరుగురిని అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ జిల్లా పోలీసులు ► తమిళ కూలీలు, మేస్త్రీలతో సత్సంబంధాలు ► ఇప్పటికే ముగ్గురి అరెస్ట్ కావలి : ఎర్రచందనం నరికే తమిళ కూలీలు, మేస్త్రీలతో కావలి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ల బంధంలో మరి కొందరి పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన వైఎస్సార్ జిల్లా పోలీసులు.. సోమవారం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కావలికి వచ్చే బస్సుల్లో ఎర్ర చందనం చెట్లు నరికే తమిళ కూలీలను వైఎస్సార్ జిల్లా అడవుల్లో దించారని, అందుకు ఈ కూలీల మేస్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఒక్కొ కూలీ వద్ద టికెట్ ఛార్జీ కన్నా అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు తీసుకున్నట్లు పోలీసుల అభియోగం. ఇప్పటికే ముగ్గురు డ్రైవర్లను గత నెల 24న అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వీరిచ్చిన సమాచారంతో పాటు పోలీసులు దగ్గరున్న సమాచారంతో తాజాగా ఆదివారం షేక్ మాబు సుభాని (టంగుటూరు ప్రకాశం జిల్లా), ఎన్. మాలకొండారెడ్డి (కుమ్మరకొండూరు కలిగిరి మం డలం), పి.ప్రభాకర్ (జలదంకి), ఎస్.వెంకటేశ్వర్లు (నెల్లూరు) కడప పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లగా, సోమవారం ఎస్.సురేష్ (సింగరాయకొండ ప్రకాశం జిల్లా), సుధాకర్ (కుమ్మరకొండూరు కలిగిరి మండలం)ను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన బాటలో కార్మికులు ఈ పరిణామాలపై ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేయ డానికి రంగంలోకి దిగాయి. తొలుత ముగ్గురు డ్రైవర్లను తీసుకెళ్లిన కడప పోలీసులను ఆర్టీసీ అధికారులు కారణాలు అడిగినా చెప్పలేదు. అరెస్ట్ చూపిన తర్వాత కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి కూడా పోలీసులు ఇష్టపడలేదు. ఇదిలా ఉండగానే మరో ఆరుగురు డ్రైవర్లను పోలీసులు తీసుకెళ్లడంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్మిక సంఘాలకు ఏమి చెప్పాలో అధికారులకు అర్థంకాక, వారితో సామరస్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే కార్మిక సంఘాల నాయకులతో డిపో మేనేజర్ వై.సుష్మ సమావేశమై సమీక్షించారు. ఆందోళనకు సిద్ధమవుతామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో డ్రైవర్లు తప్పు చేయకపోతే అన్ని రకాలుగా అండగా ఉంటామని డిపో మేనేజర్ కార్మిక నాయకులకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో డ్రైవర్ మాబు సుభాని తల్లి రాజాబీ డీఎంను కలిసి నా బిడ్డ ఏమయ్యాడని బోరున విలపించింది. అనంతరం మూడు సంఘాల నాయకులు, కార్మికులు డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎన్ఎంయూ కావలి డిపో కార్యదర్శి ఎస్కేఎం మస్తాన్, అధ్యక్షుడు నాగరాజరావు, ఈయూ కార్యదర్శి విజయబాబు, అధ్యక్షుడు వి.ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి ప్రసాద్, అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సింగిల్ డ్రైవర్లే టార్గెట్ కావలి డిపో నుంచి బెంగళూరుకు బద్వేల్ మీదగా నాలుగు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. వాటిలో రెండు బస్సులకు సింగిల్ డ్రైవర్లు డ్యూటీ చేస్తున్నారు. మరో రెండు బస్సులకు ఇద్దరు డ్రైవర్లు డ్యూటీలో ఉంటారు. కడప పోలీసులు సింగిల్ డ్రైవర్లు డ్యూటీ చేసే వారినే టార్గెట్ చేయడం గమనార్హం. సింగిల్ డ్రైవర్లుగా డ్యూటీ చేసేవారు ఈ రూట్లో 14 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికి ముగ్గురు డ్రైవర్లను అరెస్ట్ చేయగా, తాజాగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండి వి«ధులకు హాజరుకావడం లేదు. మిగిలిన నలుగురు మాత్రం డ్యూటీలోనే ఉన్నారు. డ్రైవర్లను కడప పోలీసులు పంచుకుని విచారణ ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీసులతో నియమించిన ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. అయితే ఇప్పటికే ఎర్ర చందనం తరలింపుపై కేసులు నమోదైన మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట పోలీసులు ఆరుగురు డ్రైవర్లను పంచుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. -
‘ఎర్ర’ కలకలం
⇒ ఎర్రచందనం కేసులో రావల్కోల్ వాసి మాధవరెడ్డి అరెస్టు ⇒ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన ⇒ తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు ⇒ రూ.100 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు మేడ్చల్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడైన మేడ్చల్ మండలం రావల్‌కోల్‌కు చెందిన గూడూరు మాధవరెడ్డి పోలీసులను శుక్రవారం అరెస్టు చేయడం జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం కేసులో మాధవరెడ్డి నిందితుడు. రూ.100 కోట్ల విలువైన దాదాపు 80 టన్నుల ఎర్రచందనాన్ని మాధవరెడ్డి స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం తెల్లవారుజూమున రావల్‌కోల్‌లోని ఆయన ఇంటిపై ఆ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ సీతారామయ్య, ఆత్మకూరు సీఐ ఖాజావలీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. మాధవరెడ్డిని, ఆయన కుమారుడు ప్రదీప్‌రెడ్డిని, టెంపో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాధవరెడ్డి అరెస్టు విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి చెప్పారు. మాధవరెడ్డి ఎక్కడికెళ్లాడు.. గురువారం రాత్రి అసలేం జరిగిందనే విషయాన్ని ఆయన భార్య విజయలక్ష్మిని విచారించగా.. తనకు ఛాతిలో నొప్పిగా ఉందని, ఏమీ మాట్లాడలేనని చెప్పినట్లు సీఐ తెలిపారు. నేరచరిత్ర గల మాధవరెడ్డి.. మాధవరెడ్డి మేడ్చల్ మండలంలో ఆది నుంచీ వివాదాస్పద వ్యక్తి. ఎవరిపై పడితే వారిపై చేయిచేసుకోవడం, దురుసుగా మాట్లాడటం ఆయన స్వభావం. దీంతో పదేళ్ల క్రితం మేడ్చల్ పోలీసులు ఆయనను రౌడీషీటర్‌గా నమోదు చేశారు. ఓ మహిళ కేసులో, మద్యం అక్రమ రవాణా విషయంలో జిల్లాలోని తాండూరు, చేవెళ్ల పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఏడేళ్ల క్రితం మాధవరెడ్డిని అరెస్ట్ చేయడానికి రావల్కోల్ గ్రామానికి వచ్చిన చేవెళ్ల పోలీసులను ఆయనతోపాటు కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేసి గాయపర్చారు. ఇటీవల ఆయన కాంగ్రెస్‌లో చురుకైన నాయకుడిగా ఎదిగాడు. చిల్లర కేసుల్లో ఉండే మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలియడంతో స్థానికులు విస్తుపోతున్నారు. కొన్నాళ్లుగా మాధవరెడ్డిపై నిఘా శేషాచలం అడువుల నుంచి దుంగలను హైదరాబాద్ శివార్లలో డంపుచేసి అక్కడి నుంచి సాధారణ కలపగా చూపి గుజరాత్, ముంబాయికి తరలించి పోర్టుల ద్వారా ఇతర దేశాలకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్‌పై దృష్టిసారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాధవరెడ్డి కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో దాడిచేసి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు బురిడీ.. శంషాబాద్‌లో గురువారం జరిగిన తన తమ్ముడి కుమారుడి వివాహం జరగ్గా దానికి హాజరై వస్తున్న మాధవరెడ్డిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలివిగా వ్యవహరించిన మాధవరెడ్డి.. తలను కారుకు కొట్టుకుని అరవడంతో పలువురు జమయ్యారు. దీంతో పోలీసులు నిందితుడికి విషయం తెలిస్తే ఇకముందు కూడా దొరకడని భావించి వదిలేసి వెళ్లారు. కాగా తనపై దుండగులు దాడి చేసి గాయపర్చారని మాధవరెడ్డి అదే రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని, మాధవరెడ్డికి ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపారు. గురువారం రాత్రి మాధవరెడ్డి సృష్టించిన వీరంగంపై కడప జిల్లా పోలీసులు శుక్రవారం ఉదయం మేడ్చల్ పోలీసులకు సమాచారమందించారు. మాధవరెడ్డి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నిందితుడని.. ఆయనపై కేసు నమోదు చేయాలని చెప్పడంతో మేడ్చల్ పోలీసులు అవాక్కయ్యారు. రాత్రంతా హంగామా చేసిన వ్యక్తి స్మగ్లింగ్ కేసులో నిందుతుడా..? అంటూ మేడ్చల్ పోలీసులు బిత్తరపోయారు. మాధవరెడ్డిపై కేసు నమోదు చేశారు.