'ఎర్ర' ఉచ్చులో ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్
► ఆరుగురిని అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ జిల్లా పోలీసులు
► తమిళ కూలీలు, మేస్త్రీలతో సత్సంబంధాలు
► ఇప్పటికే ముగ్గురి అరెస్ట్
కావలి : ఎర్రచందనం నరికే తమిళ కూలీలు, మేస్త్రీలతో కావలి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ల బంధంలో మరి కొందరి పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన వైఎస్సార్ జిల్లా పోలీసులు.. సోమవారం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కావలికి వచ్చే బస్సుల్లో ఎర్ర చందనం చెట్లు నరికే తమిళ కూలీలను వైఎస్సార్ జిల్లా అడవుల్లో దించారని, అందుకు ఈ కూలీల మేస్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఒక్కొ కూలీ వద్ద టికెట్ ఛార్జీ కన్నా అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు తీసుకున్నట్లు పోలీసుల అభియోగం.
ఇప్పటికే ముగ్గురు డ్రైవర్లను గత నెల 24న అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వీరిచ్చిన సమాచారంతో పాటు పోలీసులు దగ్గరున్న సమాచారంతో తాజాగా ఆదివారం షేక్ మాబు సుభాని (టంగుటూరు ప్రకాశం జిల్లా), ఎన్. మాలకొండారెడ్డి (కుమ్మరకొండూరు కలిగిరి మం డలం), పి.ప్రభాకర్ (జలదంకి), ఎస్.వెంకటేశ్వర్లు (నెల్లూరు) కడప పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లగా, సోమవారం ఎస్.సురేష్ (సింగరాయకొండ ప్రకాశం జిల్లా), సుధాకర్ (కుమ్మరకొండూరు కలిగిరి మండలం)ను అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళన బాటలో కార్మికులు
ఈ పరిణామాలపై ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేయ డానికి రంగంలోకి దిగాయి. తొలుత ముగ్గురు డ్రైవర్లను తీసుకెళ్లిన కడప పోలీసులను ఆర్టీసీ అధికారులు కారణాలు అడిగినా చెప్పలేదు. అరెస్ట్ చూపిన తర్వాత కూడా కనీసం ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వడానికి కూడా పోలీసులు ఇష్టపడలేదు. ఇదిలా ఉండగానే మరో ఆరుగురు డ్రైవర్లను పోలీసులు తీసుకెళ్లడంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్మిక సంఘాలకు ఏమి చెప్పాలో అధికారులకు అర్థంకాక, వారితో సామరస్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.
అందులో భాగంగానే కార్మిక సంఘాల నాయకులతో డిపో మేనేజర్ వై.సుష్మ సమావేశమై సమీక్షించారు. ఆందోళనకు సిద్ధమవుతామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో డ్రైవర్లు తప్పు చేయకపోతే అన్ని రకాలుగా అండగా ఉంటామని డిపో మేనేజర్ కార్మిక నాయకులకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో డ్రైవర్ మాబు సుభాని తల్లి రాజాబీ డీఎంను కలిసి నా బిడ్డ ఏమయ్యాడని బోరున విలపించింది. అనంతరం మూడు సంఘాల నాయకులు, కార్మికులు డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎన్‌ఎంయూ కావలి డిపో కార్యదర్శి ఎస్‌కేఎం మస్తాన్, అధ్యక్షుడు నాగరాజరావు, ఈయూ కార్యదర్శి విజయబాబు, అధ్యక్షుడు వి.ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి ప్రసాద్, అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సింగిల్ డ్రైవర్లే టార్గెట్
కావలి డిపో నుంచి బెంగళూరుకు బద్వేల్ మీదగా నాలుగు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. వాటిలో రెండు బస్సులకు సింగిల్ డ్రైవర్లు డ్యూటీ చేస్తున్నారు. మరో రెండు బస్సులకు ఇద్దరు డ్రైవర్లు డ్యూటీలో ఉంటారు. కడప పోలీసులు సింగిల్ డ్రైవర్లు డ్యూటీ చేసే వారినే టార్గెట్ చేయడం గమనార్హం. సింగిల్ డ్రైవర్లుగా డ్యూటీ చేసేవారు ఈ రూట్‌లో 14 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికి ముగ్గురు డ్రైవర్లను అరెస్ట్ చేయగా, తాజాగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండి వి«ధులకు హాజరుకావడం లేదు. మిగిలిన నలుగురు మాత్రం డ్యూటీలోనే ఉన్నారు.
డ్రైవర్లను కడప పోలీసులు పంచుకుని విచారణ
ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీసులతో నియమించిన ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. అయితే ఇప్పటికే ఎర్ర చందనం తరలింపుపై కేసులు నమోదైన మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట పోలీసులు ఆరుగురు డ్రైవర్లను పంచుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.