ఇళ్లపై నల్లజెండాలతో నిరసన
- పుష్కరాల నిధులు కేటాయించలేదని ఆగ్రహం
పగిడ్యాల
కర్నూలు జిల్ల పగిడ్యాల మండలం పాతముత్తుమర్రి, కొత్తముత్తుమర్రి, కొత్త ఎల్చాల, పడమర వనములపాడు గ్రామస్థులు కృష్ణా నది పుష్కరాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా నదీ తీర ప్రాంతంలోని తమ గ్రామాలకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వారు సోమవారం నల్లజెండాలతో నిరసన తెలిపారు.
గ్రామంలోని ప్రతీ ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. విద్యుత్ స్తంభాలకు, చెట్లకు కూడా నల్లజెండాలను కట్టారు. నంది కొట్కూరు నియోజకవర్గం పరిధిలో కృష్ణా నది పుష్కరాల సందర్భంగా రోడ్లు, ఆలయాల అభివృద్ధి ఇతర పనులకు ప్రభుత్వం రూ.60కోట్లు కేటాయించగా, అందులో రూ.7 కోట్లు పగిడ్యాల మండలానికి కేటాయించారు.
తమ గ్రామాలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహానికి దారి తీసింది. దీంతో రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరైడ్డి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ గ్రామాల్లో దేవాలయాలు లేవా? అని వారు ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.