‘ఎర్ర’ స్మగ్లర్ల తెలివి తేటలు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు మారు వేషాలు వేస్తుంటే.. స్మగ్లర్లు తప్పించుకోవడానికి విభిన్న ఆలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఎర్రచందనం దుంగలు తీసుకెళ్లే లారీలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లారీ లోపల టమాట, ఇతర కూరగాయలు పెట్టుకోవడానికి కమ్మీలు పెట్టి మధ్యలో ఎర్రచందనం దుంగలను ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు.
ఇదే లారీల్లో స్మగ్లర్లు టమాట బుట్టల వెనుకవైపు కూర్చుని పోలీసులు తనిఖీలు చేస్తే తప్పించుకోవడానికి ప్రత్యేకంగా ఓ అత్యవసర దారిని సైతం తయారు చేయించుకుంటున్నారు. పోలీసులు లారీని తనిఖీ చేసేలోపు స్మగ్లర్లు బాడీ కింద ఉన్న అత్యవసర తలుపును తీసి కిందకు దిగి తప్పించుకుంటున్నారు. తాజాగా అనంతపురంలో చిత్తూరు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ రెడ్లో స్వాధీనం చేసుకున్న లారీని ఇదే తరహాలో తయారుచేయించడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.