శాఖగా కళాశాల, సాంకేతిక విద్య
హైదరాబాద్: కళాశాల విద్య, సాంకేతిక విద్య శాఖలను విలీనం చేసి, ఒకే విభాగంగా కొనసాగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, సంస్కరణల కమిటీ చైర్మన్ వీకే అగర్వాల్ వద్ద విద్యా శాఖ విభజన సమావేశం శుక్రవారం జరిగింది. విద్యాశాఖలో అధికారులు, సిబ్బంది విభజనపైనా సమీక్షించారు. కళాశాల, సాంకేతిక విద్య లేదా సాంకేతిక, కళాశాల విద్య శాఖలుగా ఇవి రెండు రాష్ట్రాల్లో కొనసాగనున్నాయి. అలాగే రాజీవ్ విద్యా మిషన్, పాఠశాల విద్యా శాఖలను విభజించేందుకు కసరత్తు జరుగుతోంది. వాటి విభజన తరువాత వేర్వేరు రాష్ట్రాల్లో రెండు శాఖలు ఒకే ఐఏఎస్ అధికారి పాలనలో కొనసాగనున్నాయి.
ఒకవేళ ఇంటర్మీడియెట్ కమిషనరేట్, ఇంటర్మీడియెట్ బోర్డును విభజిస్తే ఇవి రెండూ ఒక అధికారి పరిధిలో ఉండనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే విధానం కొనసాగనుంది. అయితే ఇంటర్మీడియెట్ బోర్డు పదో షెడ్యూలులో ఉండగా, ఇంటర్ విద్య కమిషనరేట్ అందులో లేదు. అయితే ఇంటర్మీడియెట్ బోర్డును ఇప్పుడే విభజిస్తారా? ఏడాది తరువాత రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకున్నాకే తుది నిర్ణయం ఉంటుందా? అనేది ఇంకా తేలలేదు. కొత్త పోస్టుల అవసరం లేకుండా, ఉన్న పోస్టులనే రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తూ విభజించాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోస్టుల కేడర్లో ఒక స్థాయి తగ్గించడం లేదా పెంచడం వంటి చర్యలతో రెండు రాష్ట్రాలకు 13:10 నిష్పత్తిలో సర్దుబాటు చేయాలనే అంశంపైనే చర్చ జరిగినట్లు తెలిసింది.