బార్ కౌన్సిల్ విభజనపై వైఖరేమిటి?
రాష్ట్ర బార్ కౌన్సిల్, రిజిస్ట్రార్ జనరల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: రెండు రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను కూడా రెండుగా విభజించడంపై తమ వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు బార్ కౌన్సిల్‌ను, హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసేలా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది సీహెచ్. వెంకట నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం విచారించారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్వర్తించాల్సిన విధులను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిలే నిర్వర్తిస్తుందంటూ ఈ నెల 21న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొసీడింగ్స్ జారీ చేసిందని, ఇలాంటి ప్రొసీడింగ్స్ జారీ చేసే పరిధి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదని పిటిషనర్ తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై వైఖరి ఏమిటో తెలియచేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.