registration documents
-
ఒక్క రూపాయికే పక్కా ఇల్లు
మాటే మంత్రంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్రాభివృద్ధే ఆశయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారు. ఒకే ఒక్క రూపాయికి లక్షలాది రూపాయలు విలువచేసే పక్కా ఇంటిని పేదలకు అందించే బృహత్తర కార్యక్రమానికి విజయనగరంలోని సారిపల్లి వేదికగా మారింది. సకల సదుపాయాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లను మంత్రులు ప్రారంభించి లబ్ధిదారులకు గురువారం అప్పగించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ పత్రాలను చేతికి అందిస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ సాకారమవుతోంది. విజయనగరానికి సమీపంలోని సారిపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సిద్ధమైంది. 800 ఇళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ గురువారం ప్రారంభించనున్నారు. ఆయా లబ్ధిదారులకు ఇంటిపత్రాలను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. విద్యుత్‌దీపాల కాంతులతో కాలనీలోని ఇళ్లు జిగేల్మంటున్నాయి. అందంగా.. విశాలంగా.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్యయంతో 2,656 ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఏ–కేటగిరిలో 300 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంతో 1,536 ఇళ్లు, బి–కేటగిరీలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి–కేటగిరీలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో 928 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమైన 800 ఇళ్లను లబ్ధిదారులకు గురువారం మంత్రుల చేతుల మీదుగా అందించడానికి ఏపీ టిడ్కో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల ఆస్తి ఒక్క రూపాయికే... రాష్ట్ర ప్రభుత్వం ఏ–కేటగిరి కింద ఒక్కో ఇంటిని రూ.6.55 లక్షల వ్యయంతో నిర్మింస్తోంది. ఆ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తోంది. మిగతా రూ.5.05 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంమీద లబ్ధిదారులకు మాత్రం కేవలం ఒక్క రూపాయికే రూ.6.55 లక్షల విలువగల ఇంటిని అందజేస్తోంది. సి–కేటగిరీ కింద నిర్మించే 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల డబుల్ బెడ్రూం ఇళ్లకు ఒక్కోదానికి రూ.8.55 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షలు సమకూర్చుతోంది. లబ్ధిదారు తన వాటా కింద రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కింద రూ.3.65 లక్షలను అధికారులు సమకూరుస్తున్నారు. రూ.41 కోట్లతో మౌలిక సదుపాయాలు... సారిపల్లిలోని జగనన్న టిడ్కో కాలనీ లేఅవుట్లో లబ్ధిదారుల ఇళ్లకు సామాజిక, మౌలిక వసతులు కల్పించేందుకు రూ.41.02 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తాగునీటి సరఫరా కోసం రూ.8.93 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.61 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.3.97 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి రూ.4.92 కోట్లు, కాలనీ చుట్టూ రిటైనింగ్ వాల్ కోసం రూ.11.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే, విజయనగరం శివారు సోనియానగర్‌లో 1120 ఇళ్లు, నెల్లిమర్లలో 570, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 మొత్తం 3,712 ప్లాట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తిచేసి వచ్చే డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో చక్కని వసతులు... ఇళ్లలో పూర్తిగా టైల్స్‌తో కూడిన గచ్చు ఏర్పాటు చేశారు. బెడ్ రూమ్, లివింగ్ రూమ్ ఆకట్టుకునేలా రూపొందించారు. గ్రానైట్ ఫ్లాట్‌ఫాంతో కూడిన వంటగది, సింక్ చక్కగా ఉన్నాయి. ఆధునిక వసతులతో కూడిన టాయిలెట్ కూడా ఉంది. ఇక కాలనీలో 40 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్ల నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. విద్యుత్ సరఫరా ఇప్పటికే కల్పించారు. అన్ని వసతులతో సిద్ధమైన ఇళ్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. లబ్ధిదారుల చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు... టిడ్కో కాలనీలో ఇళ్ల మంజూరుపత్రాలతో పాటు లబ్ధిదారుల పేరిట రిజి స్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను కూడా మంత్రుల చేతుల మీదుగా అందజేస్తాం. తొలివిడతలో ఏ–కేటగిరీకి సంబంధించిన 15 బ్లాకుల్లోని 480 ఇళ్లు, సి–కేటగిరీకి సంబంధించి 10 బ్లాకుల్లోని 320 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేశాం. లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చులు, వ్యయప్రయాసలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లను ఇస్తాం. సారిపల్లి లే అవుట్లో మిగిలిన 1,856 ప్లాట్లను ఆగస్టునాటికి సిద్ధం చేస్తాం. – ఎస్.జ్యోతి, ఎస్ఈ, ఏపీటిడ్కో (చదవండి: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
దస్తావేజుల్లో సంతకాలపై ఆరోపణలు వస్తే..
సాక్షి, హైదరాబాద్: దస్తావేజుల్లో సంతకాలు అసలైనవో, ఫోర్జరీ చేసినవో తేలాలంటే సంబంధిత రికార్డులను పరిశీలించడమే కాకుండా, నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కింది కోర్టులకు హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ ఏదశలో ఉన్నా నిపుణుడి అభిప్రాయం కోసం ఆదేశాలు జారీ చేయవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఆదేశాలిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని 6.32 ఎకరాలకు (సర్వే నం 144/ఎఎ) సంబంధించిన యాజమాన్య హక్కుపై 2010లో లక్కినేని రమేశ్‌పై లక్కినేని సూర్యనారాయణ ఖమ్మం జిల్లా కోర్టులో దావా వేశారు. ‘నా సంతకాన్ని రమేశ్ ఫోర్జరీ చేసి భూ విక్రయ దస్తావేజును సృష్టించారు. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా రెవెన్యూ అడంగల్‌లో రమేశ్ పేరు చేర్చారు. రమేశ్ చూపించే పహాణీ పత్రాలు సరైనవి కావు. ఎమ్మార్వో నుంచి పహాణీ, అడంగల్స్ తెప్పించి ఏది అసలైందో తేల్చాలి. రిజిస్ట్రేషన్ పత్రాల్లో తన పేరిట ఉన్న సంతకంపై నిపుణుల అభిప్రాయాన్ని కోరాలి’ అని సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను ఖమ్మం కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఖమ్మం జిల్లా కోర్టు ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు. -
రైతులకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు
నర్సాపూర్, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాలు త్వరలో రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా పలు పాస్ పుస్తకాలు స్థానిక తహ శీల్దార్ కార్యాలయానికి వచ్చాయి. భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవగానే నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వచ్చే విధంగా వెబ్‌ల్యాండ్ పద్ధతి అమలులోకి వచ్చింది. రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు తహ శీల్దార్ కార్యాలయానికి రాగానే వీఆర్ ఓలు సంబంధిత గ్రామ రెవెన్యూ రికార్డులలో వాటిని నమోదు చేస్తారు. కాగా గతంలో పాత పాస్ పుస్తకాల్లో తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు రాసేవారు. హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాల వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రాగానే రెవెన్యూ సిబ్బంది తమ రికార్డులలో నమోదు చేస్తే సరిపోతుంది. సబ్ రిజిస్ట్రార్,తహశీల్దార్ కార్యాలయాలను వెబ్‌ల్యాండ్‌లో భాగంగా అనుసంధానం చేసినందున భూముల విక్రయాల సమాచారం ఆయా కార్యాలయాల నుంచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు పూర్తి సమాచారం చేరుతుంది. అక్కడ పాస్ పుస్తకాలు ముద్రించి సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయాలకు పాస్ పుస్తకాలు పంపితే స్థానిక రెవెన్యూ అధికారులు వాటిని సంబంధిత లబ్ధిదారులకు అందచేస్తారు. తాజాగా భూముల కొనుగోలు చేసిన వ్యక్తుల పేర గతంలో పాస్ పుస్తకం జారీ చేసి ఉంటే అదే నంబరుతో కొత్తగా మరో పాస్ పుస్తకంలో పాత భూములతో పాటు తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు కలిపి కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. అంతకు ముందు భూములు లేని పక్షంలో కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. ఇదిలా ఉండగా పట్టాదార్ పాస్‌పుస్తకంలో రైతుల ఫొటో, స్కాన్ చేసిన వారి సంతకంతో పాటు కులం, గ్రామం, భూములు వివరాలు, వారు చెల్లించాల్సిన శిస్తు వివరాలు, పూర్తి అడ్రసు పొందు పరుస్తున్నారు. అంతేగాక సంబంధిత మండల తహశీల్దార్ సంతకం స్కాన్ చేసి వస్తుంది. కాగా ప్రభుత్వం తాజాగా రూపొందించిన హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు శుక్రవారం నర్సాపూర్ మండలంలోని మంతూర్‌కు చెందిన రైతులకు చెందిన ఆరు పాస్ పుస్తకాలు వచ్చాయి. వాటిని త్వరలో అందచేస్తామని అధికారులు చెప్పారు. నకిలీని అరికట్టేందుకు కొత్త పుస్తకాలు: తహశీల్దార్ పట్టాదార్ పాస్ పుస్తకాలలో నకిలీవి అరికట్టేందుకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని స్థానిక తహశీల్దార్ నరేందర్ చెప్పారు. వాటితో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అందులో రైతుల అన్ని భూముల వివరాలు, శిస్తు, ఇతర వివరాలు ఉంటాయని, చేతి రాత అసలే ఉండదని చెప్పారు. కాగా మొదటగా నర్సాపూర్‌కు ఆరు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు వచ్చాయని వాటిన త్వరలో లబ్ధిదారులకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. దశలవారీగా అందరికీ హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు త్వరలో వస్తాయని ఆయన తెలిపారు. -
సీడీల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
టీ.నగర్, న్యూస్‌లైన్: రిజిస్ట్రేషన్ పత్రాలను సీడీల రూపంలో అందచేసే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థల దస్తావేజుల రిజిస్ట్రేషన్, వివాహాల రిజిస్ట్రేషన్ వంటి పనులకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రజలు అధిక సంఖ్యలో ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో పని చేస్తున్నారుు. స్థల సౌకర్యం లేకుండా సిబ్బంది ఇబ్బందులు పడడాన్ని దృష్టిలో ఉంచుకుని సొంతంగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం నామక్కల్ జిల్లా పల్లిపాళ యం, పుదుసత్రం, వేలూరు జిల్లా జోలార్‌పేట, వాలాజా, ఆర్కాడు, కాలనై, తిరువణ్ణామలై జిల్లా దూసి, కీల్కొడుంగాలూరు, కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు, పెరియకాంచీపురం, తూత్తుకుడి జిల్లా పుదూర్, కడంబూరు, ఈరోడ్ జిల్లా కవుందపాడి, కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి, కృష్ణగిరి జిల్లా ఊత్తం గరై, దిండుగల్ జిల్లా గుజిలియం పారై రామనాథపురం జిల్లా కడలాడి, కడలూరు జిల్లా కమ్మాపురం, పుదుకోటై జిల్లా ఇలుపూర్, తిరువూర్ జిల్లా పల్లడం వంటి 20 ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయూలకు కొత్త భవనాలను రూ.9.83 కోట్ల ఖర్చుతో నిర్మించారు. చెన్నై లో రూ.49 లక్షలతో సబ్ రిజిస్ట్రార్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. వీటితోపాటు కొత్త హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పత్రాల రిజిస్ట్రేషన్లను సీడీల రూపం లో అందచేసే పథకాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలు రూ.50 చార్జీ చెల్లించి ఈ సీడీలను అందుకోవచ్చని తెలిపారు. తంజావూరు చిత్ర కళలో శిక్షణ రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించే విధంగా వంద మంది మహిళలకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో వంద మంది మహిళలకు తంజావూరు చిత్రకళలో శిక్షణ ఇప్పించే విధంగా రూ.5 వేల విలువైన ముడిసరుకులతో కూడిన కిట్లు శుక్రవారం అందజేశారు. వీరికి రాష్ట్ర, జాతీయస్థాయిలో తంజావూరు చిత్ర కళలో అవార్డులు పొం దిన వారితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.