
సాక్షి, హైదరాబాద్: దస్తావేజుల్లో సంతకాలు అసలైనవో, ఫోర్జరీ చేసినవో తేలాలంటే సంబంధిత రికార్డులను పరిశీలించడమే కాకుండా, నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కింది కోర్టులకు హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ ఏదశలో ఉన్నా నిపుణుడి అభిప్రాయం కోసం ఆదేశాలు జారీ చేయవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఆదేశాలిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని 6.32 ఎకరాలకు (సర్వే నం 144/ఎఎ) సంబంధించిన యాజమాన్య హక్కుపై 2010లో లక్కినేని రమేశ్‌పై లక్కినేని సూర్యనారాయణ ఖమ్మం జిల్లా కోర్టులో దావా వేశారు. ‘నా సంతకాన్ని రమేశ్ ఫోర్జరీ చేసి భూ విక్రయ దస్తావేజును సృష్టించారు.
అధికారిక ఉత్తర్వులు లేకపోయినా రెవెన్యూ అడంగల్‌లో రమేశ్ పేరు చేర్చారు. రమేశ్ చూపించే పహాణీ పత్రాలు సరైనవి కావు. ఎమ్మార్వో నుంచి పహాణీ, అడంగల్స్ తెప్పించి ఏది అసలైందో తేల్చాలి. రిజిస్ట్రేషన్ పత్రాల్లో తన పేరిట ఉన్న సంతకంపై నిపుణుల అభిప్రాయాన్ని కోరాలి’ అని సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను ఖమ్మం కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఖమ్మం జిల్లా కోర్టు ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment