సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! | Liquor Scam Signatures of Chandrababu Kollu Ravindra on note files | Sakshi
Sakshi News home page

సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!

Published Sat, Nov 25 2023 4:35 AM | Last Updated on Sat, Nov 25 2023 3:32 PM

Liquor Scam Signatures of Chandrababu Kollu Ravindra on note files - Sakshi

సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణం ద్వారా అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన మాజీ సీఎం చంద్రబాబు నిర్వాకాలు సంతకాలు సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లూ ఆయనకు ఏమీ తెలియదంటూ బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాదనలో ఏమాత్రం నిజం లేదని నోట్‌ఫైళ్ల సాక్షిగా తేటతెల్లమైంది. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, గుట్టు చప్పుడు కాకుండా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్‌కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు ప్రయోజనం కల్పించారు.

2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8 శాతం ప్రివిలేజ్‌ ఫీజు ప్లస్‌ జీఎస్టీ, బార్లపై ఉన్న 9 శాతం ప్రివిలేజ్‌ ఫీజు ప్లస్‌ జీఎస్టీని తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. ఈమేరకు సంబంధిత నోట్‌ ఫైళ్లపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిజిటల్‌ సంతకాలు చేసినట్లు  అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినామీలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది!!

ఆర్థిక శాఖ అనుమతి లేదు... కేబినెట్‌ ఆమోదం లేదు
అధికారంలో ఉండగా మద్యం విధానం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడింది. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్‌ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. కనీసం ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్‌ ఆమోదంగానీ లేకుండానే కథ నడిపించింది. రెండు జీవోలకు కేబినెట్‌ తీర్మానం చేసి ప్రివిలేజ్‌ ఫీజు తొలగించే కీలకమైన జీవోను మాత్రం అడ్డదారిలో తేవడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్‌ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ఓ నోట్‌ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు.

అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్‌ దృష్టికే తీసుకెళ్లలేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి 2015 జూన్‌ 22న జీవోలు 216, 217 జారీ చేయగా ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు (ఏ 4 షాపులు) ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రభుత్వానికి ఓ నోట్‌ పంపారు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్‌ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్‌ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారు. ఆ నోట్‌ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈమేరకు ‘కాపీ టు పీఎస్‌ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్‌ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తేలిపోతోంది. 

సాయంత్రం గుట్టుగా జీవో 
చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ అదే రోజు అంటే 2015 జూన్‌ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. ఈ జీవో గురించి కేబినెట్‌లో చర్చించలేదు. అజెండాలో ఆ అంశమే చేర్చలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియచేయలేదు. అనుమతి తీసుకోలేదు. అంటే కేబినెట్‌కు తెలియకుండా, కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

బార్లలోనూ అదే బరితెగింపు...
మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. ఈమేరకు చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేయాలని, అందుకోసం ఎకైŠస్‌జ్‌ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ 
అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ 2015 సెప్టెంబరు 1న ఓ సర్కుల్యర్‌ ఇచ్చారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఈమేరకు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబరు 1నే ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్క్యూలర్‌ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి.

బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్‌ ఆమోదమూ పొందలేదు. ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయించారు. బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్‌ 11న జీవో 468 జారీ అయింది. నాటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపారు. అందుకు సంబంధించిన నోట్‌ ఫైళ్లపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్‌ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్‌ 4న డిజిటల్‌ సంతకాలు చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ అసలు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు బుకాయించారు. 

తీవ్రంగా తప్పుబట్టిన ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌
టీడీపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేయడాన్ని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఈమేరకు తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement