సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది.
ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్‌లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం.
ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు.
అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు.
తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది.
ఇక నిందితుల విచారణే
మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్‌ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్‌ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది.
నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment