సాక్షి, అమరావతి: మద్యం ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు లబ్ధి పొందారని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి పార్టీ నేతలకు, కావాల్సిన వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. డబ్బు లావాదేవీల వ్యవహారాలు తదుపరి దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఎస్‌పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయన డిస్టిలరీకి లబ్ధి చేకూర్చారని తెలిపారు.
మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. ఏజీ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగింపు నోట్ ఫైల్‌ను సిద్ధం చేశారని, దీనికి అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదముద్ర వేశారని తెలిపారు. దీనివల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం కలిగిందన్నారు. ఈ నష్టాన్ని కాగ్ సైతం ధ్రువీకరించిందని చెప్పారు.
ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపలేదని, మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించలేదని తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు పూర్తిగా రాజకీయ నిర్ణయమని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు తదితరులకు పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 2018 జూలైకి ముందు నేరం జరిగినందున గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
దర్యాప్తు అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని, దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ దశలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ముందుకెళ్లదన్నారు. అంతేకాక 31–10–23న పిటిషనర్లపై సీఐడీ కేసు నమోదు చేసిందని, ఆ వెంటనే వారిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. దర్యాప్తును కొనసాగనివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
అనంతరం చంద్రబాబు, రవీంద్రల తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు ఫైల్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరనేలేదన్నారు. అప్పటి ఎక్సైజ్ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగిన పొరపాట్లను క్రిమినల్ చర్యలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాతపూర్వక వాదనలను సమర్పించిన తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment