బీఈడీ.. అంతా వ్యాపారమే!
దూరవిద్యను తలపిస్తున్న రెగ్యులర్ బీఈడీ
- తరగతుల నిర్వహణ అస్తవ్యస్థం
- కౌన్సెలింగ్ నాటికి అఫిలియేషన్స్
శాతవాహన యూనివర్సిటీ: ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, రాజకీయ ఒత్తిళ్లతో ఉపాధ్యాయ విద్య భ్రష్టుపడుతోంది. రెగ్యులర్ బీఈడీ కోర్సు దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. కళాశాలల్లో సౌకర్యాల లేమి, అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలు పాటించని పక్షంలో యూనివర్సిటీ అఫిలియేషన్ రాదని నిబంధనలున్నా.. తీరా వార్షిక పరీక్షల సమయానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుని వాటి మనుగడ సాగిస్తున్నాయి. 2014-15 విద్యాసంవత్సరానికి ఈనెల 21 నుంచి 28 వరకు ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 19 బీఈడీ కళాశాలల పర్యవేక్షణ పూర్తయిందని, వాటి అఫిలియేషన్‌ను కౌన్సెలింగ్‌కు ముందే అందించే యోచనలో ఉన్నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు.
ఎన్నో ఆరోపణలు
జిల్లాలోని చాలా బీఈడీ కళాశాలలు ఉపాధ్యాయ విద్యను వ్యాపార కోణంలోనే చూస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆటస్థలం, లైబ్రరీ, సెమినార్హాళ్లు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా నెట్టుకొస్తున్నాయి. కన్వీనర్ కోటా నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, మేనేజ్మెంట్ కోటాతో వచ్చే డబ్బులను అప్పన్నంగా మింగేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఫీజు వివరాలు
కన్వీనర్ కోటాలో సీటు పొందిన ఉపాధ్యాయ విద్యార్థి పైసా చెల్లించకుండానే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. కళాశాల స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.14,400 నుంచి రూ.16,500 వరకు రీయింబర్స్మెంట్ వస్తోంది. స్కాలర్షిప్ రూపేణ రూ.4500- రూ.5 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2013-14లో బీఈడీ అభ్యసించిన వారికిఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని యాజమాన్యాలు తెలిపాయి.
ఎవరి కోటా ఎంత?
బీఈడీ కళాశాలలో మొత్తం వంద సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలో 75 శాతం, మేనేజ్మెంట్కు 25 శాతం సీట్లు కేటాయించింది. గతంలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల అమ్మకాలు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటే ప్రస్తుతం రెండింతలైనట్లు తెలుస్తోంది.
కోర్సు విధానం
కోర్సులో చేరిన విద్యార్థులు తరగతులకు కనీసం 80 శాతం హాజరు కావాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులుగా బోధన చేయాలి. యూనివర్సిటీ ప్రకారం పరీక్ష ఫీజులు అన్ని కలిపి మొత్తంగా రూ.2,530 చెల్లించాలి.
నిబంధనలకు నీళ్లు
జిల్లాలో 19 బీఈడీ కళాశాలల్లో 2 వేల మంది ఉపాధ్యాయ కోర్సు అభ్యసిస్తున్నారు. పలు కళాశాలల్లో సిబ్బంది సరిగాలేకపోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదు. అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు మెజార్టీ కళాశాలలో లేకున్నా యాజమాన్యాలు ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి గుర్తింపును కాపాడుకుంటున్నాయి.
లేని వసతులకు ఫీజులు
అనేక కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఉన్నా అవి అలంకారప్రాయమేననే విమర్శలున్నాయి. లేనివాటికి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడంతోనే బీఈడీ ప్రమాణాలు పడిపోయాయనే వాదన వినిపిస్తోంది. ఎన్సీటీఈ ప్రకారం కళాశాలకు సొంత భవనం ఉండాలి. కాని నేటికీ కొన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఏడాదిలో కనీస తరగతులు కూడా నిర్వహించే స్థితిలో లేవు. వార్షిక పరీక్షకు హాజరు విషయాల్లోనూ విద్యార్థుల నుంచి డబ్బులు దండుకుంటున్నాయి.
బయోమెట్రిక్ అటెండెన్స్
ఈ విద్యాసంవత్సరం బీఈడీ కళాశాలలో విద్యార్థులకు, అధ్యాపకుల హాజరును బయోమెట్రిక్ సిస్టమ్‌తో నమోదు చేస్తాం. ఈ విధానం అమలుకు ఎస్‌యూ వీసీ గత విద్యాసంవత్సరమే సిద్ధమైనా కొన్ని కారణాలతో చేయలేకపోయాం. ఈసారి కచ్చితంగా అమలు చేస్తాం. నిబంధనలు పాటించని కళాశాలలను ఉపేక్షించేది లేదు.
- ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ డీన్ ఫ్యాకల్టీ, కేయూ వరంగల్