rehabilitate
-
హైదరాబాద్‌లో నరక ‘యాచన’.. ప్లాన్ రెడీ చేసిన అధికార యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో చిన్నారుల యాచనపై ఉక్కుపాదం మోపేందుకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో కూడిన సంచార వాహనాన్ని రంగంలోకి దింపనుంది. ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించింది. త్వరలో సంచార వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి రెండు పర్యాయాలు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం తాజాగా నిరంతర ప్రక్రియగా సంచార వాహనంతో ప్రత్యేక కార్యాచరణకు దిగుతోంది. గత కొనేళ్లుగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు మూణ్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు చేపట్టిన చర్యలతో కొన్నాళ్లపాటు వీరి బెడద తగ్గినా.. మళ్లీ యాచకులకు.. ‘ఫ్రీ’ నగరంగా తయారైంది. దీంతో నగంరలోని ప్రధాన కూడళ్లలో చిన్నారులతో, పసి పిల్లలను చంకన పెట్టుకొని యాచకులు వాహనదారులను అవస్థలకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. విజృంభిస్తోన్న బెగ్గర్ మాఫియా నగరంలో బెగ్గింగ్ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారి, ఆపదల్లో ఉన్నవారి కుటుంబాల చిన్నారులను పట్టుకొచ్చి యాచన చేయిస్తోంది. కుటుంబాలకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు వారి పిల్లలతో భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత ‘వసూలు’ చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెట్టడం, టార్గెట్ మేరకు డబ్బులు తేకపోతే హింసించడం షరామామూలుగా మారింది. నరక ‘యాచన’ అభం శుభం తెలియని పసి పిల్లలను బెగ్గింగ్ మాఫియా నరక యాతనకు గురి చేస్తోంది. పసి పిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమేస్తారన్న ఉద్దేశంతో రెండేళ్లలోపు చిన్నారులను వినియోగిస్తోంది. ముఖ్యంగా నగరానికి వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించడం నిత్యకృత్యమైంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వందలకు వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా యాచకులకు చిన్నారులను ఉదయం ఏడు గంటలకు అందించి సాయంత్రం తీసుకెళ్లడం చేస్తున్నట్లు సమాచారం. కొందరు పసి పాపకు ఆకలి లేకుండా నిద్రలోనే ఉండేలా రెండు, మూడు గంటలకోసారి ప్రమాదకరమైన నల్ల మందు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు వందల మందికిపైగా నగరంలో సుమారు ఐదువందలకు పైగా చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్లు తెలుస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాల్లో చిన్నారులు అధికంగా కనిపిస్తారు. గత ఐదేళ్లలో ఆపరేషన్ ముస్కాన్,ఆపరేషన్ స్మైల్ కింద సుమారు రెండు వేలకు పైగా చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
చెరువు మెరిసి.. చేను మురిసి!
2021–22వ సంవత్సరానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 934 మి.మీ కాగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,485 మి.మీ వర్షపాతం నమోదైంది. 2021 ఖరీఫ్ సీజన్లో 1,90,955 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 1,77,075 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి 37,950 హెక్టార్లలో, వేరుశెనగ 94,629 హెక్టార్లలో, ఇతర పంటలు 44,496 హెక్టార్లలో సాగు చేశారని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల, చెరువులు నిండు కుండల్లా ఉండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అదే విధంగా వర్షాలకు కురిసిన నీటిని సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను పరిశీలిస్తే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్న చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత సర్కారు చేసిన తప్పిదాల వల్ల అనేక మంది రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, నూతన చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ పనులకు వందల కోట్లు వెచ్చిస్తోంది. కాలువల తవ్వకానికి రూ.193.23 కోట్లు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాల్లోని చెరువులకు నీరు సరఫరా చేసేందుకు వరద కాలువ తవ్వకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.193.23 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత విజయవాడకు చెందిన ఎస్‌ఎల్‌టీసీ అనుమతితో టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రవాహ కాలువల ప్రక్రియ పూర్తి కాగానే 2,439 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు ఇలా.. ► శ్రీకాళహస్తి, ఏర్పేడులలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్స్ పునరుద్ధరణ కింద 48 చెరువుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తి కాగానే 13,050 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో జిల్లా వ్యాప్తంగా 187 చెరువుల అభివృద్ధికి రూ.54.39 కోట్లు మంజూరు చేశారు. ► గత ఏడాది నవంబర్‌లో తుఫాను కారణంగా దెబ్బతిన్న 617 చెరువులు, కాలువలు, ఇతర నీటి పారుదల కట్టడాల తాత్కాలిక మరమ్మతులకు రూ.11.37 కోట్లు ఖర్చు చేశారు. ► చిత్తూరు, బంగారుపాళ్యం, గుడిపాల, జీడీనెల్లూరు, సత్యవేడు, వరదయ్యపాళ్యం మండలాల్లో చెరువులు, సరఫరా కాలువల అభివృద్ధికి 15 పనులకు రూ.18.60 కోట్లు మంజూరు చేశారు. ఇవి పూర్తయితే 3,850 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, మొలకలచెరువు, కలకడ, గంగాధరనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, గుర్రంకొండ, కలికిరి మండలాల్లో చెరువుల అభివృద్ధి పనులకు రూ.13.36 కోట్లు మంజూరు చేశారు. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 2,790 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► ఏపీఐఎల్‌ఐపీ–2 పథకంలో భాగంగా 53 చెరువులకు రూ.32.82 కోట్లు మంజూరయ్యాయి. ► పిచ్చాటూరు మండలంలో అరణియార్ ప్రాజెకు పునరుద్ధరణకు రూ.35.64 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. కార్వేటినగరంలో కృష్ణాపురం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.31.80 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయితే 26,626.78 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని ఇరిగేషన్ ఎస్ఈ విజయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. చెరువుల అభివృద్ధికి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పనుల పురోగతిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చెరువులను పునరిద్ధరించడం, ప్రాజెక్టుల పనులతో రైతులకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. జిల్లా మొత్తం మంజూరైన పనులను వేగవంతంగా నిర్వహించి పురోగతి చూపేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాం. – హరినారాయణన్, జిల్లా కలెక్టర్ -
పునరావాసం కల్పించండి
భువనగిరి టౌన్: బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు సోమవారం ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్నామని, తమ గ్రామస్తులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించారు. అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని, తాను సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు హైవేపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. -
సోలార్ బాధితులకు పునరావాసం కల్పించాలి
సాక్షి, కల్లూరు : గని, శకునాల గ్రామాలకు చెందిన సోలార్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవారం శకునాలలో సోలార్ బాధిత కుటుంబాలతో ఏపీ రైతు సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామక్రిష్ణ మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ స్థాపనకు సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కూడా బాధితులకు అవార్డు పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే, అధికారుల ఒత్తిడితో గని, శకునాల గ్రామాల్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న వారి నుంచి సంతకాల సేకరణ చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాధితులకు అందించే పునరావాసం ఎగ్గొంటేందుకే ఉన్నతాధికారులు పనిచేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధితులు చాంద్‌బాషా, శ్రీధర్, శేఖర్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
502మంది మావోయిస్టులు లొంగిపోయారు
నాగ్‌పూర్: మహారాష్ట్రలో 502మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం సానూకూల ఫలితాలను ఇస్తున్నట్లయింది. ఇప్పటి వరకు పదేళ్లలో 502మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 482మంది నిత్యం మావోయిస్టుల అలజడి ఉండే గడ్చిరోలి ప్రాంతం నుంచే ఒంటరిగా పోలీసులకు సరెండర్ అయినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 29, 2005న నక్సల్ సరెండర్ పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీని ప్రారంభించిన తర్వాత లొంగిపోయిన తొలి మావోయిస్టు మదన్ అన్నా అలియాస్ బాలన్ బల్యా. కాగా ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులకు వివిధ పరిశ్రమల్లో నైపుణ్య శిక్షణలు ఇప్పించడం ద్వారా, స్వయం ఉపాధి కల్పించడం ద్వారా పునరావాసం కల్పించారు. -
విశాఖకు పండుగ
నేటినుంచి ఉత్సవ్ మూడు రోజుల పాటు నిర్వహణ సర్వాంగ సుందరంగా విశాఖ {పత్యేక కార్యక్రమాల కనువిందు విశాఖ అర్బన్: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుం దరంగా ముస్తాబైంది. సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుద్‌హుద్ తుపాను ఛాయలు కనిపించని విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయిలో వేదికలను ముస్తాబు చేస్తోంది. విశాఖ పర్యాటకాభివృద్ధికి, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ఈ విశాఖ ఉత్సవ్‌ను వేదికగా చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. విశాఖ ఉత్సవ్ వేడుకలు జరిగే ప్రాంతాల రూపురేఖలు మార్చేశారు. ప్రతి వేదికను విభిన్నంగా, ప్రత్యేక సెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ వద్ద కైలాసగిరిని తలపించే సెట్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వేదికపై ఒకేసారి వంద మంది కళాకారులు ప్రదర్శనల్చినా తట్టుకునే స్థాయిలో స్టేజ్‌ను నిర్మించారు. అక్కడే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రముఖమైన ఎనిమిది దేవాలయాల నమూనాలను నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంగణాలను తీర్చిదిద్దారు. ఇక్కడ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, వేద పారాయణం, కచేరీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గురజాడ కళాక్షేత్రం, వుడా పార్కు, కైలాసగిరి, మధురవాడలో ఉన్న జాతర ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి వేదిక వద్ద తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు చాటి చెప్పే కళలు, నృత్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు కార్యక్రమాలతో పాటు సినీతారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆట, పాటలతో పాటు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించే హాస్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకుల కోసం ఆర్కే బీచ్ నుంచి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వివిధ సంస్థలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఒకవైపు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రముఖుల రాక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ ఉత్సవ్ వేడుకలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆర్కే బీచ్ వద్ద ప్రారంభించనున్నారు. 24వ తేదీన సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకులు, గాయనీ, గాయకులు రానున్నారు. ఉత్సవాలు చివరి రోజు 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. పతంగుల వేడుక విశాఖపట్నం-కల్చరల్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా గురువారం సాయంత్రం గాలిపటాల వేడుక నిర్వహించారు. ఆర్కే బీచ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వేడుకలను ప్రారంభించారు. వుడా, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, మహిళలకు ఉచితంగా గాలిపటాలను అందజేశారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.బాబూరావునాయుడులు పతంగులను ఎగరవేశారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాము లై విశాఖ సంస్కృతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని సూచించారు.