సోమవారం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న తిమ్మాపురం గ్రామస్తులు
భువనగిరి టౌన్: బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు సోమవారం ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్నామని, తమ గ్రామస్తులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించారు. అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని, తాను సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు హైవేపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment