పేటీఎం వాటాను విక్రయించిన రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ కాపిటల్ , పాపులర్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం ద్వారా భారీ లాభాలను మూటగట్టుకుంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ పేటీఎంలోని తన (దాదాపు 1 శాతం) వాటాను విక్రయించింది. చైనా కంపెనీ ఆలీబాబా గ్రూప్ కు రూ. 275 కోట్లకు పేటీఎం వాటాను అమ్మేసింది. ఈ విక్రయంతో భారీ లాభాలను రిలయన్స్ గ్రూప్ దక్కించుకుంది.
ప్రపంచంలోని టాప్ ఈ-కామర్స్ సైట్లలో ఒకటైన పేటిఎంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన ఫైనాన్షియల్ సంస్థ గతంలో రూ.10కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ వాటాను రూ.275కోట్లకు విక్రయించడం విశేషం. దీంతో ఇప్పటికే ఆలీబాబా ఒక వ్యూహాత్మక పెట్టుబడిదారుగా గాన్న పేటీఎం కంపెనీ విలువ 4 బిలియన్ డాలర్లకు చేరింది.
అయితే తన నాన్ కోర్ అసెట్స్ ను క్రమబద్ధీకరించే ప్రణాళికల్లో భాగంగా దాని యాజమాన్య పెట్టుబడులను తగ్గించుకోనున్నట్టు అంతకుముందు రిలయన్స్ కాపిటల్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో పేటీఎం స్థాపకుడు , సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాతృ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ లో 1 శాతం( రూ.325 కోట్ల) వాటాను విక్రయిచారు. కాగా ఈ పరిణామాలపై స్పందించడానికి రిలయన్స్, పేటిఎం ప్రతినిధులు నిరాకరించారు.