Reliance Jio 4G services
-
గిడ్డంగివారి పల్లిలో రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో తన 4జీ మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారి పల్లిలో ప్రారంభించింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జియో సెల్ టవర్ ను కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు జియో అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేంపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన గిడ్డంగివారి పల్లి చుట్టూ కొండలు ఉండటంతో ప్రజలు సరైన మౌలిక సదుపాయాలు, టెలికాం నెట్వర్క్ లేక ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న అనేక సంక్షేమ పథకాలను పొందడంలో ప్రజలు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడప ఎంపీ చొరవ చూపి సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేశారు. ఎంపీ సూచన మేరకు జియో త్వరితగతిన సెల్ టవర్ పనులు పూర్తి చేసి గ్రామంలో హై స్పీడ్ 4జీ మొబైల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. కొత్త సెల్ టవర్ ద్వారా జియో ఇప్పుడు గ్రామ ప్రజలకు హై-స్పీడ్ 4జీ సేవలు అందిస్తోంది. ఫలితంగా విద్యార్థులు కూడా ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా వారి విద్యను కొనసాగించడానికి సహాయపడుతుంది. కోవిడ్ మహమ్మారి సామాన్యులు సంభాషించే విధానాన్ని మార్చింది. ప్రజలు షాపింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, నేర్చుకోవడం, వినోదం పొందడం మరియు ఆర్థికంగా లావాదేవీలు చేసే విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఈ పరివర్తన కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ మార్కెట్లకు కూడా విస్తరించింది. గతంలో 3G సేవలు ఎక్కువగా పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆలా కాకుండా టెలికాం కంపెనీలు ఇప్పుడు 4G హైస్పీడ్ సేవలను కొన్ని వందల మంది జనాభా కలిగిన గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంతో పాటు మన రాష్ట్రం లో కూడా అతి పెద్ద 4జీ సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో తన విస్తృతమైన నెట్వర్క్ మరియు అందుబాటు ధరలో జియోఫోన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని కస్టమర్లు సైతం ఈ సేవలు, వాటి ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. (చదవండి: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!) -
జియో ఫోన్‌పై మరో రూమర్, అదే నిజమైతే..!
బడ్జెట్ ఫోన్ 'జియోనెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే జియో ఫోన్ వినాయక చవితికి విడుదల కావాల్సి ఉండగా..సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్ కాంపోనెట్స్ ధరల కారణంగా..గతంలో అనౌన్స్ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే' విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. జియో ఫోన్ పై రూమర్స్ జియో - గూగుల్ భాగస్వామ్యంలో అతి తక్కువ ధరకే విడుదల కానున్న ఆండ్రాయిడ్ ఫోన్‌పై మరోసారి కొన్ని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. గతంలో (సెప్టెంబర్ 10 రిపోర్ట్ ప్రకారం) ఈ ఫోన్ ధర రూ.5వేలని ప్రచారం జరిగింది. ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్ ధరలతో జియో ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని, రూ.5వేలకే వచ్చే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా రూమర్స్‌తో ఫోన్ ధర రూ.3,499కే లభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తొలిసారి భారతీయలు అతితక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే అవకాశం లభించినట్లవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ సంగతి ఎలా ఉన్నా..ఈ ఫోన్ ధర ఎంత అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయ్ కాంపాక్ట్ డిస్ప్లేతో రానున్న ఈ ఫోన్ 5.5 అంగుళాలు ఉండనుంది. క్వాల్కమ్ క్యూఎం 215 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, 2500ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీబీ అండ్ 3జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ రేర్ కెమెరా, స్నాప్ చాట్ లెన్సెస్, వాయిస్ కమాండ్ కోసం గూగుల్ అసిస్టెంట్స్, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్,ఇతర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. -
రూ.500కే జియో స్మార్ట్ ఫోన్ ! షరతులు వర్తిస్తాయి
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' ఫోన్ అమ్మకాలపై సరికొత్త బిజినెస్ మోడల్‌ను అప్లయ్ చేయనుంది. ఈ 4జీ జియో ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా అతి తక్కువ ధరకే అంటే ఫోన్ ధరలో పదోవంతుకే అందివ్వనుంది. 10వేల కోట్ల టార్గెట్ వినాయకచవితి పండగ సందర్బంగా జియో నెక్ట్స్ మార్కెట్లోకి రానుంది. రాబోయే ఆరు నెలల్లో 5 కోట్ల హ్యాండ్ సెట్లు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయల బిజినెస్ చేయాలని రిలయన్స్ జియో లక్క్ష్యంగా పెట్టుకుంది. దీనికి తగ్గట్టు భారీ స్థాయిలో కొనుగోల్లు జరగాలంటే ఫైనాన్స్ సహకారం ఉండటం అవసరం . దీంతో పలు నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫోన్ ధరలో కేవలం పదిశాతం సొమ్ము చెల్లించి హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా కొనుగోలుదారులు చెల్లించే వీలును కల్పిస్తున్నారు. దీనికి అనుగుణంగా రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ భారీ ఎత్తున ప్లాన్ వేస్తున్నారు. ఇందుకోసం ఎస్బీఐ,పిరమల్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ అస్యూర్, డీఎంఐ ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. షరతులు ఇలా వర్తిస్తాయి! సాధారణంగా ఫైనాన్స్ కంపెనీల సాయంతో ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఫోన్ ధరలో సగం మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే అలాకాదు. రూ.5వేల ఫోన్ ధరపై రూ.500, రూ.7వేల ఫోన్ ధరపై రూ.700 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
రియల్ మీతో జత కట్టిన జియో
రిలయన్స్ జియో రియల్ మీ, ఇతర కంపెనీలతో కలిసి 4జీ, ఇతర గాడ్జెట్స్ తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారీ ఒకరు తెలిపారు. తక్కువ ధరకు 4జీ ఫోన్లను తీసుకురావడంతో పాటు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్ వర్క్ అనుగుణంగా ఫోన్ల తయారీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి దేశంలో చాలా మంది 2జీ నెట్ వర్క్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారని రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ తెలిపారు. త్వరలో వీరి కోసం చాలా తక్కువ ధరలో 4జీ మొబైల్స్ ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: 10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్ మరియు ట్రిక్స్) 4జీ మొబైల్స్ ని తీసుకురావడంకోసం రియల్ మీ, ఇతర సంస్థలతో కలిసి మొబైల్స్ తో పాటు, ఇతర పరికరాలను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు దత్ తెలిపారు. రియల్ మీ సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ.. దేశంలో త్వరలో తక్కువ ధరలో 5జీ మొబైల్స్ ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో మొబైల్స్ ని తీసుకురావడానికి చిప్సెట్లు ముఖ్య పాత్ర పోషించాయని ఆయన అన్నారు. మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ డిజిటల్ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేసిందని తెలిపారు. రానున్న రోజుల్లో 5జీ సహాయంతో కృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు వంటి సాంకేతిక విప్లవం రాబోతుందని తెలిపారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్ పరికరాలను తయారు చేస్తామని ప్రకటించారు. -
నేటి నుంచి జియో పూర్తి సేవలు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు నేటి(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా 4జీ సదుపాయం ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా జియో సిమ్‌ను ఉపయోగించుకునే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్లను తాజాగా ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనే లభ్యమవుతుండగా.. నేటి నుంచి మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలోనూ తీసుకోవచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఆతర్వాత 4జీ డేటా రూ.149 నుంచి రూ.4,999 వరకూ 10 రకాల ప్లాన్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్, ఏడాది పాటు యాప్స్ సబ్స్క్రిప్షన్ వంటివి జియో ఆఫర్ చేస్తోంది. -
రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం
ముంబై: రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ధీరూభాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా రిలయన్స్ జియో 4జీ సేవలను నవీ ముంబైలోని కంపెనీ కార్పొరేట్ పార్క్‌లో ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో సేవలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, వ్యాపార భాగస్వాములకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాణిజ్యపరంగా కంపెనీ కార్యకలాపాలు కొత్త ఏడాది(2016) మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఈ 4జీ సేవల ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది రిలయన్స్ ఉద్యోగులు, ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. జియో 4జీ సేవలు అందుకోవడానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు. -
జూలై నుంచి రిలయన్స్ జియో సేవలు
అంచనాలకన్నా ముందుగానే... క్రెడిట్ సూసీ నివేదిక న్యూఢిల్లీ: మార్కెట్ అంచనాలకు ముందుగానే రిలయన్స్ జియో 4జీ సేవలు జూలై నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయని బ్రోకరేజ్ కంపెనీ క్రెడిట్ సూసీ తన నివేదికలో పేర్కొంది. ఇది టెలికం రంగంపై చాలా ప్రభావాన్ని చూపనుందని వివరించింది. రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించడానికి ముందుగానే తన 4జీ హ్యండ్సెట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపింది. దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిలయన్స్ జియో విక్రయించనున్న 4జీ హ్యండ్సెట్ల ధర 80-90 డాలర్ల మధ్యలో ఉండవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే రిలయన్స్ జియో 4జీ సేవల ప్రారంభ ఏర్పాట్లు తుది దశకు చేరాయని, అలాగే చాలా సర్కిళ్లలో డిస్ట్రిబ్యూటర్ల జాబితా కూడా ఖరారైందని పేర్కొంది. రిలయన్స్ జియోకి సమంగా ఎయిర్టెల్ 4జీ సేవలు: రిలయన్స్ జియోకి ఏమాత్రం తీసిపోకుండా ఎయిర్టెల్ 4జీ సేవలు ఉన్నాయని క్రెడిట్ సూసీ పేర్కొం ది. ఎయిర్టెల్ ఇప్పటికే బెంగుళూరు, ముంబైలలో 4జీ సేవలను అందిస్తోందని, అలాగే గత సోమవారం వైజాగ్, హైదరాబాద్‌లలో కూడా 4జీ ట్రయల్ రన్‌ను నిర్వహించిందని వివరించింది. ప్రస్తుతం 4జీ సర్వీసులలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. ఎయిర్టెల్ 4జీ సర్వీసుల్లో యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్ వేగం బాగుందని కితాబునిచ్చింది. అనుకున్న గడువులోగానే 4జీ సేవలు: ఆర్ఐఎల్ ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట గడువులోనే 4జీ సేవలను ప్రారంభించడానికి తగిన చర్యలు చేపట్టామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. స్పెక్ట్రమ్ లెసైన్స్ నిబంధనల ప్రకారం జూలై చివరి నాటికి రిలయన్స్ కంపెనీ 4జీ సేవలను ప్రారంభించాలి.