జూలై నుంచి రిలయన్స్ జియో సేవలు
అంచనాలకన్నా ముందుగానే... క్రెడిట్ సూసీ నివేదిక
న్యూఢిల్లీ: మార్కెట్ అంచనాలకు ముందుగానే రిలయన్స్ జియో 4జీ సేవలు జూలై నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయని బ్రోకరేజ్ కంపెనీ క్రెడిట్ సూసీ తన నివేదికలో పేర్కొంది. ఇది టెలికం రంగంపై చాలా ప్రభావాన్ని చూపనుందని వివరించింది. రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించడానికి ముందుగానే తన 4జీ హ్యండ్‌సెట్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపింది.
దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిలయన్స్ జియో విక్రయించనున్న 4జీ హ్యండ్‌సెట్ల ధర 80-90 డాలర్ల మధ్యలో ఉండవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే రిలయన్స్ జియో 4జీ సేవల ప్రారంభ ఏర్పాట్లు తుది దశకు చేరాయని, అలాగే చాలా సర్కిళ్లలో డిస్ట్రిబ్యూటర్ల జాబితా కూడా ఖరారైందని పేర్కొంది.
రిలయన్స్ జియోకి సమంగా ఎయిర్‌టెల్ 4జీ సేవలు: రిలయన్స్ జియోకి ఏమాత్రం తీసిపోకుండా ఎయిర్‌టెల్ 4జీ సేవలు ఉన్నాయని క్రెడిట్ సూసీ పేర్కొం ది. ఎయిర్‌టెల్ ఇప్పటికే బెంగుళూరు, ముంబైలలో 4జీ సేవలను అందిస్తోందని, అలాగే గత సోమవారం వైజాగ్, హైదరాబాద్‌లలో కూడా 4జీ ట్రయల్ రన్‌ను నిర్వహించిందని వివరించింది. ప్రస్తుతం 4జీ సర్వీసులలో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్ 4జీ సర్వీసుల్లో యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్ వేగం బాగుందని కితాబునిచ్చింది.
అనుకున్న గడువులోగానే 4జీ సేవలు: ఆర్‌ఐఎల్
ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట గడువులోనే 4జీ సేవలను ప్రారంభించడానికి తగిన చర్యలు చేపట్టామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. స్పెక్ట్రమ్ లెసైన్స్ నిబంధనల ప్రకారం జూలై చివరి నాటికి రిలయన్స్ కంపెనీ 4జీ సేవలను ప్రారంభించాలి.