నేటి నుంచి జియో పూర్తి సేవలు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు నేటి(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా 4జీ సదుపాయం ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా జియో సిమ్‌ను ఉపయోగించుకునే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్‌లను తాజాగా ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనే లభ్యమవుతుండగా.. నేటి నుంచి మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలోనూ తీసుకోవచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం.
ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఆతర్వాత 4జీ డేటా రూ.149 నుంచి రూ.4,999 వరకూ 10 రకాల ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్‌ఎంఎస్, ఏడాది పాటు యాప్స్ సబ్‌స్క్రిప్షన్ వంటివి జియో ఆఫర్ చేస్తోంది.