ఆసిఫ్‌అలీని జైలులోనే విచారించండి
సీసీఎస్ పోలీసులకు కోర్టు ఆదేశాలు
పటన్‌ను విచారించేందుకు సిద్ధమైన ఆర్మీ
హైదరాబాద్: సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌పై ఉన్న ఆసిఫ్‌అలీని ఈ నెల 16, 17 తేదీల్లో జైలులోనే విచారించాలని నాంపల్లి కోర్టు సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. ఆసిఫ్‌అలీని ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ ఇటీవల కోర్టు ఆదేశించిన ఆనంతరం తన ఆరోగ్యం బాగులేదని ఆసిఫ్అలీ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు పై విధంగా తిరిగి ఆదేశాలు జారీ చేసింది. ఆసిఫ్‌అలీని విచారిస్తే అనుష్కఅగర్వాల్ ఎవరు అనే విషయం తెలుస్తుందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.
అనుష్క ట్రాప్‌లో పడి మిలటరీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసిన ఉదంతంలో ప్రధాన నిందితుడైన సికింద్రాబాద్ ఆర్డిలరీ సెంట ర్ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్‌ను గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పటన్, ఆసిఫ్అలీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా, పటన్‌ను ఆర్మీ అధికారులు విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్మీ అతని కస్టడీ కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సాంకేతిక అడ్డంకుల కారణంగా కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అన్ని సవరించుకుని సోమవారం తిరిగి పిటిషన్ వేయడానికి ఆర్మీ అధికారులు సిద్ధమవుతున్నారు.